
జాతీయ మహిళా దినోత్సవం: ‘భారత కోకిల’కు నివాళి
భారతదేశంలో ఫిబ్రవరి 13ను జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ నిర్ణయం వెనుక బలమైన కారణం ఉంది. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరుపొందిన సరోజినీ నాయుడు మహిళా హక్కుల కోసం, ముఖ్యంగా మహిళా ఓటు హక్కు, విద్య కోసం చేసిన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం ఈ రోజును కేటాయించింది. ఈ దినోత్సవాన్ని అధికారికంగా భారత ప్రభుత్వం 2014 నుండి మరింత ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది. భారతీయ మహిళా సంఘాలు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతిపాదనల మేరకు, మహిళా సాధికారతకు చిహ్నంగా ఆమె 135వ జయంతి సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించడం ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి8) ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది, కానీ భారతదేశానికి స్వయంప్రతిపత్తి కలిగిన, దేశీయ చరిత్రతో ముడిపడిన ఒక ప్రత్యేక దినం ఉండాలనే ఉద్దేశంతో సరోజినీ నాయుడు పుట్టినరోజును ఎంచుకున్నారు.
ఎలా నిర్వహిస్తారు
దేశవ్యాప్తంగా జాతీయ మహిళా దినోత్సవాన్ని వివిధ రూపాల్లో నిర్వహిస్తారు. పాఠశాలలు కళాశాలల్లో సరోజినీ నాయుడు జీవిత చరిత్రపై వ్యాస రచన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తారు. విద్యార్థులకు ఆమె రాసిన కవితలను పరిచయం చేస్తారు. కేంద్ర, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖలు ఈ రోజున ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తాయి. సమాజంలో విశేష సేవలు అందించిన మహిళలకు పురస్కారాలు అందించి గౌరవిస్తారు. మహిళల భద్రత, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం, సమాన వేతనం వంటి అంశాలపై సెమినార్లు నిర్వహిస్తారు. ఆమెను 'భారత కోకిల' అని పిలుస్తారు కాబట్టి, ఆమె కవితల గానం, నాటక ప్రదర్శనలు నిర్వహిస్తారు.
దేశ నిర్మాణంలో మహిళల పాత్ర
ఈ దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, దేశ పురోభివృద్ధిలో స్త్రీ శక్తిని స్మరించుకునే సందర్భం. సరోజినీ నాయుడు మొదటి మహిళా గవర్నర్‌గా ఎలాగైతే బాటలు వేశారో, నేడు పంచాయతీల నుండి పార్లమెంటు వరకు మహిళల ప్రాతినిధ్యం పెరగాలని ఈ రోజున తీర్మానాలు చేసుకుంటారు. సామాజిక మార్పు కోసం వరకట్న వేధింపులు, బాల్య వివాహాలు వంటి సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడాలని మహిళలను చైతన్యపరుస్తారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం మహిళలు స్వయం ఉపాధి పొందేలా, ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించే పథకాలపై అవగాహన కల్పిస్తారు.
సరోజినీ నాయుడు కేవలం స్వాతంత్ర సమరయోధురాలిగానే కాకుండా, అణచివేతకు గురవుతున్న మహిళల గొంతుకగా నిలిచారు. 1917లో ఆమె 'ఉమెన్స్ ఇండియా అసోసియేషన్' స్థాపనలో కీలక పాత్ర పోషించారు. ఆమె చూపిన ధైర్యం, ఆత్మవిశ్వాసం నేటి మహిళలకు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నాయి. అడ్డంకులను అధిగమించి శిఖరాలను అధిరోహించవచ్చని ఆమె జీవితం నిరూపించింది. అందుకే ఈ రోజు సరోజినీ నాయుడు 147వ జయంతి సందర్భంగా ఆమె గురించిన వివరాలు తెలుసుకుందాం ..
సరోజినీ నాయుడు: ఒక ధృవతార
భారతదేశ చరిత్రలో అసాధారణమైన మేధస్సు, ధైర్యం, వాక్చాతుర్యం కలిగిన అతికొద్ది మంది మహిళల్లో సరోజినీ నాయుడు అగ్రగణ్యులు. ఆమె కేవలం ఒక రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు, దేశం గర్వించదగ్గ కవయిత్రి కూడా. అందుకే ఆమెను ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’ లేదా ‘భారత కోకిల’ అని పిలుచుకుంటాం. ఆమె గౌరవార్థం ప్రతి ఏటా ఫిబ్రవరి 13న భారతదేశం 'జాతీయ మహిళా దినోత్సవం' జరుపుకుంటుంది.
బాల్యం, విద్యాభ్యాసం
సరోజినీ నాయుడు 1879, ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో ఒక విద్యావంతులైన బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి డాక్టర్ అఘోరనాథ్ చట్టోపాధ్యాయ నిజాం కాలేజీ స్థాపకుడు, గొప్ప శాస్త్రవేత్త, తల్లి వరద సుందరీ దేవి కవయిత్రి.
చిన్నప్పటి నుంచే సరోజినీ నాయుడు చదువులో అత్యంత ప్రతిభ కనబరిచేవారు. కేవలం 12 ఏళ్ల వయసులోనే ఆమె మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి మెట్రిక్యులేషన్ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె మేధస్సును గుర్తించిన అప్పటి నిజాం ప్రభువు ఆమెకు విదేశాల్లో చదువుకోవడానికి స్కాలర్‌షిప్ ఇచ్చారు. దీనితో ఆమె లండన్‌లోని కింగ్స్ కాలేజీ మరియు కేంబ్రిడ్జ్‌లోని గిర్టన్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు.
సరోజినీ నాయుడు తన 19వ ఏట, ఉన్నత చదువులు ముగించుకుని వచ్చిన తర్వాత, కులాంతర వివాహం చేసుకున్నారు. ఆమె భర్త డాక్టర్ ముత్యాల గోవిందరాజులు నాయుడు. వీరి వివాహం 1898లో అప్పటి సమాజంలో ఎంతో విప్లవాత్మకంగా జరిగింది. వీరికి ఐదుగురు సంతానం జయసూర్య, పద్మజ, రణధీర్, నీలవార్, లీలామణి. వీరిలో పద్మజ నాయుడు తర్వాతి కాలంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా సేవలు అందించారు. సరోజినీ నాయుడు కుటుంబం మొత్తం దేశభక్తితో నిండి, భారత స్వాతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్నది.
స్వాతంత్ర పోరాటంలో …
బ్రిటన్‌లో ఉన్న సమయంలోనే ఆమెకు గోపాలకృష్ణ గోఖలే, అనిబిసెంట్ వంటి గొప్ప నాయకులతో పరిచయం ఏర్పడింది. వారి స్ఫూర్తితో ఆమె భారత స్వాతంత్ర పోరాటంలోకి అడుగుపెట్టారు. 1916లో మహాత్మా గాంధీని కలిసిన తర్వాత, ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. గాంధీజీ అహింసా సిద్ధాంతాలకు ఆకర్షితురాలై, దేశవ్యాప్తంగా పర్యటించి మహిళల్లో చైతన్యం నింపారు.
1920లో గాంధీజీ పిలుపునిచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమంలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. 1925లో కాన్పూర్ సెషన్‌లో భారత జాతీయ కాంగ్రెస్‌కు మొదటి భారతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు.
1930లో ధరాసన ఉప్పు సత్యాగ్రహానికి ఆమె నాయకత్వం వహించారు. గాంధీజీ అరెస్టయిన తర్వాత ఉద్యమాన్ని ఆమె ముందుండి నడిపించారు.1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు గాను ఆమె దాదాపు 21 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు.
కవయిత్రిగా ‘భారత కోకిల’
సరోజినీ నాయుడు రాసిన కవితలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. ఆమె కవిత్వంలో భారతీయ సంస్కృతి, ప్రకృతి, ప్రేమ, దేశభక్తి మిళితమై ఉంటాయి. ఆమె ప్రసిద్ధ రచనలు ,ది గోల్డెన్ త్రెషోల్డ్, ది బర్డ్ ఆఫ్ టైమ్, ది బ్రోకెన్ వింగ్ , ది సెప్టర్డ్ ఫ్లూట్. ఆమె రాసిన 'ది గిఫ్ట్ ఆఫ్ ఇండియా' వంటి కవితలు భారతీయుల త్యాగాలను అద్భుతంగా ఆవిష్కరించాయి.
స్వతంత్ర భారత తొలి మహిళా గవర్నర్
భారతదేశానికి స్వాతంత్ర వచ్చిన తర్వాత, సరోజినీ నాయుడు యునైటెడ్ ప్రావిన్సెస్ (ప్రస్తుత ఉత్తరప్రదేశ్) కు గవర్నర్‌గా నియమితులయ్యారు. తద్వారా భారతదేశంలో ఒక రాష్ట్రానికి గవర్నరైన మొదటి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. రాజ్యాంగ పరిషత్ సభ్యురాలిగా భారత రాజ్యాంగ రూపకల్పనలో కూడా ఆమె తన వంతు సహకారం అందించారు.
సరోజినీ నాయుడు 1949 మార్చి 2న లక్నోలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె రాసిన కవితలు, ఆమె చేసిన త్యాగాలు భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. భారతదేశ చరిత్రలో ఆమె ఒక వెలుగులీనే ధృవతార.
సరోజినీ నాయుడు జ్ఞాపకార్థం ఆమె ఆశయాలను కొనసాగించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమె కుటుంబ సభ్యులు పలు ట్రస్టులు, సంస్థలు, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వాటిలో ముఖ్యమైనవి..
సరోజినీ నాయుడు మెమోరియల్ ట్రస్ట్
ఇది ఆమె పేరుతో ఉన్న అత్యంత ప్రధానమైన సంస్థ. మహిళా సాధికారత, విద్య, పేద ప్రజలకు వైద్య సహాయం అందించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ముఖ్యంగా మహిళలకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం, చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి ప్రోత్సహించడం వంటి పనులు ఈ ట్రస్ట్ ద్వారా జరుగుతుంటాయి.
పద్మజ నాయుడు మెమోరియల్ ట్రస్ట్
సరోజినీ నాయుడు కుమార్తె పద్మజ నాయుడు (ఈమె కూడా గవర్నర్‌గా పనిచేశారు) పేరు మీద కూడా ట్రస్ట్ ఉంది. సరోజినీ నాయుడు నివాసమైన హైదరాబాద్‌లోని "గోల్డెన్ త్రెషోల్డ్"ను ఈ ట్రస్ట్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇక్కడ సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి.
వైద్య సేవలు - సరోజినీ దేవి కంటి ఆసుపత్రి
హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ప్రభుత్వ కంటి ఆసుపత్రికి ఆమె గౌరవార్థం "సరోజినీ దేవి కంటి ఆసుపత్రి" అని పేరు పెట్టారు. వేలాది మంది పేద ప్రజలకు ఇక్కడ ఉచితంగా నేత్ర చికిత్సలు అందుతున్నాయి. ఇది ప్రభుత్వం నేరుగా నిర్వహిస్తున్న అతిపెద్ద సేవా సంస్థ.
విద్యా సంస్థలు
ప్రభుత్వం ఆమె పేరు మీద అనేక మహిళా కళాశాలలను నడుపుతోంది.
సరోజినీ నాయుడు వనితా మహావిద్యాలయ (హైదరాబాద్) దక్షిణ భారతదేశంలోనే మహిళా విద్యకు పునాది వేసిన సంస్థల్లో ఒకటి.
సరోజినీ నాయుడు ప్రభుత్వ బాలికల కళాశాల (భోపాల్) మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆమె పేరు మీద ఒక పెద్ద ప్రభుత్వ కళాశాలను నడుపుతోంది.
సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని లలిత కళల విభాగం ఆమె పేరు మీద నడపబడుతోంది. ఇక్కడ కవిత్వం, థియేటర్ ఆర్ట్స్, కమ్యూనికేషన్స్ వంటి రంగాలలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు.
ప్రభుత్వ పథకాలు, అవార్డులు
కేంద్ర ప్రభుత్వం ఆమె జయంతి రోజున (ఫిబ్రవరి 13) మహిళలకు విశిష్ట సేవా పురస్కారాలను అందజేస్తుంది. ఆమె పేరుతో పోస్టల్ స్టాంపులను విడుదల చేసి, ఆ నిధులను సేవా కార్యక్రమాలకు, సాహిత్య పరిశోధనలకు కేటాయిస్తుంటారు. ఆమె నివాసమైన "గోల్డెన్ త్రెషోల్డ్" ఇప్పుడు ఒక చారిత్రక వారసత్వ కట్టడంగా ఉంది. హైదరాబాద్ లోని నాంపల్లి ప్రాంతంలో ఉన్న ఈ భవనాన్ని సందర్శించవచ్చు.
తెలంగాణాలో ఫిబ్రవరి 13వ తేదీన 'ఆంగ్ల భాషా దినోత్సవం'
భారత కోకిల, ప్రముఖ కవయిత్రి సరోజినీ నాయుడు జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫిబ్రవరి 13వ తేదీన 'ఆంగ్ల భాషా దినోత్సవం' నిర్వహించాలని రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణా సంస్థ (ఎస్సీఈఆర్టీ ) నిర్ణయించింది. తెలంగాణ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ చేసిన విన్నపాన్ని మన్నిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుండి ప్రతి ఏటా ఫిబ్రవరి 13న సరోజినీ నాయుడు పుట్టినరోజును ఆంగ్ల భాషా దినోత్సవంగా జరపాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
వ్యాసరచన, వక్తృత్వ పోటీలు:
ఈ సందర్భంగా 6 నుండి 10వ తరగతి విద్యార్థులు వారి అభ్యసన ఫలితాలకు అనుగుణంగా ఇతివృత్తాలను ఎంచుకుని, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, సృజనాత్మక వర్క్‌షాప్‌లు (కథలు, కవితలు, పోస్టర్ మేకింగ్) నిర్వహించాలని, ఫిబ్రవరి 13, 2026,(ఈ రోజు)న ఆంగ్ల భాష యొక్క ప్రపంచ, సాంస్కృతిక ప్రాముఖ్యతను చాటిచెబుతూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ స్కూళ్ళు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, గురుకులాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఆదేశించారు. సరోజినీ నాయుడు రాసిన సాహిత్యాన్ని, ఆమె చేసిన సేవలను విద్యార్థులకు వివరించాలని ఈ సందర్భంగా సూచించారు.
