
జమ్మూలో సైనికులకు,ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు
శీతకాలంలో జమ్మూ లోని ఆటవీ ప్రాంతాలు కాల్పుల శబ్దంతో మోతెక్కాయి. ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారంతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సెర్చ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. సైనికులపైకి గ్రేనెడ్లు విసిరి తప్పించుకునే ప్రయత్నం చేశారు. జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో ఉన్న సుదూర అటవీ ప్రాంతంలో ఆదివారం భద్రతా బలగాలు–ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదులను నిర్వీర్యం చేసేందుకు భద్రతా బలగాలు అదనపు దళాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. చత్రూ ప్రాంతానికి చెందిన మండ్రాల్–సింఘూరా సమీపంలోని సొన్నార్ గ్రామం వద్ద మధ్యాహ్నం సమయంలో సంయుక్తంగా చేపట్టిన కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా ఈ కాల్పులు ప్రారంభమైనట్లు వెల్లడించారు.
ఈ ఆపరేషన్‌కు సైన్యం ‘ఆపరేషన్ త్రాషీ–I’ అని నామకరణం చేసినట్లు జమ్మూలో ఉన్న ఆర్మీ వైట్ నైట్ కార్ప్స్ ఎక్స్ వేదికగా తెలిపింది. జమ్మూకశ్మీర్ పోలీసులతో కలిసి జరుగుతున్న సంయుక్త ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా నిర్వహించిన సోదాల్లో, చత్రూ ఈశాన్య ప్రాంతంలోని సొన్నార్ ప్రాంతంలో ఉగ్రవాదులతో భద్రతా బలగాలు ముఖాముఖి అయినట్లు పేర్కొంది. సవాలుతో కూడిన భౌగోళిక పరిస్థితుల్లో, శత్రువుల కాల్పులకు ధైర్యంగా స్పందించిన సైనికుల వృత్తిపరమైన నైపుణ్యం, దృఢసంకల్పాన్ని ప్రశంసిస్తున్నాం. కార్డన్‌ను మరింత ఉదృతం చేసేందుకు అదనపు బలగాలను రంగంలోకి దింపాం. పౌర పరిపాలన, భద్రతా సంస్థలతో సమన్వయం కొనసాగుతోందని సైన్యం తెలిపింది.
విచక్షణ రహితంగా ఉగ్రవాదుల కాల్పులు
అధికారుల సమాచారం ప్రకారం సోదాల్లో పాల్గొన్న ఒక బృందం పాకిస్తాన్‌కు చెందిన జైష్-ఎ-మొహమ్మద్ (జేఈఎం) ఉగ్రసంస్థకు చెందినట్లు అనుమానిస్తున్న ఇద్దరు లేదా ముగ్గురితో కూడిన విదేశీ ఉగ్రవాదులను ఎదుర్కొంది. కార్డన్‌ను ఛేదించేందుకు వారు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో పాటు గ్రెనేడ్లు విసిరినట్లు అధికారులు తెలిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యం, సీఆర్‌పీఎఫ్, పోలీసులు అదనపు బలగాలను మోహరించి కార్డన్‌ను మరింత కట్టుదిట్టం చేశాయి. కొంతసేపు ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగినట్లు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులను గుర్తించి నిర్వీర్యం చేయడానికి పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ముగ్గురు సైనికులకు గాయాలు
జమ్మూ–కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లా ఎగువ అటవీ ప్రాంతంలో ఆదివారం భద్రతా బలగాలు–ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు సైనికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులకు స్ప్లింటర్ గాయాలు అయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదులను గుర్తించి నిర్వీర్యం చేయడానికి విస్తృత స్థాయిలో శోధన కొనసాగుతోంది. ఆపరేషన్‌ను వేగవంతం చేసేందుకు డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్ వంటి ఆధునిక పర్యవేక్షణ పరికరాలను ఉపయోగిస్తున్నారు.
ఈ ఏడాది మూడోసారి ఎదురుకాల్పులు
ఈ ఏడాది జమ్మూ ప్రాంతంలో భద్రతా బలగాలు–ఉగ్రవాదుల మధ్య జరిగిన మూడో ఎదురుకాల్పులు. గతంలో జనవరి 7, 13 తేదీల్లో కథువా జిల్లాలోని బిల్లావర్ ప్రాంతంలోని కాహోగ్, నజోట్ అటవీ ప్రాంతాల్లో రెండు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అలాగే గతేడాది డిసెంబర్ 15న ఉదంపూర్ జిల్లాలోని మజాల్తా ప్రాంతం సొఆన్ గ్రామంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ పోలీసు అధికారి మృతి చెందగా, దట్టమైన అడవులు, చీకటి కారణంగా ఉగ్రవాదులు తప్పించుకున్నారని అధికారులు తెలిపారు. జమ్మూ ప్రాంతంలోని అటవీ ప్రాంతాల్లో దాక్కున్న సుమారు మూడు డజన్ల ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు గత ఏడాది డిసెంబర్‌లో పెద్ద స్థాయిలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించామని అధికారులు చెప్పారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు శాంతియుతంగా నిర్వహించేందుకు, అలాగే పాకిస్తాన్‌కు చెందిన హ్యాండ్లర్లు మరింత మంది ఉగ్రవాదులను చొరబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న గూఢచార సమాచారం నేపథ్యంలో ఈ చర్యలను మరింత ముమ్మరం చేసినట్లు తెలిపారు.
