
జమ్మూలో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు..ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు
ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై జమ్మూ–కాశ్మీర్‌లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. ఈ చర్యను మనోజ్‌సిన్హా నేతృత్వంలోని జమ్మూ–కాశ్మీర్ యంత్రాంగం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2)(సి) ప్రకారం ఈ చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న ఉగ్రవాద సంబంధాలను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
తొలగించిన వారిలో రాంబన్ జిల్లాలో విద్యాశాఖలో క్లాస్–4 ఉద్యోగిగా పనిచేస్తున్న ఫర్హత్ అలీ ఖండే ఒకరు. అతను హిజ్బుల్ ముజాహిదీన్‌కు పనిచేస్తూ ప్రభుత్వ ఉద్యోగాన్ని ముసుగ్గా ఉపయోగించుకుంటూ ఆ ప్రాంతంలో మిలిటెంట్ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2011లో ఉగ్రవాదులకు నిధులు పంపిణీ చేసిన హవాలా నెట్‌వర్క్‌పై దర్యాప్తు సమయంలో అతని పేరు వెలుగులోకి వచ్చింది. అదే ఏడాది అతన్ని అరెస్ట్ చేసినప్పటికీ తర్వాత బెయిల్‌పై విడుదలై మళ్లీ ఉగ్రవాద నెట్‌వర్క్‌లతో సంబంధాలు కొనసాగించినట్లు విచారణలో వెల్లడైంది. 2022లో ప్రత్యేక కోర్టులో అతనిపై ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేశారు.
ఇక రెండో ఉద్యోగి బండిపోరా జిల్లాకు చెందిన మహ్మద్ షఫీ దార్. అతను గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. దార్‌కు లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మిలిటెంట్లకు ఆశ్రయం కల్పించడం, వారి కదలికలకు సహకరించడం, భద్రతా దళాల సమాచారం అందించడం వంటి కార్యకలాపాల్లో అతను భాగస్వామిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 2025 ఏప్రిల్‌లో సంయుక్త తనిఖీ సమయంలో అతన్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఏకే–56 రైఫిల్, గ్రెనేడ్‌తో పాటు ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. విచారణలో అతను భద్రతా దళాలపై దాడులకు కుట్ర పన్నినట్లు కూడా బయటపడింది.
జమ్మూ–కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి అనుబంధంగా ఉన్నారని అనుమానించిన ప్రభుత్వ ఉద్యోగులపై పెద్ద ఎత్తున చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఇలాంటి ఆరోపణలతో 90 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవస్థలో ఉగ్రవాదానికి సంబంధించిన ఏ అంశానికీ అవకాశం ఇవ్వమని, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యమని మనోజ్ సిన్హా పునరుద్ఘాటించినట్లు అధికారులు తెలిపారు.
