
జర్మనీలో భారీ బ్యాంకు దోపిడీ.. రూ.316 కోట్లు లూటీ
కొత్త సంవత్సరం వేడుకలకు ప్రపంచమంతా సిద్ధమవుతున్న వేళ, జర్మనీలో ఒక భారీ బ్యాంకు దోపిడీ జరిగింది. పశ్చిమ జర్మనీలోని గెల్‌సెన్‌కిర్షెన్ నగరంలో ఉన్న ఒక బ్యాంకు నుంచి సుమారు 30 మిలియన్ యూరోల (భారత కరెన్సీలో సుమారు రూ.316 కోట్లు) విలువైన నగదు, బంగారం, నగలను దుండగులు దోచుకెళ్లారు. ఇది ఇటీవల కాలంలో జర్మనీలో జరిగిన అతిపెద్ద బ్యాంకు దోపిడీలలో ఒకటిగా పోలీసులు పేర్కొన్నారు.
సినీ ఫక్కీలో ప్లాన్
ఈ దోపిడీని దొంగలు అత్యంత తెలివిగా, పక్కా ప్లాన్‌తో అమలు చేశారు. పోలీసుల కథనం ప్రకారం, దొంగలు ముందుగా బ్యాంకుకు చెందిన అండర్‌గ్రౌండ్ పార్కింగ్ స్థలంలోకి ప్రవేశించారు. అక్కడి నుండి బ్యాంకులోని ముఖ్యమైన 'వాల్ట్' (లాకర్లు ఉండే గది) గోడకు పెద్ద రంధ్రం చేసి లోపలికి చొరబడ్డారు. బ్యాంకు లోపల ఉన్న సుమారు 3,000 పైగా సేఫ్ డిపాజిట్ లాకర్లను వారు పగులగొట్టారు. వాటిలో ఉన్న నగదు, బంగారం, ఖరీదైన నగలను దోచుకుని, మళ్లీ అదే రంధ్రం ద్వారా బయటకు తప్పించుకున్నారు.
వెలుగులోకి వచ్చింది ఇలా..
సోమవారం తెల్లవారుజామున బ్యాంకులో అకస్మాత్తుగా 'ఫైర్ అలారం' మోగింది. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పుడు మాత్రమే బ్యాంకులో ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని అందరికీ తెలిసింది. భారీ సంచులతో కొందరు వ్యక్తులు పార్కింగ్ మెట్ల దగ్గర తిరుగుతున్నట్లు కొందరు సాక్షులు పోలీసులకు తెలిపారు.
దొంగల కోసం గాలింపు
సీసీటీవీ ఫుటేజ్ పరిశీలనలో సోమవారం తెల్లవారుజామున ఒక బ్లాక్ కలర్ ఆడి ఆర్ఎస్6 కారు పార్కింగ్ గ్యారేజ్ నుంచి బయటకు వెళ్లినట్లు గుర్తించారు. కారులో ఉన్నవారు ముఖాలకు మాస్కులు ధరించి ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆ వాహనానికి వాడిన నంబర్ ప్లేట్ ఉత్తర జర్మనీలోని హానోవర్ నగరంలో ముందుగానే దొంగిలించినదిగా తేలింది.
కస్టమర్ల ఆందోళన
ఈ దోపిడీ వార్త తెలిసిన తర్వాత, ఖాతాదారులు పెద్ద సంఖ్యలో ఆ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. తమ లాకర్లలో ఉంచిన బంగారం, నగలు పోయాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి నష్టం బీమా పరిమితిని మించిపోయిందని మీడియా కథనాలు తెలిపాయి.
ప్రస్తుతానికి పోలీసులు విచారణ జరుపుతున్నారు. కస్టమర్లు విడివిడిగా ఫిర్యాదులు చేయకుండా, నేరుగా బ్యాంకును సంప్రదించాలని సూచించారు. బ్యాంకు యాజమాన్యం ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. కాగా జర్మనీలో ఈ భారీ దోపిడీ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.
