
జర్మనీ.. ట్యాలెంట్కు టికెట్
జర్మనీ..! ఇప్పుడు ప్రపంచ విద్యార్థుల కలల గమ్యంగా మారింది. ముఖ్యంగా భారత విద్యార్థులకు ఇది ఒక కొత్త మార్గం, ఒక కొత్త భవిష్యత్తు. అమెరికా, కెనడా, యూకే లాంటి దేశాలు క్రమంగా కఠినమైన నిబంధనలు పెడుతుంటే, జర్మనీ మాత్రం అవకాశాల తలుపులు తెరిచి ఉంచుతోంది. 2025లో జర్మనీ ఎందుకు ఇంత ప్రాధాన్యం పొందుతోందో చెప్పడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఇవి అర్థం చేసుకోవాలంటే దాని విద్యా వ్యవస్థ, జీవన విధానం, కొత్త వీసా నియమాలు అన్నింటినీ సమగ్రంగా చూడాలి.
జర్మనీలోని పబ్లిక్ యూనివర్శిటీలు ఎక్కువగా ట్యూషన్ ఫీజులు వసూలు చేయవు. అంతేకాదు చాలా ప్రఖ్యాత విద్యాసంస్థలు ప్రపంచస్థాయి పరిశోధనతో పాటు నాణ్యమైన బోధనను అందిస్తూ, విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నాయి. 2025 నుంచి వీసా అప్లికేషన్లు పూర్తిగా డిజిటల్ కన్సులర్ పోర్టల్ ద్వారా మాత్రమే దాఖలు చేయాలి. ఇది ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా మార్చుతుంది. మరోవైపు జర్మనీలో కనీస వేతనం పెరుగుతుంది,.మినీ-జాబ్ పరిమితి కూడా కొంచెం పెరగడం విద్యార్థులకు మరింత ఉపయోగకరంగా మారుతుంది.
జర్మనీలో చదువుకునే విద్యార్థులకు మరో పెద్ద ఆకర్షణ ఉద్యోగ అవకాశాలు. ఇంజనీరింగ్, నేచురల్ సైన్సెస్, టెక్నాలజీ లాంటి రంగాల్లో నైపుణ్యానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. చదువు పూర్తయిన తర్వాత 18 నెలల వరకు వర్క్ వీసా పొడిగింపు లభించడంతో విద్యార్థులు కెరీర్ని ఆరంభించడానికి సమయం, స్థిరత్వం పొందుతున్నారు. దీనికి తోడు డీఏఏడీ, ఎరాస్మస్ లాంటి స్కాలర్షిప్లు ఆర్థిక భారాన్ని తగ్గించి, ప్రతిభకు కొత్త వేదికలు అందిస్తున్నాయి. ఇక ఖర్చుల విషయానికొస్తే, బెర్లిన్, మ్యూనిక్ లాంటి మెట్రో నగరాల్లో జీవన వ్యయం ఎక్కువ. మ్యూనిక్లో నెలకు 1500 యూరోలు ఖర్చవుతుంటే, చిన్న పట్టణాల్లో మాత్రం తక్కువ ఖర్చుతో గడిపేయవచ్చు. నివాసం విషయంలో కూడా అనేక ఎంపికలు ఉన్నాయి. షేర్డ్ రూమ్స్, ప్రైవేట్ అపార్ట్మెంట్స్, పర్పస్ బిల్ట్ స్టూడెంట్ అకామోడేషన్, హోమ్ స్టేలు లాంటివి విద్యార్థుల కోసమే ఉన్నాయి.
ఈ అంశాలను కలిపి చూస్తే, భారతీయ విద్యార్థులకు జర్మనీ మంచి గమ్యస్థలంగా మారుతుందని చెప్పవచ్చు. నాణ్యమైన విద్యతో పాటు, బలమైన స్కాలర్షిప్ వ్యవస్థ, ఉద్యోగ అవకాశాలు, తక్కువ ఖర్చుతో కూడిన జీవన విధానం లాంటివి విద్యార్థుల భవిష్యత్తుకు మంచి చేస్తున్నాయి. ఇక ఆధునిక పరిశోధన, ప్రాక్టికల్ లెర్నింగ్ కలిసిన ఈ అనుభవం భారత విద్యార్థులకు కొత్త ఆత్మవిశ్వాసం, కొత్త మార్గం చూపుతోంది. అందుకే అమెరికా, కెనడా లాంటి సాంప్రదాయ గమ్యాల కంటే ఇప్పుడు జర్మనీ విద్యా పటంలో ఒక ముఖ్య కేంద్రంగా నిలుస్తోందని చెప్పవచ్చు.
