
జాగ్రెబ్ ఓపెన్ 2026: రెజ్లర్ నీలంకు రజతం
ఈ ఏడాది తొలి యూడబ్ల్యూడబ్ల్యూ ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్ 'జాగ్రెబ్ ఓపెన్'లో భారత రెజ్లర్లు పతకాల పంట పండిస్తున్నారు. గురువారం జరిగిన పోటీల్లో భారత్‌కు ఒక రజతం, మూడు కాంస్య పతకాలు లభించాయి. దీంతో ఈ టోర్నీలో భారత్ గెలుచుకున్న పతకాల సంఖ్య ఏడుకు (1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలు) చేరింది.
నీలం సిరోహి వీరోచిత పోరాటం
మహిళల 50 కిలోల ఫ్రీస్టైల్ విభాగంలో నీలం సిరోహి అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన నీలం.. తొలి రౌండ్‌లో పోలాండ్‌కు చెందిన అగాతాపై 10-0తో, క్వార్టర్స్‌లో అజర్‌బైజాన్ రెజ్లర్ ఎల్నూరాపై 12-2తో ఘనవిజయాలు సాధించింది. సెమీఫైనల్లో స్వదేశీ రెజ్లర్ ముస్కాన్‌పై 7-4తో గెలిచి పతకాన్ని ఖరారు చేసుకుంది. అయితే, ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో జపాన్ స్టార్ రెజ్లర్, యూ-23 ప్రపంచ ఛాంపియన్ హారునా మొరికావా చేతిలో 2-5తో ఓడి రజతంతో సరిపెట్టుకుంది.
కాంస్యాలతో మెరిసిన విక్కీ, దినేష్
పురుషుల 97 కిలోల విభాగంలో విక్కీ హుడా పట్టుదలతో పోరాడి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. క్వార్టర్స్‌లో అమెరికా రెజ్లర్ స్టీఫెన్ చేతిలో ఓడిపోయినప్పటికీ, రీపిచేజ్ రౌండ్‌లో కెనడాకు చెందిన శామ్యూల్‌ను 12-1తో చిత్తు చేశాడు. అనంతరం జరిగిన కాంస్య పతక పోరులో ఫ్రాన్స్‌కు చెందిన అద్లాన్‌పై 8-2తో గెలిచి పోడియంపై నిలిచాడు. మరోవైపు 125 కిలోల విభాగంలో దినేష్ ధంకర్ పోలాండ్ రెజ్లర్ కమిల్‌ను 'పిన్ ఫాల్' (చిత్తు చేయడం) పద్ధతిలో ఓడించి కాంస్యం సొంతం చేసుకున్నాడు. రీపిచేజ్‌లో అమెరికా రెజ్లర్ డెమెట్రియస్‌పై 12-2తో సాధించిన విజయం దినేష్‌కు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.
ముస్కాన్ కు కాంస్యం.. మిగిలిన వారికి నిరాశే
50 కిలోల మహిళల విభాగంలో సెమీఫైనల్లో ఓడిపోయిన ముస్కాన్, కాంస్య పతక పోరులో అద్భుతంగా పుంజుకుంది. పోలాండ్ రెజ్లర్ అగాతా వాలెర్జాక్‌ను 11-0తో చిత్తు చేసి కాంస్యాన్ని ముద్దాడింది. అయితే 97 కిలోల విభాగంలో దీపక్ చాహల్, 125 కిలోల క్వార్టర్స్‌లో మహేంద్ర బాబాసాహెబ్ నిష్క్రమించారు. అమిత్ (79 కిలోలు), జ్యోతి (55 కిలోలు) క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే వెనుదిరిగారు.
అంతిమ్ పంగల్ పైనే చూపు
టోర్నీ తొలిరోజే భారత్‌కు సుజీత్ కల్కల్ (65 కిలోలు) స్వర్ణాన్ని అందించగా, అమన్ సెహ్రావత్ (61 కిలోలు) రజతాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టి ఒలింపియన్, ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్య విజేత అంతిమ్ పంగల్ పైనే ఉంది. శనివారం జరగనున్న పోటీల్లో ఆమె బరిలోకి దిగనుంది.
