Let's talk: editor@tmv.in
జాతీయపార్టీల ఆదాయంలో 85శాతం బీజేపీదే: ఏడీఆర్

జాతీయపార్టీల ఆదాయంలో 85శాతం బీజేపీదే: ఏడీఆర్

Pinjari Chand
6 మార్చి, 2026

2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని జాతీయ రాజకీయ పార్టీల మొత్తం ఆదాయంలో సుమారు 85 శాతం ఆదాయం అధికార పార్టీ బీజేపీకే చెందిందని అసోషియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్‌ (ఏడీఆర్) విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. భారత ఎన్నికల కమిషన్‌కు రాజకీయ పార్టీలు సమర్పించిన ఆర్థిక వివరాలను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. నివేదిక ప్రకారం, 2024–25లో ఆరు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ(ఎం), ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, ఎన్‌పీపీ కలిపి మొత్తం రూ.7,960.09 కోట్ల ఆదాయాన్ని ప్రకటించాయి. ఇందులో బీజేపీ ఒక్కటే రూ.6,769.14 కోట్ల ఆదాయం ప్రకటించి మొత్తం ఆదాయంలో 85.03 శాతం వాటాను సంపాదించింది. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ రూ.918.28 కోట్ల ఆదాయం ప్రకటించింది. ఇది మొత్తం ఆదాయంలో 11.53 శాతం. అత్యల్ప ఆదాయం ప్రకటించిన పార్టీగా నేషనల్ పీపుల్స్ పార్టీ రూ.2.18 కోట్లతో చివరిస్థానంలో నిలిచింది.

ఖర్చుల వివరాలు

బీజేపీ తన ఆదాయంలో సుమారు 55.76 శాతం, అంటే రూ.3,774.58 కోట్లను ఖర్చు చేసింది. కాంగ్రెస్ మాత్రం రూ.1,111.94 కోట్లను ఖర్చు చేసింది. ఇది ఆ పార్టీ మొత్తం ఆదాయం కంటే రూ.193.66 కోట్లు (21.09 శాతం) ఎక్కువ. సీపీఎం రూ.172.60 కోట్ల ఆదాయం ప్రకటించగా, ఖర్చు రూ.173.86 కోట్లుగా నమోదైంది. అంటే ఆదాయాన్ని రూ.1.26 కోట్లు అధిగమించింది. బీఎస్పీ మొత్తం ఆదాయం రూ.58.58 కోట్లు కాగా, ఖర్చు రూ.106.30 కోట్లు. అంటే ఆదాయాన్ని రూ.47.71 కోట్లు (81.45 శాతం) మించి ఖర్చు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ రూ.39.28 కోట్ల ఆదాయం ప్రకటించి రూ.36.46 కోట్లు ఖర్చు చేసింది. అంటే తన ఆదాయంలో 92.83 శాతం వినియోగించింది. నేషనల్ పీపుల్స్ పార్టీ రూ.2.18 కోట్ల ఆదాయం ప్రకటించి రూ.1.19 కోట్లు ఖర్చు చేసింది. ఇది మొత్తం ఆదాయంలో 54.72 శాతం.

ఆదాయం పెరుగుదల–తగ్గుదల

2023–24తో పోల్చితే బీజేపీ ఆదాయం 55.95 శాతం (రూ.2,428.67 కోట్లు) పెరిగింది. సీపీఎం ఆదాయం 2.96 శాతం (రూ.4.96 కోట్లు) స్వల్పంగా పెరిగింది. అదే సమయంలో కాంగ్రెస్ ఆదాయం 25.05 శాతం (రూ.306.83 కోట్లు) తగ్గింది. బీఎస్పీ ఆదాయం 9.56 శాతం (రూ.6.19 కోట్లు) తగ్గింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆదాయం మాత్రం 73.20 శాతం (రూ.16.60 కోట్లు) పెరిగింది.

ఆదాయ వనరులు

2024–25లో జాతీయ పార్టీల మొత్తం ఆదాయంలో 85.08 శాతం (రూ.6,772.53 కోట్లు) విరాళాలు లేదా కాంట్రిబ్యూషన్ల రూపంలో వచ్చాయి. మిగిలిన 14.92 శాతం (రూ.1,187.56 కోట్లు) ఇతర వనరుల నుంచి వచ్చింది. బీజేపీ ఆదాయంలో 90.48 శాతం (రూ.6,124.85 కోట్లు) విరాళాల నుంచే వచ్చింది. ఆప్ ఆదాయంలో 99.85 శాతం, నేషనల్ పీపుల్స్ పార్టీ ఆదాయంలో 97.74 శాతం విరాళాల నుంచే వచ్చాయి. ఇక బీఎస్పీ మాత్రం తన మొత్తం ఆదాయం (రూ.58.58 కోట్లు) పూర్తిగా ఇతర వనరుల నుంచే వచ్చిందని ప్రకటించింది. కాంగ్రెస్ ఆదాయంలో 56.86 శాతం (రూ.522.13 కోట్లు) విరాళాల నుంచీ, 43.14 శాతం (రూ.396.15 కోట్లు) ఇతర వనరుల నుంచీ వచ్చాయి. సీపీఎం ఆదాయంలో 48.77 శాతం విరాళాలు కాగా, 51.23 శాతం ఇతర వనరులు. కాంగ్రెస్ పార్టీ కూపన్లు జారీ చేసి రూ.350.12 కోట్లను సేకరించింది. ఇది ఆ పార్టీ మొత్తం ఆదాయంలో 38.12 శాతం.

ఎన్నికల ఖర్చులే ప్రధాన వ్యయం

జాతీయ పార్టీల ఖర్చుల్లో ప్రధానంగా ఎన్నికల ప్రచారం, పరిపాలనా వ్యయాలే ఎక్కువగా ఉన్నాయని నివేదిక తెలిపింది. బీజేపీ ఎన్నికలు, సాధారణ ప్రచారానికి రూ.3,335.36 కోట్లు ఖర్చు చేసింది. పరిపాలనా ఖర్చులకు రూ.323.05 కోట్లు వినియోగించింది. కాంగ్రెస్ ఎన్నికల ఖర్చులకు రూ.896.22 కోట్లు, పరిపాలనా, సాధారణ వ్యయాలకు రూ.159.68 కోట్లు ఖర్చు చేసింది. సీపీఎం పరిపాలనా, సాధారణ వ్యయాలకు రూ.78.11 కోట్లు ఖర్చు చేయగా, ఉద్యోగుల వేతనాలకు రూ.51.03 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదిక వెల్లడించింది.

జాతీయపార్టీల ఆదాయంలో 85శాతం బీజేపీదే: ఏడీఆర్ - Tholi Paluku