Let's talk: editor@tmv.in
జర్మనీ కంపెనీలకు తెలంగాణ ఆహ్వానం: సీఎం రేవంత్‌

జర్మనీ కంపెనీలకు తెలంగాణ ఆహ్వానం: సీఎం రేవంత్‌

Gaddamidi Naveen
5 నవంబర్, 2025

తెలంగాణను గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దడంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జర్మనీకి చెందిన ప్రతినిధి బృందాన్ని సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలో ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్‌ రంగాల్లో జర్మనీ కంపెనీల పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.

చెన్నై జర్మనీ కాన్సులేట్‌ జనరల్‌ కాన్సుల్‌ జనరల్‌ మైఖేల్‌ హాస్పర్‌ నేతృత్వంలోని జర్మనీ ప్రతినిధి బృందం మంగ‌ళ‌వారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా హాస్పర్‌ జర్మనీకి చెందిన ప్రముఖ బహుళజాతి సంస్థ “డుయిష్‌ బోర్సా” విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ వివరాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు.

వచ్చే రెండేళ్లలో ఈ సెంటర్‌ ద్వారా వెయ్యి మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నట్లు జర్మన్‌ ప్రతినిధులు తెలిపారు. హైటెక్ సిటీలో ప్రారంభమవుతున్న ఈ సెంటర్‌ ద్వారా జర్మనీ పెట్టుబడులు హైదరాబాద్‌ టెక్‌ రంగానికి కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెడతాయని వారు పేర్కొన్నారు.

జర్మన్ భాష, స్కిల్ డెవలప్‌మెంట్‌లో సహకారం కోరిన సీఎం

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి ఇన్నోవేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం దృఢంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో జర్మనీ భాగస్వామ్యం ఎంతో విలువైనది. హైదరాబాద్‌లో డుయిష్‌ బోర్సా జీసీసీ స్థాపనతో జర్మనీ పెట్టుబడులకు కొత్త దారులు తెరుచుకున్నాయని అన్నారు.రాష్ట్రంలో మరిన్ని జర్మన్‌ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా అన్ని రకాల సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం కల్పించడం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

అలాగే తెలంగాణ విద్యార్థులకు జర్మన్‌ భాషా బోధన కోసం హైదరాబాద్‌లో జర్మనీ టీచర్లను నియమించేందుకు సహకరించాలని జర్మనీ ప్రతినిధి బృందాన్ని ముఖ్యమంత్రి అభ్యర్థించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఓకేషనల్‌ ఎడ్యుకేషన్‌ రంగాల్లో జర్మనీతో భాగస్వామ్యం పెంపొందించాలని కూడా సూచించారు.ఇక విదేశాల్లో ఉపాధి అవకాశాల కల్పనలో తెలంగాణ ఓవర్సీస్‌ మన్‌పవర్‌ కంపెనీ ద్వారా జర్మనీ సహకారం పొందే దిశగా రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని సీఎం తెలిపారు.

హైదరాబాద్‌లో డుయిష్‌ బోర్సా జీసీసీ ప్రారంభం జర్మనీ పెట్టుబడుల విస్తరణతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కొత్త అధ్యాయం మొదలవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.