
జమ్మూకశ్మీర్ లో ఘోర ప్రమాదం..10 మంది జవాన్లు మృతి
జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో గురువారం చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో భారత సైన్యానికి చెందిన 10 మంది జవాన్లు మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. భదర్వాహ్–చాంబా అంతర్రాష్ట్ర రహదారిపై సైన్యానికి చెందిన వాహనం లోయలోకి దూసుకుపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. సుమారు 9,000 అడుగుల ఎత్తులో ఉన్న ఖన్నీ టాప్ వద్ద మధ్యాహ్నం సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బుల్లెట్‌ప్రూఫ్ ఆర్మీ వాహనం ‘కాస్పిర్’ ఎత్తైన ప్రాంతంలోని ఫార్వర్డ్ పోస్ట్ వైపు వెళ్తుండగా, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం సుమారు 200 అడుగుల లోతైన లోయలో పడిపోయిందని అధికారులు తెలిపారు.
ప్రమాద సమాచారం అందగానే సైన్యం, పోలీసుల సంయుక్త బృందాలు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాయి. సంఘటన స్థలంలోనే నలుగురు జవాన్లు మృతి చెందినట్లు గుర్తించగా, 11 మందిని తీవ్ర గాయాలతో బయటకు తీసుకువచ్చారు. లోయలో పడిన ఆర్మీ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఆరుగురు జవాన్లు గాయాలకు తట్టుకోలేక మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 10కి చేరింది. గాయపడిన జవాన్లలో 10 మందిని ప్రత్యేక చికిత్స కోసం హెలికాప్టర్ ద్వారా ఉధంపూర్‌లోని కమాండ్ హాస్పిటల్‌కు తరలించారు. మరో ఒకరు భదర్వాహ్ ఉపజిల్లా ఆసుపత్రిలో పర్యవేక్షణలో ఉన్నారు. ఈ దురదృష్టకర ప్రమాదంలో 10 మంది సైనికులను కోల్పోయాం. మరో 11 మంది గాయపడ్డారని భదర్వాహ్ అదనపు డిప్యూటీ కమిషనర్ సుమిత్ కుమార్ భుట్యాల్ మీడియాకి తెలిపారు.
ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా మరణించిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే వేగంగా చేపట్టిన సహాయక చర్యలను ప్రశంసించారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ‘ఎక్స్’ లో స్పందిస్తూ దోడాలో జరిగిన దురదృష్టకర రోడ్డు ప్రమాదంలో మన వీర భారత సైనికులలో 10 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది. వారి అసాధారణ సేవలు, అత్యున్నత త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో దేశమంతా మృతుల కుటుంబాలతో ఐక్యతగా నిలుస్తుందని ఆయన తెలిపారు. గాయపడిన సైనికులకు అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు కూడా తెలిపారు. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఎల్జీ సిన్హా అన్నారు.
రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి
జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారత సైన్యానికి చెందిన 10 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన సైనికులకు అవసరమైన ఉత్తమ వైద్యం అందేలా అన్ని సూచనలు జారీ చేసినట్లు చెప్పారు. దోడాలో జరిగిన దురదృష్టకర రోడ్డు ప్రమాదంలో మన భారత సైన్యానికి చెందిన 10 మంది వీర జవాన్లను కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం. గాయపడిన సైనికులు వైద్యం పొందుతున్నారు. వారికి అత్యుత్తమ చికిత్స అందేలా అవసరమైన అన్ని ఆదేశాలు ఇచ్చాం. ఈ క్లిష్ట సమయంలో దేశమంతా మన సాయుధ దళాలు, వారి కుటుంబాల వెంట నిలుస్తోందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
