Let's talk: editor@tmv.in
జలధారతో ప్రతీ ఎకరానికి నీరు: సీఎం చంద్రబాబు

జలధారతో ప్రతీ ఎకరానికి నీరు: సీఎం చంద్రబాబు

Panthagani Anusha
7 ఏప్రిల్, 2026

రాష్ట్రంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలం యడకల్లు గ్రామంలో నిర్వహించిన ‘జలధార’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత యాప్‌ను ఆవిష్కరించడంతో పాటు జల సంరక్షణ కోసం రూపొందించిన 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను సీఎం విడుదల చేశారు. "నీరు ఉంటేనే సంపద ఉంటుంది నీటి పొదుపే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మూలం" అని ఆయన ఉద్ఘాటించారు.

రాయలసీమ పై ప్రత్యేక దృష్టి

రాయలసీమ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ‘పూర్వోదయ’ పథకం ద్వారా ఈ ప్రాంతానికి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నామని సీఎం తెలిపారు. అనంతపురం వంటి కరువు ప్రాంతాల్లో కూడా చెక్‌డ్యామ్‌లు, ఇంకుడు గుంతలు, సూక్ష్మ సేద్యం వంటి చర్యల వల్ల భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయని గుర్తుచేశారు. డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందంజలో ఉందని రాబోయే ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటి సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు.

అమరావతిపై ‘విచిత్ర’ ఆలోచనలు వద్దు

సభలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీపై ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి పేరు పలకడానికి కూడా ఇష్టపడని జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు ‘మావిగన్’ (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) అంటూ విచిత్రమైన ప్రతిపాదనలు తీసుకురావడం హాస్యాస్పదమన్నారు. అమరావతి నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపించడం కేవలం అసహనమేనని మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ చట్టబద్ధత కల్పించడం రాష్ట్ర ప్రజల విజయమని, దేశంలోని అన్ని పార్టీలు మద్దతు తెలిపినా వైకాపా మాత్రమే వ్యతిరేకించడం సిగ్గుచేటని విమర్శించారు.

పాలనలో పారదర్శకతకు నిదర్శనంగా తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం ప్రజల ముందే ‘ప్రోగ్రెస్ రిపోర్ట్’ సమర్పించారు. క్షేత్రస్థాయిలో పనితీరు సరిగా లేని అధికారులను బహిరంగంగానే ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్నంతసేపూ ప్రజలు ‘జై అమరావతి’ నినాదాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. కార్యక్రమం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన హార్టికల్చర్ ఉత్పత్తులు, నీటి సంరక్షణ స్టాళ్లను సీఎం ఆసక్తిగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు పాల్గొన్నారు.