Let's talk: editor@tmv.in
జాగృతి జనం బాట యాత్ర

జాగృతి జనం బాట యాత్ర

Gaddamidi Naveen
26 అక్టోబర్, 2025

జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా చేరుకున్న జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దేవితండాలోని జగదాంభ మాత, సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంత‌రం జాగృతి జ‌నం బాట యాత్ర‌ను ప్రారంభించారు.

నిజామాబాద్ జిల్లా నా మెట్టినిల్లు… నా రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది. ప్రజల ఆశీర్వాదంతోనే నేను మొదట ఎంపీగా, అనంతరం ఎమ్మెల్సీగా సేవ చేసే అవకాశం పొందాను. అందుకే నా రాజకీయ జీవితానికి ఆది పుట్టిన ఈ పవిత్ర నేల నుంచే “జాగృతి జనం బాట” యాత్రను ప్రారంభించడం నాకు ఎంతో గర్వకారణం. ఈ యాత్ర ద్వారా ప్రజల కష్టసుఖాలను, వారి అభ్యున్నతి కోసం అవసరమైన మార్పులను ప్రత్యక్షంగా తెలుసుకోవడమే నా ప్రధాన లక్ష్యమ‌ని పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో జాగృతి కార్యకర్తలతో, స్థానిక ప్రజలతో మమేకమై ప్రజల నిజమైన సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఈ యాత్రలో భాగంగా మహిళలు, యువత, రైతులు, కార్మికులు, విద్యార్థులు – ప్రతి వర్గం వారు నాకు అండగా నిలవడం గర్వకారణం. ముఖ్యంగా మహిళలు చూపిన ఉత్సాహం, యువత ప్రదర్శించిన చైతన్యం నా హృదయాన్ని తాకిందన్నారు.

అమరవీరుల కుటుంబాలకు రూ.కోటి రూపాయల డిమాండ్

జనం బాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరులస్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలను నెరవేర్చడంలో జరిగిన లోపాలను సరిదిద్దేందుకు 'జనం బాట' కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం ఆమె ఉద్యమకారుల సమక్షంలో మాట్లాడారు.

అమరులకు కుటుంబాలకు క్షమాపణ

తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారు. వారి త్యాగాల పునాదుల మీదే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అయితే, ఏ ఆశయాల కోసం వారు ప్రాణత్యాగం చేశారో, వాటిని ఎంతవరకు సాధించగలిగామనేది మనం ఆలోచించుకోవాలి అని కవిత అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో తాను ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ, అమరవీరుల కుటుంబాలకు పూర్తి న్యాయం జరగకపోవడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు.

తెలంగాణ కోసం 1200 మంది అమరులయ్యారని అసెంబ్లీలోనే చెప్పాం. కానీ కేవలం 580 మందికి మాత్రమే రూ. 10 లక్షల పరిహారం, ఉద్యోగాలు ఇచ్చాం. మిగతావారికి న్యాయం చేయలేకపోయాం. ఈ విషయంలో అమరవీరులకు, వారి కుటుంబాలకు నేను చేతులెత్తి క్షమాపణ కోరుతున్నాను అని కవిత భావోద్వేగంగా మాట్లాడారు.

ప్రతీ అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు వచ్చే వరకు పోరాటం చేస్తానని ఆమె ప్రమాణం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఈ కోటి రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని మార్చి అయినా వచ్చే ప్రభుత్వంతో న్యాయం జరిగేలా చూస్తానని అమరుల పాదాలకు నమస్కరించి శపథం చేశారు.

ఉద్యమకారులకు న్యాయం, పెన్షన్ కోసం పోరాటం

అనేక మంది ఉద్యమకారులకు ఇంకా న్యాయం జరగలేదని, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఇప్పటికీ పోరాటం చేస్తోందని కవిత గుర్తుచేశారు. ఉద్యమకారుల లిస్ట్ మొత్తాన్ని ప్రజాదర్బార్ నిర్వహించి తయారు చేద్దామని, ఆ ఉద్యమకారులందరికీ పెన్షన్ వచ్చే వరకు తాను విరామం లేకుండా పోరాటం చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామన్న హామీని నెరవేర్చే వరకు ఒత్తిడి పెంచాల్సిందే అన్నారు.

సామాజిక తెలంగాణ లక్ష్యంగా 'జనం బాట'

33 జిల్లాలు, 119 నియోజకవర్గాల్లో 'జనం బాట' పేరుతో ప్రజల కోసం తాను బయలుదేరుతున్నానని కవిత ప్రకటించారు. రైతులు, యువకులు, నిరుద్యోగులు, కార్మికులు సహా అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే సామాజిక తెలంగాణ రావాలని ఆమె పిలుపునిచ్చారు.

సామాజిక తెలంగాణ ద్వారా ప్రతి ఒక్కరికీ సమానంగా రాజకీయ, ఆర్థికపరమైన అవకాశాలు దక్కాలన్నారు. జాగృతి ఇప్పటికే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్ల కోసం పోరాడుతోందని, అలాగే అగ్రవర్ణాల్లోని వైశ్యులు సహా అన్ని వర్గాలకు సరైన ప్రాతినిథ్యం దక్కాలని క‌విత‌ డిమాండ్ చేశారు.

సోయి లేని ప్రభుత్వం కాంగ్రెస్

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ సోయి లేదని కవిత తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ తల్లి చేతుల్లోంచి బతుకమ్మను తీసేయడం తమ గుండెల్ని మెలిపెట్టినట్లైందని ఆవేదన వ్యక్తం చేశారు. "మళ్లీ తెలంగాణ తల్లి చేతుల్లోకి బతుకమ్మ వచ్చే వరకు పోరాటం చేద్దాం" అని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు తెలంగాణ బిడ్డలకే 95 శాతం ఉద్యోగావకాశాలు రావాలని పోరాడితే, ఈ ప్రభుత్వం హర్యానా సహా పక్క రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఇస్తోందని ఆరోపించారు. ఈ అన్యాయాన్ని జాగృతి చూస్తూ ఊరుకోదని, ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వంపై జంగ్ సైరన్ పూరించాల్సిన అవసరం ఉందని ఆమె పునరుద్ఘాటించారు. ఈ పోరాటంలో అందరూ కలిసి రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.“జనం బాట” కార్యక్రమం 2025 అక్టోబర్ 25 నుండి ప్రారంభమైంది. ఈ యాత్ర 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు కవర్ చేస్తూ 2026 ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుంది.

భవిష్యత్‌ ఎన్నికల వ్యూహం ఏమిటి?

తెలంగాణలో 2026 స్థానిక ఎన్నికలు, 2027 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనం బాట యాత్ర‌ కవితకు రాజకీయ ప్రొఫైల్ పునరుద్ధరణకు కీలక వేదిక. పార్టీ పునర్నిర్మాణం, ప్రజల నాడి అర్థం చేసుకోవడం భవిష్యత్తు అభ్యర్థుల ఎంపికలో పాత్ర కల్పించడం వంటి వ్యూహాలకు ఇది ప్రారంభ బిందువు. తెలంగాణ‌లో జాగృతి రాజకియంగా ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు పోంది ఎదుగుతుందో లేదో చూడాలి.

జాగృతి జనం బాట యాత్ర - Tholi Paluku