Let's talk: editor@tmv.in
జీవితాన్ని కళగా చూపే ‘‘ది ప్రాఫెట్’’

జీవితాన్ని కళగా చూపే ‘‘ది ప్రాఫెట్’’

FL - BHAVN
16 సెప్టెంబర్, 2025

ఖలీల్ జిబ్రాన్ 20 వ శతాబ్ధానికి చెందిన లెబనీస్ అమెరికన్ రచయిత. ఆయన రాసిన పుస్తకమే ది ప్రాఫెట్. ఈ పుస్తకం 1923 లో ప్రచురితమైంది. ఈ పుస్తకం 26 తాత్విక వ్యాసాల సంపుటి. శతాబ్ధ కాలంగా ప్రపంచ పాఠకుల మనసుల మీద గొప్ప ప్రభావం చూపుతూనే ఉంది. ఈ పుస్తకంలోని వచన కవిత్వ భాషా లాలిత్యం ఆకట్టుకునేదిగా ఉంటుంది. జిబ్రాన్ అందించిన తత్వ బోధ జీవితంలోని అనేకానేక పార్శ్వాలను సున్నితంగా స్పృశిస్తుంది. ప్రేమ, వివాహం, చేసే పని, సంతోషం, బాధ, స్నేహం వంటి ఇరవై ఆరు అంశాల గురించి ప్రవక్త అల్ముస్తఫా బోధించే ఉపదేశాలే ఈ పుస్తక సారాంశంగా చెప్పవచ్చు.

కథా సందర్భం

ఈ పుస్తక కథానాయకుడు అల్ముస్తఫా. ఆర్ఫాలీస్ అనే ద్వీప నగరంలో పన్నెండుళ్లుగా నివసిస్తున్న ప్రవక్తగా చెప్పవచ్చు. అతడి జన్మస్థలానికి తిరిగి తీసుకెళ్లేందుకు ఒక ఓడ రాబోతోందనేది ఈ పుస్తక సందర్భం. ఈ వార్త విన్న ఆ నగర వాసులు చాలా దిగులు పడుతుంటారు. కానీ ఆ దిగులు నుంచి వారిలో ఉదయించిన ఎన్నో సందేహాలను వీడ్కోలు సమయంలో నివృత్తి చేయమని వారంతా కోరుతారు. ఆ సందర్భంలో ఆయన జీవితపు అనేక పార్శ్వాల గురించిన లోతైన జ్ఞానాన్ని పంచుకుంటారు. ఆయన మాటలు కేవలం సందేశాలు మాత్రమే కాదు అవి అతి మధురమైన కవిత్వంగా అనిపిస్తాయి.

జిబ్రాన్ ఈ పుస్తకంలో జీవితంలోని ప్రతి పార్శ్వాన్ని స్పృశించినట్లు అనిపిస్తుంది. జీవించడం ఒక కళ అనుకుంటే జీవితంలోని ప్రతి సందర్భమూ ఒక కళారూపంగా ఎలా మలచుకోవాలో ఈ పుస్తకం చర్చిస్తుందని చెప్పవచ్చు. ‘‘ప్రేమ కేవలం ప్రేమనే ఇస్తుంది తప్ప మరోటేది ప్రేమ నుంచి ఆశించలేము, ప్రేమకు ప్రతి గా ప్రేమ తప్ప మరేమీ ఆశించదు. ప్రేమ బంధనం కాదు, అదొక స్వేచ్ఛ’’ అని ప్రేమ గురించి చెప్పిన ఈ మాటలు ఎంతో లోతైన తాత్విక వాస్తవ జ్ఞానాన్ని అందిస్తాయి. ఇలాంటి మాటల్లో ఇప్పటి వరకు మనమంతా ప్రేమ అని అనుకుంటున్నది ఎంత అర్థరహితమో అర్థమవుతుంది. ఆలోచింప జేస్తుంది.

‘‘పిల్లలు అంటే మీ నుంచి వచ్చిన వారు కాదు, వారు మీ ద్వారా మాత్రమే ఈ లోకంలోకి వచ్చారు.’’ అనే మాట పిల్లల విషయంలో మనకు ఉండాల్సింది కేవలం బాధ్యత మాత్రమే హక్కు కాదని, వారు మీ వారసులు కాదు, తమ సొంత ఆత్మలతో వారి స్వతంత్ర జీవితాశయాలతో జన్మించిన సర్వస్వతంత్ర వ్యక్తులని నిర్మోహమాటాంగా చెప్పేస్తే దాన్ని తట్టుకోవడం కష్టమే. కానీ అదే నిజమని నిలకడగా ఆలోచిస్తే అర్థం అవుతుంది. ఇలా నిప్పులాంటి జీవిత నిజాలను మనసు వాకిట్లో ఆవిష్కరించే పుస్తకం ఇది.

‘‘చేసే పని ప్రేమతో చేసినపుడు దానితో మీరు అనుసంధానించబడతారు. పనంటే మరేదో కాదు అది మీలోని ప్రేమ వ్యక్తీకరణ’’ పని అనేది కేవలం జీవిక కాదని, భారం కాదని, ఆత్మ సంతృప్తి కోసం చేసే ఒక అద్భుత కళగా భావించాలని ఆయన చేసే బోధ జీవన భారాన్ని తొలగించే మార్గంగా తోస్తుంది.

‘‘మీలో కలిగే బాధ ఇప్పటి వరకు మీరు అనుభవించిన ఆనందం లోతును కొలిచే సాధనం’’ అని చెప్తాడు జిబ్రాన్. ఈ మాటలో సుఖదు:ఖాలు వేర్వేరు కాదని ఒక నాణెపు రెండు పార్శ్వాలుగా చూడాలనే సందేశం ఉంటుంది. ఇవి విడిగా ఉండలేవు. ఇవ్వాళటి దు:ఖం రేపటి ఆనందాన్ని మరింత మధురంగా మార్చేందుకే అని గ్రహించమని చెబుతాడు.

ది ప్రాఫెట్ వచన కవిత్వ శైలీలో ఉంటుంది. ప్రతీ వాక్యం ఒక లోతైన ఆర్థంతో ఉంటుంది. అతి సలభమైన పదాల్లో క్లిష్టమైన తత్వబోధ ఈ పుస్తకంలో ఉంటుంది. చాలా భాషల్లో ఈ పుస్తకం అనువాదం అయ్యింది. ప్రపపంచంలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో ఇది కూడా ఒకటి. 1960 ల్లో మొదలైన కౌంటర్ కల్చర్ లో ఈ పుస్తకం ఆధ్యాత్మిక గ్రంథంగా గుర్తించారు.

మతానికతీతం

దిఫ్రాఫెట్ ఒక మతానికి సంబంధించిన బోధ కాదు. ఇది జీవించే తీరును వివరించే పుస్తకంగా చెప్పవచ్చు. మనుషుల మధ్య అనుబంధాలలోని వాస్తవికతలను వివరిస్తుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కునేందుకు సన్నద్ధం చేస్తుంది. జీవితానికో మార్గదర్శనంగా చెప్పవచ్చు. పుస్తకం పూర్తయ్యే సమయానికి ఒక కొత్త అనుభూతితో జీవితం వైపు చూసే దృక్కోణాన్ని మార్చేస్తుంది. ఎన్నో కొత్త కోణాలను ఆవిష్కరిస్తుంది. ఇది కేవలం చదివి వదిలేసే పుస్తకం కాదు. జీవితంలో ప్రతీక్షణం ఆచరణలో పెట్టుకోవాల్సిన పుస్తకంగా చెప్పవచ్చు. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. జీవన గీత పేరుతో ప్రముఖ ప్రజాకవి కాళోజీ 1968 లో తెలుగులో అనువదించారు. యువభారతి వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. చదవాలనుకునే వారు ఇంగ్లీష్ మూలాన్ని ఆన్ లైన్ లో తెప్పించుకోవచ్చు. తెలుగులో కూడా మార్కెట్ లో అందుబాటులో ఉంది. జీవిత సత్యాన్ని అన్వేషించేవారికి ఇదొక మార్గం చూపగలదని చెప్పవచ్చు.

జీవితాన్ని కళగా చూపే ‘‘ది ప్రాఫెట్’’ - Tholi Paluku