Let's talk: editor@tmv.in
జాబ్ క్యాలెండర్ అమలు చేయలేకపోయాం: ఎమ్మెల్యే రాజగోపాల్

జాబ్ క్యాలెండర్ అమలు చేయలేకపోయాం: ఎమ్మెల్యే రాజగోపాల్

Gaddamidi Naveen
18 సెప్టెంబర్, 2025

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం యువతకు ఉద్యోగ అవకాశాలు భర్తీ చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గన్పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి ఎమ్మెల్యే నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ను అమలు చేయలేకపోయామని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగులు పోషించిన పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ప్రభుత్వానికి, నిరుద్యోగులకు మధ్య వారధిగా తాను పని చేస్తానని రాజగోపాల్రెడ్డి చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయాలని నిరుద్యోగ యువత చేస్తున్న డిమాండ్ సరైనదేనని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నిరుద్యోగులు అధైర్య పడొద్దని, నిరసనలు, ధర్నాలు మానువాలని, సమస్యలు వినడానికి అవసరమైతే అశోక్ నగర్ చౌరస్తాకు, సెంట్రల్ లైబ్రరీకి, దిల్సుఖ్నగర్కి వస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తానని వివరించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ కూడా వేయలేకపోయారన్నారు. బీఆర్ఎస్ హయాంలో కుటుంబపాలనతో భారీగా అవినీతికి పాల్పడ్డారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దోచుకున్నారని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదన్నారు. గ్రూప్-1 పై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వంతో చర్చిస్తానన్నారు. మాజీ సీఎం కేసీఆర్ను గద్దె దించడంలో యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు. అమరవీరుల సాక్షిగా నిరుద్యోగులకు అండగా ఉంటానని తెలిపారు. నిరుద్యోగుల నిరసనలకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. సోనియాగాంధీ కలలు కన్న తెలంగాణ రాష్ట్రం గత పదేళ్ల కాలంలో సాకారం కాలేదని, రాబోయే రోజుల్లో అందరికీ ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు.

జాబ్ క్యాలెండర్ అమలు చేయలేకపోయాం: ఎమ్మెల్యే రాజగోపాల్ - Tholi Paluku