
జూబ్లీహిల్స్‌లో గెలుపు కోసం బీఆర్ఎస్ పోరాటం
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలనే లక్ష్యంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఎర్రగడ్డ డివిజన్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తూనే కాంగ్రెస్ పాలనపై, హామీల అమలుపై ప్రశ్నల వర్షం కురిపించారు.
వ్యూహాత్మక ప్రచారం
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజయం సాధించాలని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగానే కేటీఆర్ రోజువారీగా ఒక డివిజన్ సమావేశంలో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రసంగాలు చేస్తున్నారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం జరిగిన ఎర్రగడ్డ డివిజన్ సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. మన దగ్గర రేవంత్ రెడ్డి హైస్కూల్ చదువుకున్నాడని, పిల్లగాడు సరిగా చదవడం లేదని ఫెయిల్ అయితే కేసీఆర్ పంపించేశాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించారు. మోడీ, చంద్రబాబు దగ్గర స్కూల్‌కు, కాలేజీకి వెళ్లి, ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూనే ఆ స్కూల్ లో రేవంత్ ఎక్కడ చదువుకున్నారో గుర్తుంచుకోవాలని చురకలంటించారు.
గుండెల్లో పెట్టుకున్నారు
రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టినా హైదరాబాద్ ప్రజలు మాత్రం బీఆర్ఎస్‌ను గుండెల్లో పెట్టుకున్నారని కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చిన బీఆర్ఎస్‌కు అన్ని స్థానాల్లో విజయం కట్టబెట్టారని కొనియాడారు. ఎంత దుష్ప్రచారం చేసినా మూడోసారి మాగంటి గోపీనాథ్‌ను గెలిపించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ స్థానం నుంచి ఆయన సతీమణి మాగంటి సునీతమ్మ మీ ముందుకు వచ్చారని, ఆమెను ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నేతల లూటీ
కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించింది. కళ్యాణలక్ష్మి కింద కేసీఆర్ కేవలం లక్ష రూపాయలు ఇస్తున్నారని తాము అధికారంలోకి వస్తే తులం బంగారం కూడా ఇస్తామని అబద్ధపు మాటలు చెప్పారని విమర్శించారు. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు కానీ స్కూటీలు లేవని, కేవలం కాంగ్రెస్ నేతల లూటీ మాత్రమే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
పేదలపై హైడ్రా దాడి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం పేరుతో ఇళ్లు కూల్చి వేస్తోందని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూలగొట్టడమే. హైదరాబాద్ బస్తీల్లో పేద ప్రజలు తమ ఇళ్లు ఎప్పుడు కూలిపోతాయోనని భయంతో బతుకుతున్నారు. కూకట్‌పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ తన ఇల్లు కూల్చివేస్తారన్న భయంతోనే ఆత్మహత్య చేసుకుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో పేదల ఇళ్లను కూల్చివేయలేదని, లక్ష మందికి ఇళ్ల పట్టాలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువులో ఇల్లు కడితే కొడంగల్‌లో రేవంత్ రెడ్డి సొంత ఇల్లు రెడ్ల కుంటలో ఉన్నా బుల్డోజర్లు వారి జోలికి పోవని ఎద్దేవా చేశారు. పేదల పొట్ట కొడుతున్న ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతమ్మను గెలిపించే బాధ్యత కార్యకర్తలపై ఉందని కేటీఆర్ అన్నారు. కేసులకు భయపడితే లీడర్లు కాలేరని, న్యాయం కోసం, ధర్మం కోసం పోరాడాలన్నారు కేటీఆర్. 420 హామీల అమలు ఎప్పుడు? అని కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ముస్లిం మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కూడా లేరని, అమీర్ అలీ, అజారుద్దీన్‌లకు టిక్కెట్లు ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శించారు.
