Let's talk: editor@tmv.in
జాతీయ ఉగ్రవాద వ్యతిరేక విధానం ‘ప్రహార్’ విడుదల

జాతీయ ఉగ్రవాద వ్యతిరేక విధానం ‘ప్రహార్’ విడుదల

Pinjari Chand
24 ఫిబ్రవరి, 2026

హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ ఏ) సోమవారం భారత్‌లో తొలి సమగ్ర జాతీయ ఉగ్రవాద వ్యతిరేక విధానం ‘ప్రహార్’ ను విడుదల చేసింది. ఈ ఎనిమిది పేజీల విధానం ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో అడ్డుకునేందుకు ఇంటెలిజెన్స్ ఆధారిత, సమన్వయపూర్వక వ్యవస్థను ప్రతిపాదిస్తుంది.

విధానంలోని ముఖ్యాంశాలు

• ఉగ్రదాడుల నివారణకు ప్రాధాన్యం

• ముప్పుకు అనుగుణంగా త్వరిత, సముచిత ప్రతిస్పందన వ్యవస్థలు

• ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం

• మొత్తం ప్రభుత్వం, మొత్తం సమాజం దృక్పథం

• మానవ హక్కులు, చట్ట పరిపాలనకు కట్టుబాటు

• ర్యాడికలైజేషన్ వంటి ఉగ్రవాదానికి దోహదపడే పరిస్థితులను తగ్గించడం

ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యూహం

భారత్ ముందస్తు, ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యూహాన్ని అనుసరిస్తోందని ఈ విధానం స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి సంబంధించిన సమాచారాన్ని దేశవ్యాప్తంగా సమయానుకూలంగా పంచుకోవడంలో మల్టీ ఏజెన్సీ సెంటర్ (ఎంఏసీ), జాయింట్ టాస్క్ ఫోర్స్ (జేటీఎఫ్ఐ) కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొంది. ఇవి ఇంటలిజెన్స్ బ్యూరో(ఐబీ) పరిధిలో పనిచేస్తాయి.

ఆన్‌లైన్ ఉగ్రచర్యలపై చర్యలు

ఉగ్రవాద గుంపులు సోషల్ మీడియా, ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్స్, డార్క్ వెబ్, క్రిప్టో వాలెట్లను ఉపయోగిస్తున్న నేపథ్యంలో, భారత చట్టాల అమలు చేసే సంస్థలు ఆన్‌లైన్ నెట్వర్క్‌లను విచ్ఛిన్నం చేయడానికి నిరంతర చర్యలు తీసుకుంటున్నాయి. ఉగ్రవాదులకు లాజిస్టిక్, ఆర్థిక సహకారం అందించే ఓవర్‌గ్రౌండ్ వర్కర్ (ఓజీడబ్ల్యూ) మాడ్యూల్స్‌ను కూడా భగ్నం చేస్తున్నట్లు ఈ విధానం చెబుతోంది.

సరిహద్దు భద్రత – కీలక రంగాల రక్షణ

భూమి, గగనం, సముద్ర మార్గాల్లో ఉన్న ముప్పులను ఎదుర్కొనేందుకు రక్షణ దళాలు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆధునిక సాంకేతిక పరికరాలతో సన్నద్ధంగా ఉన్నారని తెలిపింది. విద్యుత్, రైల్వేలు, విమానయాన, పోర్టులు, రక్షణ, అంతరిక్షం, అణుశక్తి వంటి కీలక రంగాల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది.

సాంకేతిక సవాళ్లు

ఎన్‌క్రిప్షన్, డార్క్ వెబ్, డ్రోన్లు, రోబోటిక్స్, సీబీఆర్ఎన్ఈడీ (కెమికల్,బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్, ఎక్స్ ప్లోజివ్, డిజిటల్ ) పదార్థాల దుర్వినియోగం వంటి అంశాలు కౌంటర్ టెర్రరిజం సంస్థలకు కొత్త సవాళ్లుగా మారుతున్నాయని విధానం హెచ్చరించింది.

జీరో టాలరెన్స్ విధానం

భారత్ ఉగ్రవాదంపై ఎప్పటినుంచో “జీరో టాలరెన్స్” విధానాన్ని అనుసరిస్తోందని పునరుద్ఘాటించింది. మత, జాతి, సిద్ధాంత ఆధారంగా ఉగ్రవాదానికి ఎటువంటి న్యాయమైన కారణం లేదని స్పష్టం చేసింది. భారత్‌పై అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు అయిన అల్ ఖాయిదా, ఐఎస్ఐఎస్ ముప్పు ఉన్నట్లు కూడా విధానం ప్రస్తావించింది. ఈ విధానం ద్వారా కేంద్రం ఉగ్రవాదంపై సమగ్ర, సమన్వయపూర్వక, సాంకేతికంగా బలమైన ప్రతిస్పందనకు రూపురేఖలు సిద్ధం చేసింది.