Let's talk: editor@tmv.in
జూబిన్ గార్గ్.. ఓ సంగీత సముద్రం

జూబిన్ గార్గ్.. ఓ సంగీత సముద్రం

FL - BHAVN
27 సెప్టెంబర్, 2025

ఒక కళాకారుడి మరణం లక్షల హృదయాలను శోకంలో ముంచిపోయింది. అతని అంతిమ యాత్ర లో పాల్గోనేందుకు, కడసారి తమ అభిమాన కళాకారుడిని చూసి వెళ్లేందుకు గౌహతి జనసంద్రమైంది. లక్షలాదిగా అతడికి వీడ్కోలు చెప్పేందుకు గౌహతి చేరుకున్నారు. ఇంత మంది అభిమానులను సంపాధించుకున్న ఆ కళాకారుడు మరెవరో కాదు జుబిన్ గార్గ్. విలక్షణమైన ఆయన గాత్రం సంగీత ప్రియుల మనసుకు చిక్కుకునే ఒక గాలం. ఒకసారి ఆ గాలానికి చిక్కితే ఇక అదొక పాటల వేట అంతే.

ఎవరీ జూబిన్?

అస్సామీ సంగీతానికి కొత్త ఊపిరులు పోసి, ఆధునికత జోడించి, యువ హృదయాలను కొల్లగొట్టిన అమర గాయకుడు జుబిన్ గార్గ్. కేవలం అస్సామీ, ఈశాన్య భారత శ్రోతలను మాత్రమే కాదు ఆయన తన గాత్రంతో దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా అభిమానులను సంపాధించుకున్నారు. కేవలం అభిమానం మాత్రమే అంటే అది తగ్గించి చెప్పడమే. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆయన కేవలం గాయకుడు మాత్రమే కాదు స్వరకర్త, గేయ రచయిత, నటుడు, దర్శకుడు కూడా. కేవలం కళాకారుడని మాత్రమే చెప్పలేము ఆయన అస్సామీ సంస్కృతి, చరిత్ర, సామాజిక అంశాలకు అద్దం పట్టే బలమైన స్వరం.

నవంబర్ 18, 1972 న అస్సాంలోని జోర్హాట్ లో జూబిన్ జన్మించారు. ఆయన తండ్రి మోహిని మోహన్ బోర్తకూర్ రచయిత, తల్లి ఇలీ బర్తకూర్ గాయని. జూబిన్ చిన్నతనం నుంచే సంగీత వాతావరణం లో పెరిగారు. కళాకారుల కుటుంబంలో జన్మించినందుకేమో సంగీత, సాహిత్యాలు చాలా సులభంగా చేతికి చిక్కాయి. బాల్యం నుంచే తబలా, ఢోల్, మాండలిన్ వంటి వాయిద్యాలను నేర్చుకున్నారు. 1992 లో తన తొలి అస్సామీ ఆల్బం అనామిక తో సంగీత విపణిలోకి అడుగుపెట్టారు. ఇదో గొప్ప హిట్ ఆరోజుల్లో. ఆయన కొత్త శైలి యువతను విపరీతంగా ఆకట్టుకుంది. రాత్రికి రాత్రే ఆయన స్టార్ గా మారిపోయారు. ఇక ఆయనకు తర్వాత తిరగి చూడాల్సిన అవసరం కలుగలేదు. పాటలు రాస్తూ, స్వరాలు కూరుస్తూ, పాటలు పాడుతూ అస్సామీ సంగీతానికి కొత్త శకాన్ని ఆరంభించారు.

ప్రత్యేకం ఆ.. శైలి!

జానపద, శాస్త్రీయ, పాప్, రాక్ వంటి వివిధ రకాల సంగీత విధానాలను తన స్వరాల్లో మిళితం చేసి ఆయన చేసే ఫ్యూజన్ మనోరంజకం. ఆయన పాటలో భావోద్వేగం, తాత్వికత, సామాజిక స్పృహ ఆలోచింప జేసే ఆయన సంగీతాన్ని ఆదరించకుండా ఉండలేరు. విరహ, విశాద గీతాలు ఎన్నో పెద్ద హిట్ లుగా నిలిచాయి. అంతేకాదు అస్సామీ ప్రజల ఆకాంక్షలకు, సమాజిక అసమానతలకు ఆయనొక కొత్త గొంతుకను ఇచ్చారని చెప్పవచ్చు. యా అస్సాం వంటి దేశ భక్తి గీతాలు, నయనతార వంటి ప్రేమ గీతాలు చాలా ప్రాచూర్యంలో ఉన్నాయి.

కేవలం అస్సామీ, బెంగాలీ పాటలు మాత్రమే కాదు బాలీవుడ్ లోనూ ఆయన తనదైన పేజీని రచించుకున్నారు. గ్యాంగ్ స్టర్ లోని ‘‘యా ఆలీ’’ పాటతో సంగీత ప్రియుల్ని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నారు. ఈ పాటతో ఆయన ఎన్నో అవార్డులు కూడా గెలుచుకున్నారు. ఆయన గళంలోని ప్రత్యేకత సూఫీ సంగీతానికి కొత్త సొబగులు అద్దింది. మిషన్ చైనా అనే అస్సామీ సినిమాకు కూడా ఆయన దర్శకత్వం వహించారు. ఇది అస్సామీ సీని చరిత్రను తిరగరాసిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర కూడా పోషించారు. గానేకీ ఆనే, ప్రతిధాన వంటి చిత్రాలకు సంగీతం అందించారు. ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు.

సామాజిక క్రియాశీలత

జూబిన్ గార్గ్ కేవలం కళాకారుడు మాత్రమే అనుకుంటే పొరపాటే. ఆయన సామాజిక కార్యకర్త, అస్సామీ ప్రజల హక్కులు, సంస్కృతి పరిరక్షణ కోసం నిరంతరం ఆరాటపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ఆయన చాలా చురుగ్గా పనిచేశారు. తన పాటలు, ప్రసంగాల్లో అనేక సామాజిక, రాజకీయ అంశాల మీద తన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేస్తారు. ఆయన ధైర్యం, నిబద్ధతతో అస్సామీ ప్రజల్లో స్పూర్తిని రగిల్చారు.

జుబిన్ గార్గ్ అస్సామీ ప్రజల ఆకాంక్షల దిక్సూచి, ఆయన తన కళతో ఒక తరాన్ని ప్రభావితం చేశారు. జూబిన్ కేవలం గాయకుడు మాత్రమే కాదు ఒక తిరుగులేని స్వరం, అస్సామీ ప్రజల ఆత్మ. ఆయన సంగీతం అస్సామీ సంస్కృతికి అమూల్య వారసత్వం. సంగీత ప్రపంచానికి మరో దృవతార వంటి జూబిన్ ప్రమాద వశాత్తు సింగపూర్ లో ఇటీవలే మరణించారు. ఆయన మరణం అస్సాం ప్రజలను, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అబిమానులను తీరని దు:ఖంలో పడదోసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ..

కొందరి గళాలు.. తరాలు మారినా.. నిత్యం స్వర సంచలనం చేస్తూనే ఉంటాయి. ఎల్లలు లేని గురుతులను పేర్చుకుంటూ అంతకంతకు సంగీత ప్రయాణం చేస్తూనే ఉంటాయి. ఈసాన్యపు వర్షపు జల్లులు సాక్షిగా ఎదిగిన ఆ స్వరం అనుకోకుండా మూగబోయినా.. వాస్తవిక ప్రయాణంలో ఆ గొంతు ఎప్పటికీ సజీవం. అవును, జాబిన్ గార్గ్ మన మధ్యే ఉన్నాడు. పాటతో అంతో ఇంతో చెలిమిగలవాళ్ళందరి గుండెల్లో నిలిచే ఉన్నాడు.

జూబిన్ గార్గ్.. ఓ సంగీత సముద్రం - Tholi Paluku