
జమ్మూ కశ్మీర్ భద్రతపై అమిత్ షా సమీక్ష
జమ్మూ, కశ్మీర్ లో ప్రస్తుతం నెలకొన్న శాంత్రి భద్రతలపై కేంద్ర హెంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష సమావేశం నిర్వహించారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, యూనియన్ హోం సెక్రటరీ, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, ఆర్మీ చీఫ్, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీ, కేంద్ర సాయుధ పోలీసు బలగాల డైరెక్టర్లు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో హోం మంత్రి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. జమ్మూ,కశ్మీర్ లో శాంతి భద్రతలకు భంగం కలిగించే ఏ ప్రయత్నాన్ని అయినా అణచివేయాలని, అందుకు భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎన్డీయే ప్రభుత్వం ఉగ్రవాద రహిత కశ్మీర్ కు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఉగ్రవాద నెట్ వర్క్ దాదాపు ధ్వంసమైంది
జమ్మూ,కశ్మీర్ లో భద్రతా సంస్థలు నిరంతరం పహారా కాస్తున్నాయని, వాటి కృషితో దాదాపు ఉగ్రవాద నెట్ వర్క్ ధ్వంసమైందని అమిత్ షా తెలిపారు. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లను బలోపేతం చేయడానికి కేంద్రం అన్నిరకాలుగా వనరులను సమకూరుస్తుందని ఈ సందర్భంగా వారికి వివరించారు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి అనంతరం కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం, భద్రతా బలగాలు చేపట్టిన చర్యలను షా ప్రశంసించారు. కశ్మీర్ లోయలో భద్రతా వాతావరణం గణనీయంగా మెరుగుపడిందని తెలిపారు. ఇక్కడు ఉన్న భిన్నమైన భద్రతా సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచాలని, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని హోం మంత్రి సూచించారు. శీతాకాలం సమీపిస్తున్న దృష్ట్యా, మంచు పరిస్థితులకు అనుగుణంగా ఉగ్రవాదులు సరిహద్దులు దాటే అవకాశముందని, వాటిని అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన భద్రతా బలగాలకు ఆదేశించారు.
