
జమ్మూలో ఉగ్రవాదుల ‘ఇజ్రాయెల్ గ్రూప్’ మాడ్యూల్ నిర్వీర్యం
జమ్మూ-కాశ్మీర్‌లో కిష్త్వార్ ప్రాంతంలో గత 18 నెలలుగా కొనసాగిన సంయుక్త ఆపరేషన్‌కు ముగింపు పలుకుతూ భద్రతా దళాలు జైష్-ఇ-మొహమ్మద్‌కు చెందిన ఏడుగురు సభ్యులతో కూడిన ఉగ్ర మాడ్యూల్‌ను నిర్వీర్యం చేశాయి. ఈ మాడ్యూల్‌ను ‘ఇజ్రాయెల్ గ్రూప్’గా పిలిచినట్లు అధికారులు వెల్లడించారు.
ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (జమ్మూ జోన్)భీంసేన్ టుటి , సోమవారం కిష్త్వార్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడుగురు జైష్ ఉగ్రవాదులు 2024 ఏప్రిల్‌లో భారత భూభాగంలోకి చొరబడ్డారు. అప్పటి నుంచి 17 సార్లు ఎన్‌కౌంటర్లు జరిగాయి. గత ఏడున్నర సంవత్సరాల్లో వారందరినీ నిర్వీర్యం చేశాం. ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌తో ఈ ఆపరేషన్ ముగిసిందన్నారు. ఆదివారం కిష్త్వార్ జిల్లాలోని చత్రూ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మాడ్యూల్ కమాండర్ సైఫుల్లా సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఖచ్చితమైన గూఢచారి సమాచారంతో ఈ చర్యలు చేపట్టినట్లు ఐజీపీ తెలిపారు. ఉగ్రవాద నెట్వర్క్ పూర్తిగా నిర్మూలించే వరకు ఆపరేషన్లు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. కౌంటర్ ఇన్‌సర్జెన్సీ ఫోర్స్ డెల్టా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఏపీఎస్ బల్ కూడా ఉగ్రవాదులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. దేశ శత్రువులు ఎక్కడ ఉన్నా గుర్తించి లక్ష్యంగా చేసుకుని నిర్వీర్యం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజల సహకారం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు.
పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ మధ్య సమన్వయంతో ఇంటెలిజెన్స్ ఆధారంగా ‘ఆపరేషన్ త్రాషీ-I’ పేరుతో జనవరి 14న చర్యలు ప్రారంభమయ్యాయి. జనవరి 18న ఉగ్రవాదులతో సంబంధం ఏర్పడి, వారి దాచుకున్న స్థావరాన్ని ఛేదించారు. ఫిబ్రవరి 4న ‘ఆదిల్’ కోడ్ నేమ్ కలిగిన ఉగ్రవాదిని హతమార్చారు. ఫిబ్రవరి 22న మిగిలిన ముగ్గురిని నిర్వీర్యం చేయడంతో గ్రూప్ పూర్తిగా అంతమైంది. ఎత్తైన కొండప్రాంతాలు, మంచు, వర్షం వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆపరేషన్లు నిరంతరంగా కొనసాగించారని అధికారులు తెలిపారు. డ్రోన్ పర్యవేక్షణ, నైట్ విజన్ పరికరాలు, ప్రత్యేక దళాల వేగవంతమైన మోహరింపు వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించారు. భద్రతా సిబ్బందికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. శోధనలో మూడు ఏకే-47 తుపాకులు సహా యుద్ధ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ సందర్భంగా ఆర్మీ శిక్షణ పొందిన జర్మన్ షెఫర్డ్ కుక్క ‘టైసన్’ ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడింది. దాన్ని వెంటనే వైద్య చికిత్స కోసం ఎయిర్‌లిఫ్ట్ చేయగా ప్రస్తుతం పరిస్థితి స్థిరంగా ఉందని అధికారులు తెలిపారు.
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీపీ హెచ్చరించారు. కిష్త్వార్ జిల్లాలో ప్రస్తుతం కేవలం ముగ్గురు స్థానిక ఉగ్రవాదులే ఉన్నారని, గతంలో చేరిన వారందరినీ నిర్వీర్యం చేశామని ఆయన వెల్లడించారు. ప్రజలు మా వెంట ఉన్నారు. ఎక్కువగా పౌరుల నుంచే ఇంటెలిజెన్స్ సమాచారం వస్తోంది. ఉగ్రవాదులు తమ దుష్ట ఉద్దేశాలతో ఎప్పటికీ విజయం సాధించలేరని ఐజీపీ టుటి పేర్కొన్నారు.
326 రోజులపాటు కఠిన ఆపరేషన్
కిష్త్వార్ ప్రాంతంలో 326 రోజుల పాటు ఎత్తైన పర్వత ప్రాంతాల్లో కఠినమైన సంయుక్త ఆపరేషన్లు నిర్వహించామని సైన్యం వెల్లడించింది. తీవ్రమైన చలి, మంచు, తడి వాతావరణం, క్లిష్టమైన భూభాగంలో బలగాలు అనేక సార్లు ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరిపాయని తెలిపింది. ఆపరేషన్లలో ఎఫ్‌పీవీ డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాలు, రిమోట్ పైలట్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ (ఆర్‌పీఏఎస్), యూఏవీలు వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించినట్లు సైన్యం పేర్కొంది.
