
జాతీయ భద్రతే.. ‘కేంద్రం’గా బడ్జెట్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2026–27 ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజల కోసం ప్రత్యేక పథకాలు లేనందు వల్ల సామాన్య ప్రజలకు నిరాశే ఎదురైంది. పేదల కోసం కొన్ని పథకాలు ఉన్నప్పటికీ, ఎక్కువ భాగం రక్షణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతర పెద్ద రంగాలపై మాత్రమే నిధులు కేటాయించడం వల్ల మధ్యతరగతి విస్మరించబడినట్లు విమర్శలు వస్తున్నాయి. కానీ వైద్యానికి సంబంధించిన ఔషద ధరలను కేంద్రం తగ్గించి కాస్తాంతా ఊరట కల్పించింది. ఎన్డీయే ప్రభుత్వం దీన్ని గొప్ప బడ్జెట్‌గా వివరిస్తున్నా, ప్రతిపక్షాలు కఠినంగా విమర్శించాయి. కార్పోరేట్ వర్గాలు మాత్రం సంతృప్తి వ్యక్తం చేశాయి.
తన తొమ్మిదో వరుస కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ముందు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. సాంప్రదాయం ప్రకారం, బడ్జెట్ ప్రసంగానికి ముందు ఆర్థిక మంత్రి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతిని కలవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌లో జరిగిన సమావేశంలో, బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి ముర్ము ఆర్థిక మంత్రికి, ఆమె బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆరుగురు కార్యదర్శులతో కలిసి రాష్ట్రపతి భవన్‌లో హాజరయ్యారు. రాష్ట్రపతి కార్యాలయం ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
బడ్జెట్‌కు శుభసూచకంగా భావించే ‘దహీ-చినీ’ (పెరుగు–పంచదార)ను రాష్ట్రపతి ముర్ము ఆర్థిక మంత్రికి అందజేశారు. అనంతరం నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు బయలుదేరారు. ఇదే సమయంలో కర్తవ్య భవన్‌లోని తన కార్యాలయం ఎదుట ఆర్థిక మంత్రి తన బడ్జెట్ బృందంతో కలిసి ఫోటోలకు పోజిచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఎరుపు, నీలం (మజెంటా) రంగులో ఉన్న తమిళనాడు కాంచీపురం పట్టు చీర ధరించారు. జాతీయ చిహ్నం ఉన్న ఎరుపు రంగు కవర్‌లో టాబ్లెట్‌ను ఆమె చేతిలో పట్టుకున్నారు. ఆమె వెంట ఆర్థిక శాఖ సహాయ మంత్రి, ఆరుగురు కార్యదర్శులు ఉన్నారు. ఈ సమావేశం అనంతరం, 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌కు అధికారిక ఆమోదం తెలపడానికి జరిగే మంత్రివర్గ సమావేశానికి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆదివారం కేంద్ర బడ్జెట్ 2026-27ను ఆమోదించింది. 2019 నుంచి ఆమె ప్రారంభించిన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈ సారి కూడా బడ్జెట్ ప్రసంగాన్ని ‘బహీ-ఖాతా’ శైలిలోనే ఆమె తీసుకువెళ్లారు. బ్రీఫ్‌కేస్ విధానాన్ని విరమించి ఈ పద్ధతిని ఆమె అప్పట్లో ప్రవేశపెట్టారు.
‘పూర్వోదయ’ రాష్ట్రాల్లో ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్, 5 పర్యాటక కేంద్రాలు
తూర్పు భారతదేశ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌ను కీలక నోడ్‌గా అభివృద్ధి చేయనున్నారు. అలాగే ‘పూర్వోదయ’ పథకం కింద ఐదు రాష్ట్రాల్లో ఐదు పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధికి ప్రతిపాదన చేసింది. ఈశాన్య భారతంలో బౌద్ధ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఆరు ఈశాన్య రాష్ట్రాల్లో బౌద్ధ సర్క్యూట్ల అభివృద్ధి పథకం ప్రారంభించనున్నట్లు తెలిపారు. దుర్గాపూర్‌లో ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి, పూర్వోదయ రాష్ట్రాల్లో ఐదు పర్యాటక కేంద్రాల ఏర్పాటు, అలాగే 4,000 ఈ-బస్సుల ఏర్పాటు ప్రతిపాదిస్తున్నానని బడ్జెట్ ప్రసంగంలో సీతారామన్ చెప్పారు.
మోడీ ప్రభుత్వం 3.0 అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసిన సందర్భంగా, వికసిత్ భారత్ 2047 విజన్ కింద చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా ‘పూర్వోదయ’ పథకాన్ని 2024 సెప్టెంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద బీహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమగ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టనున్నారు.
పూర్వోదయ పథకం లక్ష్యాలు
మానవ వనరుల అభివృద్ధి, మౌలిక వసతుల బలోపేతం, ఆర్థిక అవకాశాల విస్తరణ ఈ చర్యల ద్వారా తూర్పు భారతదేశాన్ని దేశ ఆర్థిక వృద్ధికి కీలక డ్రైవర్‌గా మార్చాలని కేంద్రం భావిస్తోంది. ఈశాన్య భారతంలో బౌద్ధ సంప్రదాయాల ప్రాధాన్యతను ప్రస్తావించిన సీతారామన్, ఆ ప్రాంతం థెరవాద, మహాయాన (వజ్రయాన) బౌద్ధ సంప్రదాయాల సాంస్కృతిక సంగమంగా పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో బౌద్ధ సర్క్యూట్ల అభివృద్ధికి ప్రత్యేక పథకం ప్రారంభిస్తామని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో అనేక చారిత్రక బౌద్ధ మఠాలు, పవిత్ర స్థలాలు ఉన్నాయని కేంద్రం పేర్కొంది.
బయోఫార్మా తయారీ కేంద్రంగా మార్చేందుకు రూ.10,000 కోట్లు
భారత్‌ను ప్రపంచ స్థాయి బయోఫార్మా తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు వచ్చే ఐదేళ్లలో రూ.10,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 1,000 క్లినికల్ ట్రయల్ కేంద్రాల ఏర్పాటు, అలాగే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ బలోపేతం చేయాలని ప్రతిపాదించారు. బయోఫార్మాస్యూటికల్స్ (బయోలాజిక్స్) అనేవి రసాయన సంయోగాలతో కాకుండా, జీవ కణాలు, జీవ కణజాలాలు లేదా జీవుల నుంచి తయారయ్యే క్లిష్టమైన ఔషధాలు. ఇవి ముఖ్యంగా క్యాన్సర్, షుగర్, ఆటోఇమ్యూన్ వ్యాధులు వంటి నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ చికిత్సలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఈ సందర్భంగా డెలాయిట్ ఇండియా భాగస్వామి ఆంటోని ప్రశాంత్ మాట్లాడుతూ ఫార్మా రంగంలో తదుపరి వృద్ధి పరిమాణం (వాల్యూమ్) కంటే నాణ్యత, ఆవిష్కరణలు, స్థిరత్వంపై ఆధారపడి ఉంటుంది. బయోలాజిక్స్, బయోసిమిలార్స్‌పై దృష్టి పెరగాలి. ‘బయోఫార్మా శక్తి’ పథకం పరిశ్రమను సరైన దిశలో నడిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ పథకం ద్వారా తయారీతో పాటు, డ్రగ్ డిస్కవరీ, క్లినికల్ ట్రయల్స్, మార్కెట్ యాక్సెస్ వరకు బయోఫార్మా విలువ గొలుసులో భారత్ పోటీగా నిలుస్తుందని ఆయన తెలిపారు. రాబోయే 3–4 ఏళ్లలో భారత ఫార్మా పరిశ్రమ 130 బిలియన్ డాలర్ల మార్కెట్‌కు చేరుకునే అవకాశముందని అంచనా వేశారు.
క్యాన్సర్ రోగులకు ఊరటగా మరో కీలక ప్రకటనను ఆర్థిక మంత్రి చేశారు. 17 క్యాన్సర్ ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారు. అరుదైన వ్యాధుల చికిత్స కోసం వ్యక్తిగత దిగుమతులపై డ్యూటీ మినహాయింపునకు అర్హత పొందే వ్యాధుల జాబితాలో ఇంకా 7 అరుదైన వ్యాధులను చేర్చారు. ప్రపంచంలో ఔషధాల ఉత్పత్తిలో భారత్ మూడో స్థానంలో ఉండగా, ప్రపంచ జనరిక్ ఔషధ అవసరాల్లో సుమారు 20 శాతం భారత్ నుంచే సరఫరా అవుతోంది. 2025లో భారత ఫార్మా రంగం వార్షిక టర్నోవర్ రూ.4.72 లక్షల కోట్లు కాగా, గత దశాబ్దంలో (2015–2025) ఎగుమతులు సగటున 7 శాతం వృద్ధి నమోదు చేశాయి. ప్రస్తుతం భారత ఔషధాలు 191 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
ఎల్ఆర్ఎస్ కింద విద్య, వైద్య ఖర్చులపై టీసీఎస్ తగ్గింపు ప్రతిపాదన
2 శాతానికి కుదించనున్న కేంద్ర ప్రభుత్వం
లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద విద్యా, వైద్య అవసరాల కోసం విదేశాలకు పంపే డబ్బుపై వసూలు చేసే టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ యట్ సోర్స్ ) రేటును 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026–27 కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ కింద విద్యా అభ్యాసం, వైద్య చికిత్సల కోసం చేసే రిమిటెన్స్‌లపై ప్రస్తుతం ఉన్న 5 శాతం టీసీఎస్‌ను 2 శాతానికి తగ్గిస్తున్నామని ప్రకటించారు. ప్రస్తుతం రూ.10 లక్షలకు పైగా విదేశాలకు పంపే మొత్తంపై ఈ టీసీఎస్ వర్తిస్తోంది. తాజా ప్రతిపాదన ప్రకారం, విద్య లేదా వైద్య చికిత్సల కోసం పంపే మొత్తంపై ఇకపై కేవలం 2 శాతం టీసీఎస్ మాత్రమే వసూలు చేయనున్నారు. అయితే, విద్య, వైద్య అవసరాల మినహా ఇతర ప్రయోజనాల కోసం చేసే విదేశీ రిమిటెన్స్‌లపై మాత్రం 20 శాతం టీసీఎస్ యథావిధిగా కొనసాగుతుంది అని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ కింద మైనర్లు సహా ప్రతి భారతీయ నివాసితుడు ఒక్క ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్–మార్చి) గరిష్టంగా 2.5 లక్షల డాలర్ల వరకు విదేశాలకు పంపే అవకాశం ఉంది. ఈ మొత్తం ప్రస్తుత ఖాతా లేదా మూలధన ఖాతా లావాదేవీలకు లేదా రెండింటి కలయికకు ఉపయోగించవచ్చు. అలాగే, విదేశీ టూర్ ప్యాకేజీల విక్రయాలపై కూడా టీసీఎస్‌ను భారీగా తగ్గించనున్నట్లు మంత్రి ప్రకటించారు.
రూ.10 లక్షల వరకు టూర్ ప్యాకేజీలపై 5 శాతం టీసీఎస్, రూ.10 లక్షలకుపైగా ఉంటే 20 శాతం టీసీఎస్ వసూలు చేస్తున్నారు. తాజా బడ్జెట్ ప్రతిపాదన ప్రకారం, మొత్తంతో సంబంధం లేకుండా విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్‌ను 2 శాతానికి తగ్గించనున్నారు.
ఇదే సమయంలో, కొన్ని నిర్దిష్ట వస్తువుల విక్రయాలపై టీసీఎస్‌ను కూడా సమంజసం చేయాలని కేంద్రం నిర్ణయించింది. మద్యం (మనుషుల వినియోగానికి), స్క్రాప్ (చెత్త లోహాలు), ఖనిజాలు (బొగ్గు, లిగ్నైట్, ఇనుప ఖనిజం) వంటి వాటిపై టీసీఎస్ రేటును 2 శాతానికి సరళీకరించనున్నారు.
10 విభాగాల్లో లక్ష మంది అనుబంధ ఆరోగ్య నిపుణుల నియామకం
రాబోయే ఐదేళ్లలో 10 ఎంపిక చేసిన విభాగాల్లో లక్ష మంది అనుబంధ ఆరోగ్య నిపుణులను వ్యవస్థలోకి తీసుకువస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2026–27ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన చేశారు.
ఈ పథకం కింద ఆప్టోమెట్రీ, రేడియాలజీ, అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, అప్లైడ్ సైకాలజీ, బిహేవియరల్ హెల్త్ ఇలా మొత్తం 10 విభాగాల్లో శిక్షణ ఇచ్చి, లక్ష మంది అనుబంధ ఆరోగ్య నిపుణులను తయారు చేస్తామని మంత్రి తెలిపారు. అలాగే వృద్ధుల సంరక్షణ, అనుబంధ సంరక్షణ సేవలను బలోపేతం చేసే బలమైన కేర్ సిస్టమ్ ను నిర్మిస్తామని వెల్లడించారు. వైద్య సహాయక పరికరాల నిర్వహణ వంటి నైపుణ్యాలు కలిగిన మల్టీ-స్కిల్డ్ కేర్ గివర్లకు శిక్షణ కార్యక్రమాలు రూపొందించనున్నట్లు తెలిపారు. రాబోయే ఏడాదిలోనే 1.5 లక్షల మంది కేర్ గివర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
రక్షణ బడ్జెట్ రూ.7.84 లక్షల కోట్లకు కేటాయింపు
కేంద్ర ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి రక్షణ రంగానికి రూ.7,84,678 కోట్లను కేటాయించింది. గత ఏడాది (2025–26) రక్షణ బడ్జెట్ కేటాయింపు రూ.6,81,210 కోట్లుగా ఉండగా, ఈసారి గణనీయంగా పెరిగింది. ఈ బడ్జెట్‌లో మొత్తం మూలధన వ్యయం: రూ.2,19,306 కోట్లు, రెవెన్యూ వ్యయం: రూ.5,53,668 కోట్లు, రెవెన్యూ వ్యయంలో భాగంగా సైనికుల పెన్షన్లకు రూ.1,71,338 కోట్లు కేటాయించారు. అలాగే విమానాలు, ఏరో ఇంజిన్ల కొనుగోలుకు రూ.63,733 కోట్లు, నౌకాదళానికి చెందిన నౌకలు, ఫ్లీట్ అభివృద్ధికి రూ.25,023 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే 2025–26లో రక్షణ బడ్జెట్‌కు రూ.6,81,210 కోట్లు కేటాయించగా, అప్పట్లో మూలధన వ్యయం రూ.1,80,000 కోట్లుగా ఉండి సవరించిన అంచనాల్లో అది రూ.1,86,454 కోట్లకు పెరిగింది. సివిలియన్, ట్రైనింగ్, ఇతర విమానాల తయారీకి అవసరమైన విడిభాగాలు, భాగాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ప్రకటించారు. అలాగే రక్షణ రంగంలో నిర్వహణ, మరమ్మతుల కోసం ఉపయోగించే విమాన భాగాల తయారీలో అవసరమైన ముడి పదార్థాల దిగుమతిపై కూడా ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ మాఫీ ప్రకటించారు.
రూ.10,000 కోట్లతో కంటైనర్ తయారీ పథకం
భారత్‌ను ప్రపంచ స్థాయి కంటైనర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, వచ్చే ఐదు సంవత్సరాల కాలానికి రూ.10,000 కోట్ల వ్యయంతో కంటైనర్ మాన్యుఫ్యాక్చరింగ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర బడ్జెట్ 2026–27ను లోక్‌సభలో ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కీలక ప్రకటన చేశారు. ఈ పథకం ద్వారా ప్రపంచానికి పోటీగా నిలిచే కంటైనర్ తయారీ ఎకో సిస్టమ్ ను దేశంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
పర్యావరణ అనుకూల సరుకు రవాణాకు ప్రోత్సాహం, సరుకు రవాణాను మరింత పర్యావరణ హితంగా మార్చే దిశగా, కన్స్ట్రక్షన్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్‌మెంట్ రంగాన్ని బలోపేతం చేయడానికి, అధునాతన సాంకేతికతతో కూడిన, అధిక విలువ గల పరికరాల దేశీయ తయారీకి ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి తెలిపారు.
కొత్త డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్
తూర్పు–పడమర ప్రాంతాల మధ్య సరుకు రవాణాను వేగవంతం చేయడానికి,
తూర్పున డాంకుని (పశ్చిమ బెంగాల్) నుంచి, పడమరలో సూరత్ (గుజరాత్) వరకు, కొత్త డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డీఎఫ్సీ) ఏర్పాటు చేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
జాతీయ జలమార్గాల విస్తరణ
దేశంలోని అంతర్గత జలమార్గాల వినియోగాన్ని పెంచే దిశగా, వచ్చే ఐదు సంవత్సరాల్లో 20 కొత్త జాతీయ జలమార్గాలను కార్యకలాపాల్లోకి తీసుకురానున్నారు. ఇందులో తొలి దశగా ఒడిశాలోని నేషనల్ వాటర్‌వే–5ను ప్రారంభిస్తారు. ఇది తల్చెర్, అంగుల్ వంటి ఖనిజ సంపన్న ప్రాంతాలను కాలింగా నగర్ వంటి పారిశ్రామిక కేంద్రాలతో అనుసంధానిస్తూ పరదీప్, ధమ్రా పోర్టుల వరకు కలుపుతుంది.
అంతర్గత జలమార్గాల కోసం నౌకా మరమ్మతు కేంద్రాలు
అంతర్గత జలమార్గాల రవాణాను మరింత సమర్థవంతం చేయడానికి, వారణాసి, పాట్నా నగరాల్లో ప్రత్యేక షిప్-రిపేర్ ఎకోసిస్టమ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
కోస్టల్ కార్గో ప్రోత్సాహక పథకం
రైలు, రోడ్డు మార్గాలపై భారం తగ్గించేందుకు, సరుకు రవాణాను జలమార్గాలు, తీర రవాణా వైపు మళ్లించేందుకు కోస్టల్ కార్గో ప్రమోషన్ స్కీమ్ ప్రారంభించనున్నారు. దీని ద్వారా ప్రస్తుతం 6 శాతంగా ఉన్న జలమార్గాలు–తీర రవాణా వాటాను 2047 నాటికి 12 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
యువతకు నైపుణ్యాభివృద్ధి
జలమార్గాల వెంట అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి శిక్షణా సంస్థలను ప్రాంతీయ నైపుణ్య ప్రావీణ్య కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నారు. దీని వల్ల జలమార్గాల పరిధిలోని యువతకు ఉద్యోగ, నైపుణ్య అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని మంత్రి తెలిపారు.
లోక్‌పాల్‌కు రూ.30 కోట్లు, సీవీసీకి రూ.54.56 కోట్లు కేటాయింపు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026–27లో అవినీతి నిరోధక సంస్థలకు నిధులు కేటాయించింది. అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్ సంస్థ అయిన లోక్‌పాల్‌కు రూ.30 కోట్లను కేటాయించినట్లు బడ్జెట్ పత్రాలు వెల్లడించాయి. ఈ నిధులు లోక్‌పాల్ సంస్థ స్థాపన వ్యయాలు, భవన నిర్మాణం తదితర అవసరాలకు వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) లోక్‌పాల్‌కు కేటాయించిన సవరించిన బడ్జెట్ రూ.32 కోట్లు కాగా, గత బడ్జెట్‌లో ఈ సంస్థకు రూ.44.32 కోట్లు కేటాయించారు. లోక్‌పాల్ అనేది ప్రధానమంత్రి సహా ప్రజాప్రతినిధులపై వచ్చే అవినీతి ఆరోపణలను విచారించి దర్యాప్తు చేసే అత్యున్నత సంస్థగా వ్యవహరిస్తోంది.
అదేవిధంగా, అవినీతి నిరోధక పర్యవేక్షణ సంస్థ అయిన కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కు 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.54.56 కోట్లను కేటాయించారు. ఈ నిధులు ప్రధానంగా సీవీసీ కార్యదర్శిత్వం, పరిపాలనా వ్యయాల కోసం వినియోగించనున్నట్లు బడ్జెట్ పత్రంలో పేర్కొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సీవీసీకి రూ.52.07 కోట్లు కేటాయించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తం రూ.50.66 కోట్లకు సవరించారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ దేశంలోని ప్రజాపరిపాలన వ్యవస్థలో నైతికత, పారదర్శకత, బాధ్యతాయుత పాలనను ప్రోత్సహించే అత్యున్నత సంస్థగా కీలక పాత్ర పోషిస్తోంది.
20 వేల వెటర్నరీ వైద్యులకు శిక్షణ, మత్స్యకారానికి 500 జలాశయాల అభివృద్ధి
గ్రామీణ ఆదాయాలను విభిన్నంగా మార్చడం, సంప్రదాయ వ్యవసాయం కాకుండా ఉద్యోగావకాశాలు పెంచడం లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026–27లో పశుసంవర్ధక, మత్స్య, అధిక విలువైన వ్యవసాయ రంగాలకు సంబంధించిన పలు కీలక కార్యక్రమాలను ప్రకటించారు. పశుసంవర్ధక రంగం రైతుల ఆదాయంలో సుమారు 16 శాతం వాటా కలిగి ఉందని, ముఖ్యంగా పేద, చిన్న రైతు కుటుంబాలకు ఇది ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, 20 వేలకుపైగా వెటర్నరీ వైద్యులు అందుబాటులోకి వచ్చేలా రుణంతో అనుసంధానమైన మూలధన సబ్సిడీ పథకాన్ని ప్రతిపాదించారు. ఈ పథకం ద్వారా ప్రైవేట్ రంగంలో వెటర్నరీ, ప్రైవేట్ కళాశాలలు, వెటర్నరీ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ ప్రయోగశాలలు, జంతు సంస్కరణ కేంద్రాల
స్థాపనకు మద్దతు అందించనున్నారు.
మత్స్యరంగానికి పెద్ద ప్రోత్సాహం
మత్స్యరంగ అభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా 500 రిజర్వాయర్లు, అమృత్ సరోవర్లను సమగ్రంగా అభివృద్ధి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. తీర ప్రాంతాల్లో మత్స్య విలువ శ్రేణిని బలోపేతం చేస్తూ, స్టార్టప్‌లు, మహిళల ఆధ్వర్యంలోని స్వయం సహాయక బృందాలు, ఫిష్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు ద్వారా మార్కెట్ అనుసంధానాలను పెంపొందించనున్నారు. జంతుపాలన వ్యాపార అభివృద్ధికి క్రెడిట్-లింక్ సబ్సిడీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దీనితో పాటు పశుసంవర్ధక, డెయిరీ, కోళ్ల పరిశ్రమలను ఆధునీకరించి, సమగ్ర విలువ శ్రేణులను అభివృద్ధి చేయనున్నారు.
కొబ్బరి రైతులకు శుభవార్త
తీర ప్రాంత రైతులకు ఊతమిచ్చేలా, కొబ్బరి ప్రోత్సాహక పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. పాతవి, దిగుబడి తగ్గిన కొబ్బరి చెట్లను తొలగించి కొత్త అధిక దిగుబడి రకాలతో భర్తీ చేయడం ఈ పథక లక్ష్యం. ప్రపంచంలోనే అతిపెద్ద కొబ్బరి ఉత్పత్తిదారుగా ఉన్న భారత్‌లో, సుమారు 3 కోట్ల మంది, అందులో 1 కోటి మంది రైతులు కొబ్బరి సాగుపై ఆధారపడి జీవిస్తున్నారని మంత్రి తెలిపారు.
జీడిపప్పు, కోకోకు ప్రత్యేక కార్యక్రమం
భారతదేశాన్ని జీడిపప్పు, కోకో ఉత్పత్తి ప్రాసెసింగ్‌లో స్వయం సమృద్ధిగా మార్చడం, ఎగుమతుల పోటీ సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించారు. 2030 నాటికి వీటిని ప్రపంచ స్థాయి ప్రీమియం బ్రాండ్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.
గంధపు చెక్క సాగుకు ప్రోత్సాహం
రాష్ట్రాల సహకారంతో గంధపు చెక్క సాగు, కోత అనంతర ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇది భారతదేశ సామాజిక, సాంస్కృతిక వారసత్వంతో ముడిపడి ఉన్న గంధపు చెక్క వ్యవస్థ వైభవాన్ని తిరిగి తీసుకురావడమే లక్ష్యం అని పేర్కొన్నారు.
కొండ ప్రాంతాలకు ప్రత్యేక ప్రణాళిక
కొండ ప్రాంతాల్లో పాత తోటలను పునరుజ్జీవనం చేయడం, వాల్నట్, బాదం, పైన్ నట్‌ల అధిక సాంద్రత సాగును విస్తరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. యువత భాగస్వామ్యంతో విలువ జోడింపు (వాల్యూ అడిషన్)పై దృష్టి సారించనున్నారు.
మెడికల్ టూరిజానికి ఊతం: దేశవ్యాప్తంగా ఐదు ప్రాంతీయ వైద్య హబ్‌లు
మెడికల్ టూరిజాన్ని మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో రాష్ట్రాల్లో ఐదు ప్రాంతీయ వైద్య హబ్‌ల ఏర్పాటు కోసం ప్రత్యేక పథకం ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ వైద్య హబ్‌లు వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధన కేంద్రాలు సమన్వయంతో కూడిన సమగ్ర హెల్త్‌కేర్ కాంప్లెక్సులుగా అభివృద్ధి చేయనున్నట్లు ఆమె తెలిపారు. వీటిలో ఆయుష్ కేంద్రాలు, మెడికల్ వాల్యూ టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్లు, డయాగ్నోస్టిక్స్, చికిత్స అనంతర సంరక్షణ, పునరావాస సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఈ హబ్‌ల ఏర్పాటు వల్ల డాక్టర్లు, నర్సులు, అనుబంధ వైద్య సిబ్బందికి విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆమె చెప్పారు. కోవిడ్ అనంతరం ఆయుర్వేదానికి యోగాలానే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పెరిగిందని పేర్కొన్న ఆర్థిక మంత్రి, ఆయుర్వేద పరిశోధనను బలోపేతం చేయడానికి మూడు కొత్త ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఆయుర్వేద ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే, ఆయుష్ ఫార్మసీలు, ఔషధ పరీక్షా ప్రయోగశాలలను ఆధునీకరించి అంతర్జాతీయ ప్రమాణాల సర్టిఫికేషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. జామ్‌నగర్‌లోని డబ్ల్యూహెచ్వో గ్లోబల్ ట్రాడిషనల్ మెడిసిన్ సెంటర్‌ను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ఆధారాధారిత పరిశోధన, శిక్షణ, అవగాహన కార్యక్రమాలను పెంచుతామని నిర్మలా సీతారామన్ తెలిపారు.
లిథియం-ఐయాన్ సెల్స్ తయారీలో ఉపయోగించే మూలధన వస్తువులపై పన్ను మినహాయింపు పొడిగింపు
వచ్చే ఆర్థిక సంవత్సరానికి లిథియం-ఐయాన్ సెల్‌ల తయారీలో ఉపయోగించే మూలధన వస్తువుల పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును పొడిగించనున్నట్టు మంత్రి ప్రకటించారు. ఆమె ప్రసంగంలో, బయో గ్యాస్ బ్లెండెడ్ సీఎన్జీపై కేంద్ర ఉత్పత్తి పన్ను లెక్కింపులో బయోగ్యాస్ విలువ మొత్తం మినహాయించబడే ప్రతిపాదనను కూడా చేశారు. బ్యాటరీల కోసం లిథియం-ఐయాన్ సెల్‌ల తయారీలో ఉపయోగించే మూలధన వస్తువులకు ఇచ్చిన ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును పొడిగించాలని, అలాగే సౌర గ్లాస్ తయారీలో ఉపయోగించే సోడియం యాంటీ మోనెట్ దిగుమతికి కూడా ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును చేయాలని ప్రతిపాదించారు.
విద్యారంగానికి భారీ ఊతం
ప్రతి జిల్లాలో బాలికల హాస్టల్, 5 యూనివర్సిటీ టౌన్‌షిప్‌లు
కేంద్ర బడ్జెట్ 2026–27లో విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించింది. మొత్తం రూ.1.39 లక్షల కోట్లకు పైగా కేటాయింపులు చేయగా, అందులో ఉన్నత విద్యకు రూ.55,727 కోట్లు ఉన్నాయి.
బడ్జెట్‌లో ప్రకటించిన ప్రధాన అంశాలు :
పరిశ్రమలు–లాజిస్టిక్ కారిడార్‌ల సమీపంలో 5 యూనివర్సిటీ టౌన్‌షిప్‌లు ఏర్పాటు
→ వీటిలో యూనివర్సిటీలు, కాలేజీలు, పరిశోధనా సంస్థలు, స్కిల్ సెంటర్లు, నివాస సదుపాయాలు ఉంటాయి.
దేశంలోని ప్రతి జిల్లాలో ఒక బాలికల హాస్టల్
→ ఎస్టీఈఎం ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న బాలికలకు సురక్షిత వసతి కోసం ఈ నిర్ణయం.
15,000 పాఠశాలలు, 500 కాలేజీల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్
→ ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ సహకారంతో అమలు.
వెటర్నరీ కాలేజీలు, ఆసుపత్రులకు లోన్-లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ
తూర్పు భారతంలో కొత్త నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ)
విద్య, వైద్య అవసరాల కోసం విదేశాలకు పంపే డబ్బుపై టీసీఎస్ 5శాతం నుంచి 2శాతానికి తగ్గింపు
→ ఎల్ఆర్ఎస్ కింద రూ.10 లక్షలకు మించిన రిమిటెన్స్‌పై ఈ సడలింపు వర్తిస్తుంది.
‘ఎడ్యుకేషన్ టూ ఎంప్లాయిమెంట్ అండ్ ఎంటర్ ప్రైజేస్’ హైపవర్డ్ కమిటీ ఏర్పాటు
→ సేవల రంగంలో ఉపాధి, నైపుణ్యాలు, ఏఐ ప్రభావంపై సూచనలు చేయనుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ బడ్జెట్‌ను వికసిత భారత్ దిశగా విద్య, ఉపాధికి దిశానిర్దేశం చేసే బడ్జెట్ గా అభివర్ణించారు.
