Let's talk: editor@tmv.in
జర్నలిస్ట్ హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు విముక్తి

జర్నలిస్ట్ హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు విముక్తి

Pinjari Chand
8 మార్చి, 2026

2002లో జర్నలిస్ట్ హత్య కేసులో డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్‌ రామ్ రహీంసింగ్‌కు పంజాబ్, హర్యానా హైకోర్టు శనివారం విముక్తి కల్పించింది. జర్నలిస్ట్ రాంచందర్‌‌ ఛత్రపతి హత్య కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో 2019లో విధించిన జీవిత ఖైదు శిక్షను హైకోర్టు రద్దు చేసింది. చీఫ్ జస్టిస్ షీల్‌నగు నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. అయితే ఈ కేసులో ఉన్న మరో ముగ్గురు నిందితుల శిక్షలను మాత్రం కోర్టు యథాతథంగా కొనసాగించింది.

కేసు నేపథ్యం

జర్నలిస్ట్ రాంచందర్ ఛత్రపతి తన పత్రిక ‘పూరా సచ్’లో ఒక అనామక లేఖను ప్రచురించారు. ఆ లేఖలో డేరా సచ్చా సౌదా ఆశ్రమంలో మహిళా భక్తులపై లైంగిక దుర్వినియోగం జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి.ఈ కథనం వెలువడిన తర్వాత 2002 అక్టోబర్‌లో హర్యానాలోని సిర్సా వద్ద ఆయన ఇంటి బయట కాల్పులు జరిగాయి. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ ఘటనలో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను ప్రధాన కుట్రదారుడిగా పేర్కొన్నారు. అనంతరం 2006లో కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు అప్పగించారు.

2019లో జీవిత ఖైదు

2019లో పంచకులలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈ కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌తో పాటు మరో ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చి జీవిత ఖైదు శిక్ష విధించింది.

బాధిత కుటుంబం స్పందన

జర్నలిస్ట్ కుమారుడు అన్షుల్​ ఛత్రపతి ఈ తీర్పును తమ కుటుంబానికి పెద్ద దెబ్బగా అభివర్ణించారు. ఈ తీర్పును సుప్రీం కోర్టు ఆఫ్ ఇండయాలో సవాలు చేస్తామని తెలిపారు. సీబీఐ కూడా హైకోర్టు తీర్పుపై అప్పీల్ చేస్తుందని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు.

మరో కేసులో కూడా విముక్తి

ఇదివరకు 2024లో కూడా ఇదే హైకోర్టు డేరా సంస్థ మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు విముక్తి ఇచ్చింది. దర్యాప్తులో లోపాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ప్రస్తుతం రోహ్తక్‌లోని సునారియా జైలులో ఉన్నారు. తన ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం చేసిన కేసులో 2017లో విధించిన 20 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్నారు.

జర్నలిస్ట్ హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు విముక్తి - Tholi Paluku