Let's talk: editor@tmv.in
జ‌స్టిస్ గ‌వాయ్ పై దాడికి నిర‌స‌న‌గా ధ‌ర్నా

జ‌స్టిస్ గ‌వాయ్ పై దాడికి నిర‌స‌న‌గా ధ‌ర్నా

FL - BRTH
9 అక్టోబర్, 2025

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ సిపిఐ ప్ర‌జాసంఘాల ఆధ్వ‌ర్యంలో అనంత‌పురం న‌గరంలోని అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద ధ‌ర్నా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జె.రాజారెడ్డి మాట్లాడుతూ జస్టిస్ గవాయ్ పై సనాతన ధర్మం పేరుతో ఓ న్యాయవాది కోర్టులో దాడి చేయడానికి దుర్మార్గమని మండిపడ్డారు.బిజెపి ఆర్ఎస్ఎస్ మతోన్మాద చర్యలను తీవ్రంగా నిర‌సిస్తున్నామ‌ని తెలిపారు. జస్టిస్ గవాయ్ పై దాడి చేసిన కిషోర్ ని తక్షణమే శిక్షించాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మతోన్మాద చర్యలకు చరమగీతం పాడాలని డిమాండ్ చేశారు.

సనాతనం పేరుతో దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడి జాతి యావత్తు తలదించుకునే హేయమైన చర్యగా అభివ‌ర్ణించారు. సిజేఐపై దాడిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అణగారినవర్గాలపై జరుగుతున్న దాడులను తిప్పి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ జిల్లా కార్య‌ద‌ర్శి రాజారెడ్డి అన్నారు. దేశంలో రాష్ట్రంలో సనాతనం పేరుతో పెద్ద ఎత్తున జరుగుతున్న దాడులపై, సమాజంలో అసమానతలు పెంచి పోషిస్తున్న బిజెపిని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలని కోరారు. కేవలం అధికారం కోసం విధానాలను మార్చుకోవడం సరికాదని, అన్ని వర్గాల ప్రజల పక్షంగా నిలబడాల్సిన అవసరం ఉందని సనాతన సేనానికి రాజారెడ్డి సూచించారు.

దేశాన్ని పాలిస్తున్న బీజేపీ పెద్దలు అన్ని వ్యవస్థల గుప్పెట్లో పెట్టుకుని బ్రష్టు పట్టిస్తున్నారని, ఈ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని ..తగ్గిన సమయంలో బుద్ధి చెబుతార‌ని హెచ్చరించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. భారత రాజ్యాంగానికి రక్షకుడిగా ఉంటానని, దేశ ప్రజలకు భరోసా కల్పించిన సిజేఐ గవాయ్ పై ఉద్దేశపూర్వకంగా దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని రాజారెడ్డి అన్నారు. తక్షణమే జస్టిస్ గవాయ్ పై దాడి చేసిన కిషోర్ ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సీపీఐ జిల్లా కార్య‌ద‌ర్శి రాజారెడ్డి డిమాండ్ చేశారు.

జ‌స్టిస్ గ‌వాయ్ పై దాడికి నిర‌స‌న‌గా ధ‌ర్నా - Tholi Paluku