Let's talk: editor@tmv.in
జమ్మూ-కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

జమ్మూ-కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

Pinjari Chand
23 ఫిబ్రవరి, 2026

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే-ఈ-ముహమ్మద్(జేఈఎం)కు చెందిన ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు తెలిపారు. మృతుల మృతదేహాలు తీవ్రంగా కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం హతమైన వారిలో ఒకరు జేఈఎం కమాండర్ సైఫుల్లా అయ్యి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సుమారు ఐదేళ్ల క్రితం జమ్మూ కాశ్మీర్‌లోకి చొరబడి, భద్రతా బలగాలపై పలు దాడులకు మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించినట్లు సమాచారం. 2024 జూలైలో కెప్టెన్ సహా నలుగురు సైనికులు మరణించిన దాడిలో కూడా అతని పాత్ర ఉన్నట్లు చెబుతున్నారు.

‘ట్రాషీ-ఐ’ ఆపరేషన్

పస్సెర్కుట్–చత్రూ ప్రాంతంలో నిర్వహించిన ‘ట్రాషీ-ఐ’ ఆపరేషన్‌లో ఈ ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు సైన్యం తెలిపింది. ఘటన స్థలం నుంచి రెండు ఏకే–47 తుపాకులు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్ ఆర్మీ వైట్ నైట్ కార్ప్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, జమ్మూ కాశ్మీర్ పోలీసు, ఇంటెలిజెన్స్ బ్యూరో, సీఆర్‌పీఎఫ్ సహకారంతో సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఉదయం సుమారు 11 గంటలకు మట్టిగుడిసెలో దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల సమయంలో గుడిసెకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది.

ఉత్తర సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ వైట్ నైట్ కార్ప్స్ దళాలను అభినందించారు. సవాళ్లతో కూడిన భూభాగం, వాతావరణ పరిస్థితుల్లోనూ ఉగ్రవాదులను ఖచ్చితంగా మట్టుబెట్టారు. జమ్మూ కాశ్మీర్‌ను ఉగ్రరహితంగా మార్చడంలో మేం ముందుకు సాగుతున్నామని సైన్యం ఎక్స్‌లో పేర్కొంది.

ఈ ఏడాది ఆరు జేఈఎం ఉగ్రవాదుల మృతి

ఈ ఘటనతో కలిపి, ఈ ఏడాది జమ్మూ ప్రాంతంలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం ఏడుగురు జేఈఎం ఉగ్రవాదులు హతమయ్యారు. ఫిబ్రవరి 4న ఉదంపూర్ రామ్ నగర్ అడవుల్లో ఇద్దరు, జనవరి 23న కాథువా జిల్లాలోని పార్హేతర్ గ్రామంలో ఒకరు హతమయ్యారు. ఇదిలా ఉండగా, శనివారం రాత్రి సాంబా జిల్లాలో పాంగ్‌డూర్ చౌక్ వద్ద తనిఖీల్లో ఒక ట్రక్ డ్రైవర్ మొబైల్‌లో పాకిస్తాన్ నంబర్లు గుర్తించడంతో అతన్ని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.