Let's talk: editor@tmv.in
జవహర్‌నగర్ డంప్‌యార్డ్‌పై ఎంపీ ఈటల ఆగ్రహం

జవహర్‌నగర్ డంప్‌యార్డ్‌పై ఎంపీ ఈటల ఆగ్రహం

Gaddamidi Naveen
3 డిసెంబర్, 2025

మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ డంప్‌యార్డ్‌ను బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించిన ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ అక్కడి ప్రజలు పడుతున్న తీవ్రమైన ఇబ్బందులను తీవ్రంగా లేవనెత్తారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ ఈట‌ల మాట్లాడుతూ.. ఒక కాలంలో జన సంచారం తక్కువగా ఉన్న ప్రాంతమైందని భావించి జవహర్ నగర్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారాయని ఆయ‌న తెలిపారు. అప్పట్లో రోజుకు 300 టన్నుల చెత్త వేస్తే ఇప్పుడు అది 10 వేల మెట్రిక్ టన్నులకు పెరిగిందని ఆయ‌న‌ ఆవేదన వ్యక్తం చేశారు.

లక్షల మందికి ఆరోగ్య సమస్యలు

డంపింగ్ యార్డ్ వల్ల దమ్మాయిగూడ, జవహర్ నగర్, నారపల్లి, ఘట్కేసర్ పరిసర ప్రాంతాల లక్షలాది ప్రజలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయ‌న‌ విమర్శించారు. చెత్త లారీలు కప్పులు లేకుండా తిరగడం వలన రహదారులపై, ఇళ్లపై, ప్రజలమీద చెత్త పడుతుండటం సాధారణమైందని తెలిపారు. కలుషిత నీరు, దుర్వాసన వల్ల శ్వాసకోశ సమస్యలు, చర్మవ్యాధులు, ఇతర తీవ్రమైన జబ్బులు ప్రబలాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొంత మంది కుటుంబాలు పిల్లలు పుట్టకపోవడంపై కూడా వాపోతున్న పరిస్థితి ఏర్పడిందని ఆయ‌న‌ చెప్పారు.

గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును పెడచెవిన పెట్టడం దుర్మార్గం

బీజేపీ పోరాటంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పలుమార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయ‌న‌ అన్నారు. 2017లో నగరంలో నలుమూలలా కొత్త డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తామని అఫిడవిట్ ఇచ్చి ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. 2021, 2022, 2025 సంవత్సరాల్లో గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులు కూడా అమలుకావడం లేదని ఆయ‌న‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. డంప్‌యార్డ్ నుంచి గుండ్ల చెరువు వరకు చెరువులన్నీ కలుషితం అయ్యాయని, భూగర్భజలాలు విషపూరితం అవుతున్నాయని ఆయ‌న‌ హెచ్చరించారు. ప్రజలు ఆక్సిడెంట్లలో ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని ఆయ‌న‌ మండిపడ్డారు. అడ్డుకున్న గ్రామస్థులపై చెత్త లారీ డ్రైవర్లతో దాడులు చేయించడం దారుణమని, శంకర్ అనే యువకుడిపై దాడి జరిగిన ఘటనను ఉదాహరణగా ఆయ‌న‌ పేర్కొన్నారు.

గతంలో ఈ ప్రాంతానికి ఎంపీగా పనిచేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు, ఆయనకు ఇక్కడి ప్రజల బాధలు తెలుసు. సమస్య పరిష్కరిస్తాం అనుకున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే బీజేపీ తీవ్రమైన ఉద్యమానికి సిద్ధమైందని ఆయ‌న‌ స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత స్థానిక ప్రజలతో కలిసి దీక్షలతో,ఆందోళనలతో పోరాటం ప్రారంభిస్తామని ఆయ‌న‌ హెచ్చరించారు. ఈ తనిఖీలో జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు పీ. విక్రమ్ రెడ్డి, ఇంచార్జీ సుదర్శన్ రెడ్డి, ఉపాధ్యక్షులు జీ. జగన్ గౌడ్, కౌన్సిలర్ సముద్రాల హంసరాణి, తదితరులు పాల్గొన్నారు.