Let's talk: editor@tmv.in
జమ్మూలో లష్కరే నెట్‌వర్క్ బహిర్గతం

జమ్మూలో లష్కరే నెట్‌వర్క్ బహిర్గతం

Pinjari Chand
13 ఏప్రిల్, 2026

దేశవ్యాప్తంగా విస్తరించిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ)కు సంబంధించిన లాజిస్టిక్‌ నెట్‌వర్క్‌ను జమ్మూ–కాశ్మీర్‌ పోలీసులు వెలికితీశారు. నకిలీ గుర్తింపు పత్రాలు, పాస్‌పోర్టులు సమకూర్చి ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నారనే ఆరోపణలపై హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జమ్మూ–కాశ్మీర్‌ పోలీసులతో పాటు కేంద్ర గూఢచారి సంస్థలు కూడా ఈ దర్యాప్తులో భాగమయ్యాయి. ఉగ్రవాదులకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు వంటి తప్పుడు గుర్తింపు పత్రాలు తయారు చేసి అందించడం ద్వారా ఈ నెట్‌వర్క్ కీలక లాజిస్టిక్‌ మద్దతు అందించినట్టు అధికారులు వెల్లడించారు.

పాకిస్తాన్ ఉగ్రవాది పారిపోయిన ఘటన

దర్యాప్తులో భాగంగా ‘ఉమర్ అలియాస్ ఖర్గోష్’ అనే ఉగ్రవాది వివరాలు బయటపడ్డాయి. అతను పాకిస్తాన్‌లోని కరాచీకి చెందినవాడని అధికారులు తెలిపారు. 2012 తర్వాత భారత్‌లోకి చొరబడి రాజస్థాన్‌లోని జైపూర్‌ నుంచి తప్పుడు పాస్‌పోర్టు పొందినట్లు తెలిసింది. 2024లో ఆ పాస్‌పోర్టుతో దేశం విడిచి ఇండోనేషియాకు వెళ్లి, అక్కడ నుంచి మరో నకిలీ పత్రంతో గల్ఫ్ దేశానికి చేరుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

శ్రీనగర్ నివాసితుల అరెస్టు

ఈ కేసులో శ్రీనగర్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహ్మద్ నఖీబ్ భట్, ఆదిల్ రషీద్ భట్, గులాం మహ్మద్ మిర్ అలియాస్ మామా వీరు ఉగ్రవాదులకు ఆశ్రయం, ఆహారం, లాజిస్టిక్‌ సహాయం అందించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మార్చి 31న పండాచ్ ప్రాంతంలో నఖీబ్ భట్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ నెట్‌వర్క్ బయటపడింది. అతని వద్ద నుంచి పిస్టల్‌తో పాటు పలు సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. అతని విచారణ ఆధారంగా మరికొంత మందిని గుర్తించి అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో శ్రీనగర్ చుట్టుపక్కల అడవుల్లో ఉన్న అనేక ఉగ్రవాద స్థావరాలను కూడా పోలీసులు గుర్తించి ధ్వంసం చేశారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.