
జాతీయవాదానికి సంస్కృతమే ఊతం: విల్సన్ శరత్ చంద్ర
జాతీయవాద భావనను బలోపేతం చేయడంలో సంస్కృత భాష కీలక పాత్ర పోషిస్తుందని తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్.డి. విల్సన్ (శరత్ చంద్ర) అన్నారు. సంస్కృతం పండితుల భాష మాత్రమే అనే అపోహను తొలగించి, సామాన్య ప్రజలకు కూడా చేరువ చేసే దిశగా అకాడమీ ప్రత్యేక కార్యాచరణ చేపడుతోందని ఆయన తెలిపారు. వడ్డేశ్వరంలోని తెలుగు, సంస్కృత అకాడమీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్లో సంస్కృత అకాడమీ ఏర్పడినప్పటి నుంచి భాషాభివృద్ధికి తగిన నిధులు లభించలేదని, ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తేనే సంస్కృత ప్రచారం మరింత విస్తృతంగా సాగుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం, భారతీయ భాషా సమితి, కేంద్ర విద్యాశాఖ అధికారులను కలిసి నిధుల కోసం వినతిపత్రం సమర్పించనున్నట్లు వెల్లడించారు.
ఆగస్టు 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా సంస్కృత సప్తాహం నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కొవ్వూరు, తణుకు, గుంటూరు, జిల్లెళ్లమూడి, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు, గుడివాడ, విజయవాడ తదితర ప్రాంతాల్లో విద్యాసంస్థలు, వేద పాఠశాలల్లో కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భారతం, భాగవతం తదితర అంశాలపై క్విజ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సంస్కృత భాషాభివృద్ధికి విశేష సేవలందించిన పండితులను సన్మానించనున్నట్లు తెలిపారు. సప్తాహం ముగింపు కార్యక్రమం ఆగస్టు 31న విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాలలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
అలాగే ఆగస్టు 29న గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాష, తెలుగు సంస్కృతికి విశేష సేవలందించిన ప్రముఖులకు అకాడమీ ఆవరణలో అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కోటేశ్వరమ్మ, డాక్టర్ ఎస్.ఏ.టి. రాజ్యలక్ష్మి, డాక్టర్ పి. కోటి రత్నం, సంస్కృత పండితులు డాక్టర్ పి.టి.జి.వి. రంగాచార్యులు పాల్గొన్నారు.
