
'జాతీయ ఉపాధి హామీ పథకం' పేరు మార్పు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ప్రధానంగా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును 'పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన'గా మారుస్తూ ఒక బిల్లుకు ఆమోదం లభించింది. అంతేకాకుండా, ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల కుటుంబాలకు ఇచ్చే హామీ పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచాలని కూడా కేబినెట్ నిర్ణయించింది.
అంతేకాకుండా, ప్రపంచంలోనే అతిపెద్ద సర్వే అయిన భారత జనాభా లెక్కల (సెన్సస్ 2027) నిర్వహణకు కేబినెట్ రూ. 11,718.24 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరగబోయే ఎనిమిదో జనగణన ఇదే. ఈసారి జనాభా లెక్కలు మొట్టమొదటిసారిగా పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతాయి. దాదాపు 30 లక్షల మంది ఫీల్డ్ సిబ్బంది మొబైల్ యాప్‌లను ఉపయోగించి వివరాలను సేకరిస్తారు. ఈ లెక్కల ప్రక్రియ రెండు దశల్లో పూర్తవుతుంది. మొదటి దశలో (ఇళ్ల వివరాల సేకరణ) ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 వరకు, రెండో దశలో (జనాభా లెక్కింపు) ఫిబ్రవరి 2027లో జరుగుతుంది. ముఖ్యంగా, ఈ సెన్సస్‌లో కులాల వివరాలను (కుల గణన) కూడా ఎలక్ట్రానిక్‌గా నమోదు చేస్తారు. ప్రజలు తమ వివరాలను వారే నమోదు చేసుకునేందుకు 'స్వీయ-లెక్కింపు' సదుపాయాన్ని కూడా కల్పిస్తారు.
ఆర్థిక రంగంలో ఒక ముఖ్యమైన మార్పుగా, బీమా రంగంలోకి విదేశీ పెట్టుబడులు పెంచడానికి కేబినెట్ అంగీకరించింది. దేశంలో బీమా సేవలు మరింత విస్తరించడానికి, ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని ప్రస్తుతమున్న 74 శాతం నుంచి ఏకంగా 100 శాతానికి పెంచే బిల్లుకు ఆమోదం ఇచ్చింది. అయితే, ఇక్కడ ఒక ముఖ్యమైన నిబంధన ఏమిటంటే.. బీమా కంపెనీల ముఖ్యమైన ఉన్నత అధికారుల (టాప్ మేనేజ్‌మెంట్) స్థానాల్లో కనీసం ఒకరైనా భారతీయ పౌరుడై ఉండాలనే షరతును కూడా కేబినెట్ చేర్చింది.
విద్యా రంగంలో మార్పులు తీసుకురావడానికి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఏఐసీటీఈ లాంటి సంస్థల స్థానంలో ఒకే ఉన్నత విద్య నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును 'విక్షిత్ భారత్ శిక్షా అధిక్రషన్ బిల్లు' అని పిలుస్తున్నారు. ఈ కొత్త సంస్థ ముఖ్యంగా కళాశాలలు, యూనివర్సిటీలను నియంత్రించడం, వాటికి గుర్తింపు ఇవ్వడం, ప్రమాణాలను నిర్ణయించడం వంటి ముఖ్యమైన పనులు చేస్తుంది. అయితే, వైద్య, న్యాయ కళాశాలలు మాత్రం ఈ సంస్థ పరిధిలోకి రావు.
అంతేకాకుండా రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు మిల్లింగ్ కొప్రా (ఎండు కొబ్బరి) కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ. 445 పెంచి రూ.12,027గా నిర్ణయించారు. బాల్ కొబ్బరి (గుండు కొబ్బరి) కనీస మద్దతు ధరను కూడా రూ.400 పెంచి రూ.12,500గా నిర్ణయించారు.
పరిపాలనా సరళీకరణలో భాగంగా కేబినెట్ కాలం చెల్లిన 71 చట్టాలను రద్దు చేసే బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇందులో 65 ప్రధాన చట్టాలకు చేసిన సవరణలు ఉన్నాయి. చివరగా, దేశంలో అణుశక్తి సామర్థ్యాన్ని 2047 నాటికి 100 గిగావాట్లకి పెంచే లక్ష్యంతో, పౌర అణుశక్తి రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచడానికి ఉద్దేశించిన సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా బిల్లుకు కూడా ఆమోదం లభించింది.
బొగ్గు వినియోగం, ఎగుమతి కోసం ఉద్దేశించిన 'కోల్‌సేతు' విధానానికి కూడా కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ కొత్త విధానం కింద 'అనియంత్రిత రంగాల లింకేజ్ వేలం విధానం'లో 'కోల్‌సేతు' అనే ప్రత్యేక విండోను తీసుకువస్తారు. దీని ద్వారా, తుది వినియోగ పరిమితులు లేకుండా, ఏ పరిశ్రమ కోసమైనా లేదా ఎగుమతి కోసమైనా వేలం ఆధారంగా దీర్ఘకాలిక బొగ్గు లింకేజీలను కేటాయించవచ్చు. బొగ్గు అవసరం ఉన్న దేశీయ కొనుగోలుదారులు ఎవరైనా ఈ వేలంలో పాల్గొనవచ్చు. ఈ సంస్కరణ దేశీయ బొగ్గు వినియోగాన్ని వేగవంతం చేసి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.
