Let's talk: editor@tmv.in
జవహర్‌లాల్ నెహ్రూ ఒక "అసాధారణ సంస్థా నిర్మాత" - జైరాం రమేష్

జవహర్‌లాల్ నెహ్రూ ఒక "అసాధారణ సంస్థా నిర్మాత" - జైరాం రమేష్

Dantu Vijaya Lakshmi Prasanna
14 ఫిబ్రవరి, 2026

మాజీ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూను "అసాధారణ సంస్థా నిర్మాత" గా అభివర్ణిస్తూ, 1959లో ఆయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వివియన్ బోస్‌కు నెహ్రూ రాసిన క్షమాపణ లేఖను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ శుక్రవారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

"కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ మధ్య సంబంధాల గురించి చాలా చర్చలు జరుగుతుంటాయి. 1959 జూన్ 26న అప్పటి ప్రధాని నెహ్రూ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వివియన్ బోస్‌కు రాసిన అసాధారణ క్షమాపణ లేఖ ఇక్కడ ఉంది. నెహ్రూ నిజంగా ఎంతటి గొప్ప సంస్థా నిర్మాతో దీనిని బట్టి అర్థమవుతుంది!" అని పేర్కొన్నారు.

న్యాయవ్యవస్థ పట్ల గౌరవం

కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ మధ్య ఉండాల్సిన సమతుల్యత గురించి నేడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో రమేష్ ఈ లేఖను ప్రస్తావించారు. దేశ ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి న్యాయమూర్తుల పట్ల ఎంతటి గౌరవభావాన్ని కలిగి ఉండాలో చెప్పడానికి నెహ్రూ రాసిన ఈ లేఖే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ముంద్రా స్కామ్ - నేపథ్యం

ఈ వివాదం 1950వ దశకం చివరలో దేశాన్ని కుదిపేసిన 'ముంద్రా కుంభకోణం' విచారణ సందర్భంగా తలెత్తింది. ఎల్‌ఐసీ ద్వారా హరిదాస్ ముంద్రా కంపెనీలలో అనైతికంగా పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణలపై జస్టిస్ వివియన్ బోస్ విచారణ జరిపారు. ఆ నివేదికలోని కొన్ని అంశాలపై అప్పట్లో విలేకరుల సమావేశంలో నెహ్రూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, "ముంద్రా నుంచి కాంగ్రెస్ పార్టీకి అందిన నిధుల కోసమే ఈ ఒప్పందం జరిగిందని ఎవరైనా భావిస్తే, అలా భావించే వ్యక్తికి తెలివితేటలు లేవని అర్థం. వారు హైకోర్టు జడ్జి అయినా సరే" అని నెహ్రూ వ్యాఖ్యానించారు. ఈ మాటలు జస్టిస్ బోస్‌ను కించపరిచేలా ఉన్నాయని కోల్‌కతా బార్ అసోసియేషన్ సహా న్యాయ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

తన వ్యాఖ్యలు అనుచితమని గ్రహించిన నెహ్రూ, వెంటనే జూన్ 26, 1959న జస్టిస్ బోస్‌కు లేఖ రాశారు. "ఆ వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది.. అది నా పొరపాటే. అకస్మాత్తుగా అడిగిన ప్రశ్నలు, పని ఒత్తిడి వల్ల అలా మాట్లాడాను. నా ప్రవర్తనకు క్షమించండి" అంటూ తన విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పునాదులను నెహ్రూ ఎలా నిర్మించారో చెప్పడానికి ఆయనలోని ఈ వినమ్రత ఒక ఉదాహరణ అని జైరాం రమేష్ అభివర్ణించారు.

ప్రస్తుత ప్రభుత్వ తీరుపై విమర్శలు

ఇదే సమయంలో జైరాం రమేష్ ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పాతకాలపు ప్రజాస్వామ్య విలువలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అమెరికా-భారత్ మధ్య జరిగిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ, ఇది దేశ ప్రయోజనాలను పణంగా పెట్టిన ఒప్పందమని ఆరోపించారు.

ట్రంప్ ప్రభుత్వంతో భారత్ చేసుకున్న ఒప్పందం ఏకపక్షంగా ఉందని రమేష్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించుకుంటామన్న హామీ ఇచ్చి భారత్ అమెరికాకు లొంగిపోయిందని విమర్శించారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించడం వల్ల భారతీయ రైతుల కంటే అమెరికా రైతులే ఎక్కువగా లాభపడతారని ఆయన విశ్లేషించారు.

ప్రచారం వర్సెస్ వాస్తవం

ప్రభుత్వం ఈ వాణిజ్య ఒప్పందాన్ని గొప్ప విజయంగా ప్రచారం చేసుకుంటోందని, కానీ క్షేత్రస్థాయిలో అమెరికా తన ప్రయోజనాలను మాత్రమే చూసుకుందని రమేష్ అన్నారు. టెక్స్‌టైల్ రంగంలో బంగ్లాదేశ్‌తో పోలిస్తే భారత్ తనకున్న పైచేయిని కోల్పోయిందని, ఇది ప్రభుత్వం యొక్క ఆర్థిక దౌత్య వైఫల్యమని ఆయన ఎద్దేవా చేశారు.