
జల్‌జీవన్ మిషన్‌తో గ్రామీణులకు తాగునీరు: రాష్ట్రపతి
దేశంలో గ్రామీణ కుటుంబాలకు అందుబాటులో తాగునీరు లభించడం గణనీయంగా పెరిగిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. జల్‌జీవన్ మిషన్ ప్రారంభమైన 2019లో గ్రామీణ ఇళ్లలో కేవలం 17 శాతం కుటుంబాలకు మాత్రమే నల్లా కనెక్షన్ ఉండగా, ప్రస్తుతం అది 82 శాతానికి పెరిగిందని ఆమె వెల్లడించారు. జల్ మహోత్సవ్ కార్యక్రమంలో మాట్లాడిన రాష్ట్రపతి, భారతదేశంలో నీరు కేవలం ఒక మౌలిక సదుపాయం మాత్రమే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు, జీవనోపాధి, సామాజిక జీవితంతో ముడిపడి ఉందని చెప్పారు. ఈ విశేష పురోగతికి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్.పాటిల్, ఆయన బృందాన్ని ఆమె అభినందించారు. గతంలో గ్రామాల్లో తాగునీటి కోసం మహిళలు, పిల్లలు దూరప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు శుభ్రమైన తాగునీరు నేరుగా ఇళ్లకే చేరుతోందని ఆమె తెలిపారు. ఇది జల్ జీవన్ మిషన్ విజయాన్ని సూచిస్తోందన్నారు.
నీటి లభ్యతను మెరుగుపరచడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి చెప్పారు. సుజలాం భారత్ యాప్ , రియల్ టైమ్ డాష్‌బోర్డులు, డిసిషన్ సపోర్ట్ సిస్టమ్‌లు నీటి సరఫరాపై పారదర్శక పర్యవేక్షణకు సహాయపడుతున్నాయని వివరించారు. అలాగే మేరీ పంచాయత్ యాప్, పంచాయతీ డాష్‌బోర్డులు గ్రామ పంచాయతీ స్థాయిలో నీటి సేవలపై సమాచారం అందిస్తున్నాయని చెప్పారు. అదేవిధంగా సమాజంలోని ప్రతి వర్గం భాగస్వామ్యం లేకుండా నీటి వనరుల సంరక్షణ సాధ్యం కాదని రాష్ట్రపతి పేర్కొన్నారు. నీటిని కేవలం వినియోగ వనరుగా కాకుండా భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన అమూల్యమైన సంపదగా చూడాలని ఆమె సూచించారు.
15 కోట్లకు పైగా ట్యాప్ కనెక్షన్లు
ఇక జల్ మహోత్సవ్ కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్.పాటిల్ దేశంలో 15 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలు ఇప్పుడు ట్యాప్ నీటి కనెక్షన్ల ద్వారా శుభ్రమైన తాగునీరు పొందుతున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 89 శాతం పాఠశాలలు, 85 శాతం ఆంగన్‌వాడీ కేంద్రాలకు కూడా ట్యాప్ నీరు అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. జల్ జీవన్ మిషన్ 2.0 కింద మిగిలిన కుటుంబాలకు కూడా నీరు అందించేందుకు కేంద్ర కేబినెట్ రూ.1.51 లక్షల కోట్ల నిధులను ఆమోదించి, ఈ పథకాన్ని 2028 డిసెంబరు వరకు పొడిగించిందని ఆయన వెల్లడించారు. మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ సుమారు 24.8 లక్షల మహిళలకు నీటి నాణ్యత పరీక్షించే శిక్షణ ఇచ్చినట్లు కూడా మంత్రి తెలిపారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభమైన జల్ మహోత్సవ్ కార్యక్రమాలు మార్చి 22న జరుపుకునే వరల్డ్ వాటర్ డే వరకు కొనసాగనున్నాయి. దేశవ్యాప్తంగా నీటి సంరక్షణ, భద్రతపై అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
