
జమ్మూకశ్మీర్‌లో ఈడీ దాడులు
నార్కో–టెర్రర్ ఫండింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం జమ్మూ కశ్మీర్‌లో ఆరు ప్రదేశాల్లో సోదాలు జరిపింది. జమ్మూలో రెండు చోట్ల, కశ్మీర్‌లో నాలుగు చోట్ల దాడులు సాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మాజీ మంత్రి అయిన జతీందర్‌సింగ్ అలియాస్ బాబు సింగ్ నివాసం (కథువా)లో కూడా విస్తృతంగా సోదాలు నిర్వహించారు. 2022 మార్చి 30న కశ్మీర్ నుంచి జమ్మూకి రూ.6.9లక్షల హవాలా డబ్బు తీసుకువస్తూ మొహమ్మద్ షరీఫ్ షా అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ డబ్బు బాబు సింగ్‌కు ఇవ్వాలనే తీసుకొస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ నిధులు జమ్మూలో వేర్పాటువాద, విభజన వాద గ్రూపులను ప్రోత్సహించడానికే వినియోగించాలనే ప్రణాళిక ఉన్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.
తదుపరి విచారణలో సైఫుద్దీన్, ఫరూక్ అహ్మద్ నైకూ, ముబాషిర్ ముస్తాక్ ఫాఫూ తదితరులు పాక్ లో ఉండే హ్యాండ్లర్ల సాయంతో అంతర్జాతీయ మత్తు పదార్థ–టెర్రర్ నెట్‌వర్క్ నడిపిన వారిలోనూ ఉన్నారని తెలిసింది. 2021–22లో పాకిస్తాన్ నుంచి స్మగ్లింగ్ చేసిన హెరాయిన్‌ను భారత్‌లో విక్రయించి వచ్చిన డబ్బు (రూ.2కోట్లకు పైగా) శ్రీనగర్‌లోని స్థానిక ఖాతాల్లో జమ చేశారని, ఆ తర్వాత దుబాయ్‌లో ఉన్న భారతీయుల ఖాతాలకు బదిలీ చేశారని అధికారులు వివరించారు. ఆ డబ్బు చివరికి పాక్‌లో ఉన్న హిజ్ బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదుల వద్దకు చేరిందని తేలింది. మిగిలిన మనీట్రయిల్, నెట్‌వర్క్‌లో ఉన్న ఇతర వ్యక్తుల వివరాల కోసం ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.
గతంలో ఈయనపై ఉన్న కేసులు
జితేందర్ సింగ్ అలియాస్ బాబుసింగ్ అనే మాజీమంత్రి 2002–2005లో ముఫ్తీ ముహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు ఈయనను సమాచార మంత్రిగా నియమించారు. కథువా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తరువాత ఆయన నేచర్ మ్యాన్ కైండ్ ఫ్రెండ్లీ గ్లోబల్ పార్టీ అనే సొంత పార్టీని స్థాపించారు.
ఈయనపై గతంలో ఒక హవాలా / నిధుల దుర్వినియోగం కేసులో ఆరోపణలు ఉన్నాయి. 2022లో సుమారు రూ. 6.9 లక్షల హవాలా నిధులను ఆయనకు చెందినవిగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అలాగే, స్టేట్ ఇన్వేష్టిగేషన్ ఏజెన్సీ(ఎస్ఐఏ)ఆయనను, ఆయన పార్టీ, ఇతరులతో కలిసి ‘టెర్రర్ ఫండింగ్’ కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది.
