Let's talk: editor@tmv.in
జపాన్ సైనిక వినియోగ వస్తువుల ఎగుమతిపై చైనా నిషేధం

జపాన్ సైనిక వినియోగ వస్తువుల ఎగుమతిపై చైనా నిషేధం

Shaik Mohammad Shaffee
8 జనవరి, 2026

చైనా, జపాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. తైవాన్ భద్రత విషయంలో జపాన్ ప్రధాని సనాయే తకైచి చేసిన వ్యాఖ్యలపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ప్రతీకారంగా జపాన్‌కు ఎగుమతి చేసే 'ద్వంద్వ వినియోగ' (డ్యూయల్-యూజ్) వస్తువులపై చైనా తక్షణమే నిషేధం విధించింది. అంటే.. సాధారణ అవసరాలతో పాటు యుద్ధ రంగంలో కూడా ఉపయోగపడే వస్తువుల సరఫరాను నిలిపివేసింది. చైనా తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం జపాన్ రక్షణ రంగానికి పెద్ద దెబ్బగా మారనుంది.

ఏమిటీ 'ద్వంద్వ వినియోగ' వస్తువులు?

సాధారణంగా కొన్ని వస్తువులను పౌర అవసరాలకు (సివిల్), యుద్ధ అవసరాలకు (మిలిటరీ) రెండింటికీ వాడవచ్చు. వీటినే 'ద్వంద్వ వినియోగ' వస్తువులు అంటారు. ఉదాహరణకు డ్రోన్లలో వాడే సాఫ్ట్‌వేర్, కంప్యూటర్ చిప్స్, కొన్ని రకాల ఖనిజాలు (రేర్ ఎర్త్ ఎలిమెంట్స్). ఇవి ఫోన్లు, కార్ల తయారీకి ఉపయోగపడటమే కాకుండా క్షిపణులు, యుద్ధ విమానాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు చైనా జపాన్ సైన్యానికి ఉపయోగపడే ఇటువంటి వస్తువుల సరఫరాను పూర్తిగా నిలిపివేసింది.

వివాదానికి అసలు కారణం ఏమిటి?

జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచి గత నవంబర్‌లో తైవాన్ గురించి చేసిన వ్యాఖ్యలే ఈ గొడవకు ప్రధాన కారణం. "ఒకవేళ చైనా గనుక తైవాన్‌పై దాడికి దిగితే, అది జపాన్ ఉనికికే పెద్ద ప్రమాదం" అని ఆమె హెచ్చరించారు. అయితే, తైవాన్‌ను తమ సొంత ఆస్తిగా భావించే చైనాకు ఈ మాటలు అస్సలు నచ్చలేదు. తమ దేశ అంతర్గత విషయాల్లో జపాన్ ఎందుకు తలదూరుస్తోందని చైనా మండిపడింది. ఈ మాటల యుద్ధం కాస్తా ఇప్పుడు ముదిరి, జపాన్‌కు వస్తువుల సరఫరా నిలిపివేసే వరకు వెళ్లింది.

మరోవైపు, జపాన్ తన రక్షణ రంగం కోసం గతంలో ఎన్నడూ లేనంతగా భారీగా ఖర్చు చేస్తోంది. వచ్చే ఏడాది కోసం ఏకంగా 9 ట్రిలియన్ యెన్‌ల (దాదాపు 58 బిలియన్ డాలర్లు) బడ్జెట్‌ను కేటాయించింది. జపాన్ ఇలా తన సైనిక బలాన్ని పెంచుకోవడం చైనాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జపాన్ శాంతి మార్గాన్ని వదిలి యుద్ధం వైపు అడుగులు వేస్తోందని, వారి భద్రతా విధానాల్లో వస్తున్న ఈ మార్పులు ఆందోళనకరమని చైనా ప్రభుత్వ మీడియా విమర్శిస్తోంది.

జపాన్ ఘాటు స్పందన

చైనా తీసుకున్న ఈ నిర్ణయంపై జపాన్ ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. ఇది "అస్సలు ఆమోదయోగ్యం కాని చర్య" అని, అంతర్జాతీయ నిబంధనలకు ఇది పూర్తిగా విరుద్ధమని జపాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. చైనా వెంటనే ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని జపాన్ డిమాండ్ చేసింది. జపాన్ తన రక్షణ బడ్జెట్‌ను పెంచుకుంటూ సైన్యాన్ని బలోపేతం చేసుకోవడం చైనాకు నచ్చడం లేదని, అందుకే ఇలా ఎగుమతులను అడ్డుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తోందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఏ వస్తువుల మీద నిషేధం?

చైనా ఏ ఏ వస్తువులను ఆపేస్తుందో అధికారికంగా పేర్లను బయటపెట్టలేదు కానీ, సుమారు 1,100 రకాల వస్తువులపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా డ్రోన్లు, కంప్యూటర్ చిప్స్‌ తయారీలో వాడే సామారియం, గాడోలినియం వంటి అరుదైన ఖనిజాల ఎగుమతులను చైనా నియంత్రించవచ్చు. జపాన్ తన పరిశ్రమలకు అవసరమైన ఇటువంటి ఖనిజాల కోసం ఇప్పటికీ 60 శాతం వరకు చైనా మీదనే ఆధారపడుతోంది.

జపాన్ కంపెనీల ఆందోళన

ఒకవేళ చైనా గనుక ఈ నిషేధాన్ని కఠినతరం చేస్తే, జపాన్‌లోని కార్ల తయారీ, ఎలక్ట్రానిక్స్ రంగాలు కుప్పకూలే ప్రమాదం ఉంది. దాదాపు పదేళ్ల క్రితం కూడా ఇలాంటి గొడవ వచ్చినప్పుడు చైనా ఇలాగే ఎగుమతులను ఆపేసింది. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి వస్తుందేమోనని జపాన్ కంపెనీలు భయం భయంగా ఉన్నాయి. ఈ వివాదం గనుక ముదిరితే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగే అవకాశం కూడా ఉంది.