Let's talk: editor@tmv.in
జమ్మూ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై కాల్పుల కలకలం

జమ్మూ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై కాల్పుల కలకలం

Pinjari Chand
13 మార్చి, 2026

‘దేవుడే నన్ను కాపాడాడు’ అంటూ తనపై జరిగిన హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్న ఘటనను జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా గుర్తుచేసుకున్నారు. బుధవారం రాత్రి జమ్మూలో జరిగిన ఓ వివాహ వేడుకలో ఈ ఘటన చోటుచేసుకుంది. వేడుక జరిగిన ప్రాంగణంలో తగినంత పోలీసు భద్రత లేకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో దాడి చేసిన వ్యక్తిని కమల్ సింగ్ జామ్‌వాల్‌గా గుర్తించారు. జమ్మూ నగర శివారులోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో జరిగిన వివాహ కార్యక్రమంలో అతడు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు అయిన అబ్దుల్లాను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నేను బాగానే ఉన్నాను. దేవుడే నన్ను కాపాడాడని గురువారం ఉదయం అబ్దుల్లా చెప్పారు.

తృటిలో తప్పిన ప్రమాదం

ఆ ఘటనను గుర్తుచేసుకుంటూ ఆయన వివరించారు. పెళ్లి వేడుకలో వధువు వచ్చిన కొద్దిసేపటికే తాను మంటపం బయటకు వచ్చి ఇంటికి బయలుదేరుతున్న సమయంలో మొదట కొన్ని పేలుళ్ల శబ్దాలు వినిపించాయని చెప్పారు. మొదట అవి పటాకుల శబ్దాలేమో అనుకున్నాను. కానీ వెంటనే శరీరంలో మండుతున్నట్టు అనిపించింది. ఆ సమయంలో ఏమి జరిగిందో నాకు అర్థం కాలేదని ఆయన తెలిపారు. అబ్దుల్లా చెప్పిన ప్రకారం దాడి చేసిన వ్యక్తి తన వెనుకవైపు దగ్గరికి చేరుకున్నాడు. రెండోసారి కాల్పులు జరపడానికి ప్రయత్నించిన సమయంలో భద్రతా సిబ్బంది, అక్కడ ఉన్న ఇతరులు జోక్యం చేసుకోవడంతో అతడి ప్రయత్నం విఫలమైంది. ఒకరు అతని చేతిని వెనక్కి లాగడంతో అతడు అస్థిరంగా మారాడు. అదే సమయంలో అతని పిస్టల్ గురితప్పింది. వెంటనే భద్రతా సిబ్బంది అతని చేతిలోని తుపాకీని లాక్కున్నారు. కానీ అప్పటికే మరోసారి కాల్పులు జరిగిపోయాయని అబ్దుల్లా తెలిపారు. భద్రతా సిబ్బంది వెంటనే తనను కారులోకి ఎక్కించి తీసుకెళ్లారని, అప్పుడే అది పిస్టల్ కాల్పులేనని చెప్పారు.

దాడి చేసిన వ్యక్తి గురించి తెలియదు

ఆ వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. అతను ఎందుకు ఇలా చేశాడో కూడా నాకు తెలియదని జమ్మూలోని భటిండీ నివాసంలో మీడియాతో మాట్లాడిన అబ్దుల్లా తెలిపారు. పోలీసుల ప్రకారం, 63 ఏళ్ల కమల్ సింగ్ జామ్‌వాల్ జమ్మూలోని పురాని మండీ ప్రాంతానికి చెందినవాడు. ప్రాథమిక విచారణలో అతను గత 20 సంవత్సరాలుగా అబ్దుల్లాను చంపాలని అనుకుంటున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. ఈరోజు అవకాశం వచ్చింది, కానీ అతను తప్పించుకున్నాడని అతను పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే ఎందుకు ఈ ద్వేషం కలిగిందని విచారించినప్పటికీ కారణం ‘వ్యక్తిగతం’ అని మాత్రమే చెప్పినట్లు అధికారులు తెలిపారు. అబ్దుల్లా మాత్రం తాను ఎప్పుడూ ఎవరి పట్ల ద్వేషం పెట్టుకోలేదని, రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రజలకు సహాయం చేయడానికే ఎప్పుడూ ప్రయత్నించానని చెప్పారు.

భద్రతా లోపాలపై ఆందోళన

ఈ ఘటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరైనప్పటికీ అక్కడ ఎలాంటి పోలీసు భద్రత లేకపోవడం పెద్ద లోపమని అన్నారు. అక్కడ ఒక్క పోలీసు కూడా కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో, ముఖ్యంగా ప్రస్తుతం దేశంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలకు తగిన భద్రత అవసరమని ఆయన చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, ఏమి జరిగిందో పూర్తిగా తెలుసుకోవాలని ఆయన కోరారు.

అమిత్ షా ఫోన్

ఈ ఘటన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తనకు ఫోన్ చేసి పరిస్థితిని తెలుసుకున్నారని అబ్దుల్లా తెలిపారు. ఆయన నా ఆరోగ్యం గురించి అడిగారు. నేను దేవుడి కృపతో సురక్షితంగా ఉన్నానని చెప్పాను. నిందితుడిని పట్టుకున్నామని, పూర్తిగా విచారణ చేస్తామని చెప్పారని అబ్దుల్లా తెలిపారు.

భద్రతా సిబ్బందికి ప్రశంసలు

తనను రక్షించడంలో భద్రతా సిబ్బంది ధైర్యంగా వ్యవహరించారని అబ్దుల్లా ప్రశంసించారు. తన వ్యక్తిగత భద్రతా అధికారులు (పీఎస్‌వోలు), నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్ సిబ్బంది, ఇతర భద్రతా సిబ్బంది వేగంగా స్పందించి ప్రమాదాన్ని అడ్డుకున్నారని అన్నారు.

భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు

జడ్‌ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన నాయకుడిపై జరిగిన ఈ దాడి జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా వ్యవస్థపై ఆందోళనలు రేకెత్తించింది. సాధారణంగా ఇలాంటి ప్రముఖులు హాజరయ్యే కార్యక్రమాల ముందు ప్రాంగణాన్ని పూర్తిగా తనిఖీ చేసి కఠిన భద్రత ఏర్పాటు చేయాలి. ఈ ఘటనపై ఆయన కుమారుడు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్‌‌ అబ్దుల్లా కూడా స్పందించారు. ఒక వ్యక్తి లోడ్ చేసిన పిస్టల్‌తో దగ్గరికి చేరుకుని కాల్పులు జరపడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఆయన అన్నారు. భద్రతా బృందం తక్షణ స్పందన వల్లే హత్యాయత్నం విఫలమైందని తెలిపారు. ఘటన అనంతరం ముఖ్యమంత్రి జమ్మూకు చేరుకుని నేరుగా తన తండ్రి నివాసానికి వెళ్లారు. ఈ ఘటన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వ భద్రత పొందుతున్న ప్రముఖులందరి భద్రతను అధికారులు పునఃసమీక్షిస్తున్నారు. కాన్వాయ్‌లలో ఉపయోగించే జామర్ పరికరాలను కూడా ఆధునీకరించేందుకు చర్యలు చేపడుతున్నారు.

జమ్మూ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై కాల్పుల కలకలం - Tholi Paluku