Let's talk: editor@tmv.in
జల్‌జీవన్ మిషన్ 2028 వరకు పొడిగింపు

జల్‌జీవన్ మిషన్ 2028 వరకు పొడిగింపు

Pinjari Chand
11 మార్చి, 2026

ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామీణ తాగునీటి సరఫరా, రైల్వే మౌలిక వసతులు, విమానాశ్రయ అభివృద్ధి వంటి రంగాలకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ విషయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వివరించారు.

2028 వరకు జల్ జీవన్ మిషన్‌ పొడిగింపు

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి పైపుల ద్వారా తాగునీరు అందించే లక్ష్యంతో అమలు చేస్తున్న జల్‌జీవన్‌ మిషన్‌ ను 2028 డిసెంబర్ వరకు పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి మొత్తం వ్యయం రూ.8.69 లక్షల కోట్లకు పెంచారు. ఇందులో కేంద్రం వాటా రూ.3.59 లక్షల కోట్లు. 2019లో ఆమోదించిన రూ.2.08 లక్షల కోట్లతో పోలిస్తే అదనంగా రూ.1.51 లక్షల కోట్లు కేటాయించారు. ‘సుజలాం భారత్’ పేరుతో దేశవ్యాప్తంగా ఒక డిజిటల్ ఫ్రేమ్‌వర్క్‌ను కూడా ప్రవేశపెడతారు. ప్రతి గ్రామానికి ప్రత్యేక ‘సుజల్ గావ్ ఐడీ’ కేటాయించి నీటి వనరుల నుంచి ఇంటి వరకు మొత్తం సరఫరా వ్యవస్థను డిజిటల్ మ్యాపింగ్ చేస్తారు. గ్రామపంచాయతీలు, గ్రామ నీటి కమిటీలు (వీడబ్ల్యూఎస్‌సీ) పథకాల అమలు, నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయి. 2019లో దేశంలోని గ్రామీణ ఇళ్లలో కేవలం 3.23 కోట్లు (17శాతం) మాత్రమే ట్యాప్ కనెక్షన్లు ఉండగా, ప్రస్తుతం 19.36 కోట్ల గ్రామీణ ఇళ్లలో సుమారు 15.8 కోట్ల (81.6శాతం) ఇళ్లకు తాగునీటి పైపుల కనెక్షన్లు అందించినట్లు కేంద్రం తెలిపింది.

రూ.4,474 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం

ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినేట్‌ కమిటీ ఆన్‌ ఎకనామిక్‌ ఎఫైర్స్‌ రూ.4,474 కోట్ల విలువైన రెండు రైల్వే మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సైన్తియా–పాకూర్ నాలుగో లైన్, సంత్రగాచి–ఖరగ్‌పూర్ నాలుగో లైన్ ఈ ప్రాజెక్టులు ఇండియన్ రైల్వేస్‌ సామర్థ్యాన్ని పెంచి రద్దీని తగ్గించడంలో సహాయపడతాయి. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 5 జిల్లాల మీదుగా సుమారు 192 కిలోమీటర్ల మేర కొత్త లైన్లు నిర్మిస్తారు. దాదాపు 5,652 గ్రామాలకు మెరుగైన రైల్వే కనెక్టివిటీ లభిస్తుంది. ఇవి పూర్తయితే సంవత్సరానికి సుమారు 31 మిలియన్ టన్నుల అదనపు సరుకు రవాణా సామర్థ్యం పెరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.

మధురై విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా

కేబినెట్ మరో ముఖ్య నిర్ణయంగా తమిళనాడులోని మధురై ఎయిర్‌‌పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించింది. తమిళనాడులో చెన్నై, కోయంబత్తూర్ తర్వాత మధురై ప్రధాన నగరంగా ఎదుగుతోందని, అంతర్జాతీయ హోదా ఇవ్వడం ద్వారా పర్యాటకం, వాణిజ్యం, ప్రాంతీయ అభివృద్ధికి పెద్ద ఊతం లభిస్తుందని మంత్రి వైష్ణవ్ తెలిపారు. దక్షిణ తమిళనాడుకు ముఖ్య ద్వారంగా ఉన్న ఈ విమానాశ్రయం అంతర్జాతీయ యాత్రికులను ఆకర్షించి ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అదనంగా, ఈ నిర్ణయం ప్రాంతీయ కనెక్టివిటీని పెంచి పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలకు ప్రయాణాన్ని సులభతరం చేయనుంది.