

జల సంరక్షణే తరాలకు భరోసా: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
"జలమే జీవం.. ఆ జలాన్ని కాపాడుకోవడమే మనందరి బాధ్యత. ప్రతి నీటి చుక్కను పొదుపు చేసి, భూగర్భ జలాలను పెంచడం ద్వారానే మనం భవిష్యత్తు తరాలకు భరోసా ఇవ్వగలం" అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గురువారం కానూరులోని ఏపీఎస్‌ఐఆర్‌డీ భవన్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థలో జలవనరుల స్థిరత్వం’ అనే వర్క్‌షాప్‌ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
జల జీవన్ మిషన్ 2.0లో జల సంరక్షణ ప్రధాన లక్ష్యం
జల్ జీవన్ మిషన్ 2.0లో నీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకంతో నీటి పొదుపు చర్యలను బలోపేతం చేస్తామని వెల్లడించారు.
“నీరు ఉన్న చోట అభివృద్ధి పుడుతుంది”
“నీరు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి సుస్థిరంగా ఉంటుంది. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార లాంటి నదులే రాష్ట్ర ప్రజల జీవనాధారం. ఇంతటి నీటి వనరులు ఉన్నా వాటి సంరక్షణ ఒక కీలక సవాలుగా మారింది” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
భూగర్భ జలాలు తగ్గిపోవడం, లభ్యమయ్యే నీరు కాలుష్యం చెందడం గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద అడ్డంకులుగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల భాగస్వామ్యం అత్యవసరం
నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం అత్యదికమైందని పవన్ కళ్యాణ్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో వేసవిలో ఎదురయ్యే తాగునీటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని వాటర్‌షెడ్ల పునరుద్ధరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రకృతిని కాపాడితేనే మనకు భవిష్యత్తు బాగుంటుందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జల సంరక్షణకు 100 రోజుల ప్రణాళిక
రాష్ట్రంలో నీటి వృథాను అరికట్టేందుకు ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు ‘100 రోజుల నీటి వినియోగ డ్రైవ్’ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా:
• వర్షపు నీటిని ఒడిసి పట్టడం.
• భూగర్భ జలాల పెంపుదలపై అవగాహన కల్పించడం.
• ఇళ్లలో వాడే నీటిని వృథా చేయకుండా తిరిగి భూమిలోకి పంపే చర్యలు చేపట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
నీటి భద్రత భవిష్యత్తుకు కీలకం
మనిషికి అవసరమైన తాగునీటి శాతం భూమిపై చాలా తక్కువ. ఇప్పుడే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు తరాలకు అన్యాయం చేసినట్టే అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఇళ్లలో వాడే నీటిని భూమిలోకి తిరిగి పంపే పద్ధతుల నుంచి వాగులు, వంకలు, నదుల ద్వారా సముద్రంలో కలిసిపోతున్న నీటిని నిల్వ చేసుకునే వరకు సంపూర్ణ చైతన్యం అవసరమని అన్నారు.
కార్యాచరణే లక్ష్యం:
ఈ వర్క్‌షాప్‌లో చర్చించిన అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు త్వరలోనే గ్రామ పంచాయతీలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయనున్నామని, వంద రోజుల ప్రణాళిక ముగిసేలోపు ప్రతి గ్రామంలోనూ నీటి వనరుల లభ్యతపై సమగ్ర నివేదిక రూపొందిస్తామని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ డా. పి. కృష్ణయ్య, ఎస్ఐఆర్డీ కమిషనర్ ముత్యాలరాజు, అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
