Let's talk: editor@tmv.in
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీత

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీత

T Venkata Ramana
20 సెప్టెంబర్, 2025

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠకు తెరపడింది. ఈ ఉపఎన్నికలో మాగంటి గోపీనాథ్‌ సతీమణి సునీతను అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్‌ క్యాడర్‌తో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థి ఎంపికను వెల్లడించారు. కేటీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఒక తీరుగా తీర్పు ఇచ్చినా హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ను గుండెల్లో పెట్టుకున్నారన్నారు. హైదరాబాద్‌ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దిన బీఆర్‌ఎస్‌ను అన్ని స్థానాల్లో గెలిపించారని చెప్పారు.

ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపీనాథ్‌ను మూడోసారి గెలిపించినట్లు తెలిపారు. ఆయన సేవలను కొనసాగించేందుకు సునీత బరిలోకి దిగుతున్నారని ఆమెను అందరూ ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని కేటీఆర్‌ కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు సునీత కట్టుబడి ఉన్నారని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బలాన్ని చాటాలని, హైదరాబాద్‌లో పార్టీ ఆధిపత్యాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎవరన్నదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సెంటిమెంట్ కలిసివస్తుందని బీఆర్ఎస్ బలంగా నమ్ముతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. అక్కడ బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని భావిస్తోంది. దీంతో పోటీ రసవత్తరంగా మారనున్నది.

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీత - Tholi Paluku