
జాతీయ పతాకానికి అవమానం: హార్దిక్ పాండ్యాపై కేసు!
భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో పడ్డారు. టీ20 ప్రపంచకప్ విజయోత్సవ వేళ జాతీయ జెండాను అవమానించారంటూ ఆయనపై బెంగళూరులోని శివాజీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత జరిగిన వేడుకల్లో పాండ్యా ప్రవర్తన జాతీయ పతాక గౌరవానికి భంగం కలిగించేలా ఉందని పుణెకు చెందిన న్యాయవాది వాజెద్ ఖాన్ బిడ్కర్ ఈ ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగింది?
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపు అనంతరం మైదానంలో ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. అయితే ఆ సమయంలో హార్దిక్ పాండ్యా తన భుజాలపై త్రివర్ణ పతాకాన్ని కప్పుకుని డ్యాన్స్ చేస్తూ, మైదానంలో పరుగెత్తిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ వేడుకల సమయంలో ఒకానొక దశలో పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి స్టేజీపై పడుకున్నారని, ఆ సమయంలోనూ ఆయన భుజాలపై జాతీయ జెండా అలాగే ఉందని ఫిర్యాదుదారు ఆరోపించారు. జెండా శరీరాన్ని తాకుతూ, గౌరవానికి విరుద్ధంగా ప్రవర్తించడం జాతీయ చిహ్నాల గౌరవ చట్టం-1971లోని సెక్షన్ 2 ప్రకారం నేరమని ఆయన పేర్కొన్నారు.
చట్టపరమైన చర్యలకు డిమాండ్
విజయ గర్వంలో మునిగిపోయిన పాండ్యా, దేశానికి గర్వకారణమైన త్రివర్ణ పతాక గౌరవాన్ని విస్మరించారని న్యాయవాది వాజిద్ ఖాన్ విమర్శించారు. "విజయోత్సవంలో జాతీయ జెండాను వెనుకకు కట్టుకుని గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి స్టేజీపై పడుకోవడం జాతీయ పతాకానికి జరిగిన అవమానంగా నేను భావిస్తున్నాను. అందుకే శివాజీనగర్ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశాను" అని ఆయన మీడియాకు తెలిపారు. అయితే ఈ ఘటన అహ్మదాబాద్‌లో జరిగినందున అక్కడ ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించినప్పటికీ, జాతీయ జెండా దేశం మొత్తానికి చిహ్నమని, ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చని ఆయన వాదించారు. చివరకు పోలీసులు ఫిర్యాదును స్వీకరించి, కాపీని అందజేశారు.
చారిత్రక విజయానికి మచ్చ
న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి టీ20 ప్రపంచకప్‌ను భారత్ నిలబెట్టుకుంది. స్వదేశంలో ఈ టైటిల్ గెలిచిన తొలి జట్టుగా, వరుసగా రెండుసార్లు (2024, 2026) విజేతగా నిలిచిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. 2007 తర్వాత మూడోసారి కప్‌ను ముద్దాడిన వేళ ఇలాంటి వివాదం తలెత్తడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఫిర్యాదుపై పోలీసులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
