Let's talk: editor@tmv.in
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కవిత ఎంట్రీ?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కవిత ఎంట్రీ?

Aravind Maryada Reddy
16 సెప్టెంబర్, 2025

హైదరాబాద్లోని కీలకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల వేడితో రగులుతోంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. అయితే ఈ త్రిముఖ పోరులో కొత్తగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రంగంలోకి దిగుతుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఆమె ప్రత్యేకంగా ఈ ఎన్నికలపై దృష్టి సారించడం, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తో సమావేశం కావడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది.

సిట్టింగ్ స్థానం కోసం

జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై బీఆర్ఎస్ పార్టీ తమ ప్రాబల్యాన్ని నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ ఉప ఎన్నికల ఫలితం కేవలం జూబ్లీహిల్స్కే పరిమితం కాకుండా త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుందని ఆ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ నేతలతోనూ ముఖ్యంగా బూత్ కమిటీలతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం, ఎన్నికల కార్యాచరణను పర్యవేక్షించడం ఆయన ముఖ్య ఉద్దేశ్యం.

ప్రస్తుతం దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీతకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది నియోజకవర్గంలో సానుభూతిని కూడగట్టడానికి ఉపయోగపడుతుందని పార్టీ భావిస్తోంది. అయితే ఈ నిర్ణయం తీసుకునే ముందు పార్టీ అన్ని కోణాల నుండి విశ్లేషిస్తోంది.

అభ్యర్థుల వేటలో కాంగ్రెస్, బీజేపీ

జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై కాంగ్రెస్ కూడా గట్టి పట్టుదల చూపతోంది. గతంలో ఈ నియోజకవర్గాన్ని పీజేఆర్ కుటుంబం పలుమార్లు గెలుచుకుంది. ఈ చరిత్రను పునరావృతం చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే పార్టీలో బలమైన గెలుపు గుర్రం ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో కాంగ్రెస్ నాయకులు అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యారు. బలమైన అభ్యర్థిని నిలబెట్టి బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇవ్వాలని ఆ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు, బీజేపీ కూడా ఈ ఉప ఎన్నికలో తమ ఉనికిని చాటుకోవాలని చూస్తోంది. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో బీజేపీ ఓట్లు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే వచ్చాయి. ఈసారి విజయం లక్ష్యంగా కాకుండా ఓటు బ్యాంకును పెంచుకోవడమే ధ్యేయంగా బీజేపీ ముందుకు సాగుతోంది. వారు రహస్యంగా డివిజన్ల వారీగా దృష్టి సారించి తమ ఓటర్లను సమీకరించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

కవిత ఎంట్రీ

ఈ త్రిముఖ పోరులో అనూహ్యంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తో ప్రత్యేకంగా భేటీ కావడం అనేక సందేహాలకు తావిస్తోంది. సునీతకు టికెట్ ఇస్తే, బీఆర్ఎస్లో టికెట్ ఆశించి భంగపడిన విష్ణువర్ధన్ రెడ్డిని తన సంస్థ తరపున బరిలోకి దించాలని కవిత ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కవితతో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ తనయుడు పి. విష్ణువర్ధన్ రెడ్డి సోమవారం ప్రత్యేకంగా కవితతో సమావేశం అయ్యారు. బీఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే మాగంటి సతీమణి సునీతకు టికెట్ ఇస్తుందన్న ప్రచారం నేపథ్యంలో వీరి భేటీ కీలకంగా మారింది. గతంలో కాంగ్రెస్ నుంచి టీకెట్ ఆశించిన విష్ణువర్ధన్ రెడ్దికి టికెట్ కేటాయించకపోవడంతో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. గత ఎన్నికల్లో మాగంటి గెలుపునకు కృషి చేశాడు. ఇటీవల మాగంటి మరణంతో ఆయన సతీమణి ఎన్నికల్లో పోటీ చేయకపోతే విష్ణుకే టికెట్ అన్న ప్రచారం సాగింది. అయితే ఇపుడు సునీత బరిలో ఉంటున్న నేపథ్యంలో ఆయన కవితతో బేటీ కావడం సంచలనంగా మారింది. ఇటీవలె జరిగిన జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలోనూ పాల్గొన్న ఆయన ఒకసారిగా ఆయన కవిత వైపు తిరగడం కలకలం రేపింది. కవితతో అరగంటకు పైగా మంతనాలు సాగించిన విష్ణు ఎన్నికల బరిలో ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే ఉప ఎన్నికల్లో విష్ణువర్ధన్ రెడ్డిని పోటీకి దించే యోచనలో కవిత ఉన్నట్లు తెలుస్తోంది.

పార్టీ పెట్టకుండానే పోటీ చేయవచ్చా?

ఎన్నికల నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీగా రిజిస్టర్ కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా లేక ఏదైనా ఇతర రిజిస్టర్డ్ సంస్థ పేరుతో పోటీ చేయడం సాధ్యం కాదు. కవిత కానీ, విష్ణువర్ధన్ రెడ్డి కానీ తమ సొంత పేరుపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయవచ్చు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం స్వతంత్ర అభ్యర్థికి కేటాయించబడిన గుర్తులను వారు ఎంచుకోవాలి. సాధారణంగా కేంద్ర ఎన్నికల కమిషన్ లో నమోదు చేసుకున్న రాజకీయ పార్టీ మాత్రమే తన గుర్తుపై అభ్యర్థులను నిలబెట్టగలదు. కవిత స్థాపించిన తెలంగాణ జాగృతి ఒక రిజిస్టర్డ్ సంస్థ అయినా అది రాజకీయ పార్టీగా నమోదు కాలేదు. కాబట్టి ఆ సంస్థ పేరుపై , గుర్తుపై అభ్యర్థులను నిలబెట్టే అవకాశం లేదు. ఒకవేళ కవిత కొత్త పార్టీని పెట్టినప్పటికీ అది ఎన్నికలకు ముందు రిజిస్టర్ అయితేనే ఆ పార్టీ గుర్తుపై పోటీ చేయగలరు. అయితే ఉప ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో ఈ ప్రక్రియ సాధ్యపడకపోవచ్చు.

ఈ నేపథ్యంలో కవిత,విష్ణువర్ధన్ రెడ్డి భేటీ కేవలం భవిష్యత్ రాజకీయాల కోసమేనా లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే వ్యూహంపైనేనా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం విష్ణువర్ధన్ రెడ్డిని బరిలోకి దించి బీఆర్ఎస్కు గట్టి షాక్ ఇవ్వాలని కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ పరిణామం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను మరింత రసవత్తరంగా మార్చనుంది.

ఈ ఉప ఎన్నికల ఫలితాలు కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికే పరిమితం కాకుండా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దిశను నిర్ణయించే అవకాశం ఉంది. మరి ఈ కీలక పోరులో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కవిత ఎంట్రీ? - Tholi Paluku