
జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత భూభాగమే.. ఐరాసలో పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
జమ్మూకశ్మీర్ అంశంపై పాకిస్థాన్ చేస్తున్న విష ప్రచారానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. "జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం భారత్‌లో విడదీయలేని అంతర్భాగం. ఇది గతంలోనూ భారత్‌దే, ఇప్పుడూ భారత్‌దే, భవిష్యత్తులోనూ ఎప్పటికీ భారత్‌దే ఉంటుంది" అని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ కుండబద్దలు కొట్టారు. భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు పాకిస్థాన్‌కు ఎంతమాత్రం లేదని ఆయన హెచ్చరించారు.
ఉగ్రవాదం పాక్ ప్రభుత్వ విధానమా?
భద్రతా మండలిలో సోమవారం జరిగిన చర్చలో పాక్ రాయబారి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ 'ఆపరేషన్ సింధూర్' గురించి తప్పుడు సమాచారాన్ని వినిపించగా, భారత్ దానిని తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధానంగా మార్చుకుని పాక్ పెంచి పోషిస్తోందని హరీష్ మండిపడ్డారు. "ఉగ్రవాదాన్ని 'నార్మలైజ్' చేయాలని పాక్ భావిస్తోంది, కానీ దానిని ఎన్నటికీ సహించబోం. పౌరుల రక్షణ కోసం భారత్ ఎంతటి కఠిన చర్యలకైనా వెనుకాడదు" అని ఆయన స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి వంటి వేదికను ఉగ్రవాదాన్ని సమర్థించుకోవడానికి వాడుకోవడం తగదని చురకలు అంటించారు.
పహల్గామ్ దాడికి ధీటుగా 'ఆపరేషన్ సింధూర్'
గతేడాది ఏప్రిల్‌లో పహల్గామ్‌లో 26 మంది పౌరులను బలిగొన్న ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' గురించి రాయబారి కీలక విషయాలు వెల్లడించారు. "పహల్గామ్ హంతకులను శిక్షించాలని భద్రతా మండలి పిలుపునిచ్చింది. మేము సరిగ్గా అదే పని చేశాం. ఉగ్రవాద స్థావరాలను వేటాడి నాశనం చేశాం" అని పేర్కొన్నారు. మే 9 వరకు ప్రగల్భాలు పలికిన పాక్ సైన్యం, మే 10న నేరుగా భారత సైన్యానికి ఫోన్ చేసి దాడులు ఆపమని వేడుకుందని ఆయన ఎద్దేవా చేశారు. పాక్ వైమానిక స్థావరాలు ఏ విధంగా ధ్వంసమయ్యాయో ప్రపంచం ముందే ఉన్నాయని గుర్తుచేశారు.
సింధు ఒప్పందం.. పాక్ రాజ్యాంగ సంక్షోభంపై ఎద్దేవా
65 ఏళ్ల క్రితం సుహృద్భావంతో కుదుర్చుకున్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని పాక్ ఉగ్రదాడులతో అపహాస్యం చేసిందని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ తన గడ్డపై ఉగ్రవాదాన్ని శాశ్వతంగా అరికట్టే వరకు ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు హరీష్ స్పష్టం చేశారు. అలాగే పాక్ అంతర్గత పరిస్థితులపై స్పందిస్తూ.. 27వ రాజ్యాంగ సవరణ ద్వారా సైన్యం అధికారాన్ని చేజిక్కించుకోవడం, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు జీవితకాల రక్షణ కల్పించుకోవడం పాక్ ప్రజాస్వామ్య దుస్థితికి నిదర్శనమని పర్వతనేని హరీష్ ఎద్దేవా చేశారు.
