
జమ్మూలో ఉగ్రవాద మాడ్యూల్ బస్ట్.. పాకిస్తాన్ టెర్రరిస్ట్ అరెస్ట్
జమ్మూకాశ్మీర్‌లో పాతుకుపోయిన అంతర్రాష్ట్ర ఉగ్రవాద మాడ్యూల్‌ను పోలీసులు ఛేదించారు. పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో లష్కరే తొయిబాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేశారు. వీరిలో 16 ఏళ్లుగా పరారీలో ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాది కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అరెస్టైన వారిలో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్లా అలియాస్ అబూహురైరాతో పాటు మరో పాకిస్తానీ ఉగ్రవాది ఉస్మాన్ అలియాస్ ఖుబైబ్ ఉన్నారు. వీరిని సోమవారం నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ మార్చి 31న ప్రారంభమై, జమ్మూకాశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ పర్యవేక్షణలో కొనసాగింది. విచారణలో లష్కర్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన నిధుల సమీకరణ, ఆర్థిక లావాదేవీల విధానం వెలుగులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఉగ్రవాదులు నకిలీ పత్రాలు, తప్పుడు గుర్తింపులతో జమ్మూకాశ్మీర్ మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా తమ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడైంది. గత కొన్ని రోజులుగా శ్రీనగర్ పోలీసులు ఇతర రాష్ట్రాల పోలీసులతో పాటు కేంద్ర సంస్థల సహకారంతో జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లోని 19 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా ఆయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో మూడు ఏకే-47 రైఫిళ్లు, ఒక ఏకే-క్రింకోవ్ రైఫిల్, పిస్టళ్లు, హ్యాండ్ గ్రెనేడ్లు ఉన్నాయి. అరెస్టైన ఐదుగురిలో శ్రీనగర్‌కు చెందిన ముహమ్మద్ నఖీబ్‌భట్, ఆదిల్ రషీద్, గులాం ముహ్మద్ మిర్ అలియాస్ మామా కూడా ఉన్నారు. వీరు ఉగ్రవాదులకు ఆశ్రయం, ఆహారం, లాజిస్టిక్ సహాయం అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
నకిలీ పత్రాల స్వాధీనం
అధికారుల ప్రకారం, ఈ ఇద్దరు పాకిస్తానీ ఉగ్రవాదులు ‘ఏ+’ కేటగిరీ మిలిటెంట్లుగా గుర్తింపు పొందారు. సుమారు 16 సంవత్సరాల క్రితం భారత్‌లోకి చొరబడి కాశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో కార్యకలాపాలు కొనసాగించినట్లు తెలిపారు. ఈ కాలంలో వీరు సుమారు 40 విదేశీ ఉగ్రవాదులను నియంత్రించినట్లు సమాచారం. వీరి వద్ద నుంచి ఇతర రాష్ట్రాల చిరునామాలతో ఉన్న నకిలీ పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాల ఆధారంగా ఉగ్రవాదులు కాశ్మీర్ వెలుపల కూడా ప్రయాణించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తు కొనసాగుతుండగా, ఈ నెట్‌వర్క్‌కు సంబంధించిన సహాయకులు, నిధులు సమకూర్చిన వ్యక్తులు, ఆశ్రయ కేంద్రాలపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. ఇంతకు ముందు 2025 నవంబర్‌లో ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సటీ కేంద్రంగా పనిచేసిన ‘వైట్ కాలర్’ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను కూడా పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. ఆ కేసులో యూనివర్సిటీకి చెందిన డా. ఉమర్ బిన్ నబీ రెడ్ ఫోర్ట్ వద్ద పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడిగా గుర్తించారు.
