Let's talk: editor@tmv.in
జపాన్ మాస్టర్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు లక్ష్యసేన్

జపాన్ మాస్టర్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు లక్ష్యసేన్

Shaik Mohammad Shaffee
14 నవంబర్, 2025

జపాన్‌లో జరుగుతున్న కుమమోటో మాస్టర్స్ 2025 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారతీయ స్టార్ షట్లర్ లక్ష్యసేన్ అద్భుత ప్రదర్శన కనబరిచి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. అయితే మరో అగ్రశ్రేణి భారత ఆటగాడు హెచ్.ఎస్. ప్రణయ్ మాత్రం రెండో రౌండ్‌లోనే ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానంలో ఉన్న లక్ష్యసేన్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో సింగపూర్‌కు చెందిన జియా హెంగ్ జాసన్ తెహ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. 2021 ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత అయిన లక్ష్యసేన్, ప్రపంచ నంబర్ 20 ఆటగాడు తెహ్‌పై కేవలం 39 నిమిషాల్లోనే విజయం సాధించాడు. ఈ పోరులో లక్ష్యసేన్ వరుస గేముల్లో 21-13, 21-11 తేడాతో సునాయాసంగా గెలుపొందాడు. లక్ష్య ఇక్కడ ఏడో సీడ్‌గా బరిలోకి దిగాడు.

మొదటి గేమ్‌లో లక్ష్యసేన్ 8-5 ఆధిక్యాన్ని సాధించినా, తెహ్ తాత్కాలికంగా 10-9తో ముందుకు వెళ్లాడు. అయితే, విరామం తర్వాత లక్ష్యసేన్ దూకుడు పెంచి 14-13 వద్ద వరుసగా ఏడు పాయింట్లు సాధించి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో లక్ష్యసేన్ మరింత పటిష్టంగా కనిపించాడు. 5-0తో, ఆ తర్వాత 11-3తో విరామం వద్ద భారీ ఆధిక్యాన్ని సాధించి, ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్స్‌లో సింగపూర్‌కు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ లో కీన్ యూ తో తలపడనున్నాడు.

ప్రణయ్‌కు నిరాశ

మరోవైపు, భారత్ తరఫున ఆడుతున్న 33 ఏళ్ల హెచ్.ఎస్. ప్రణయ్ రెండో రౌండ్‌లో ఓటమి పాలయ్యాడు. ప్రణయ్ 46 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో డెన్మార్క్‌కు చెందిన రాస్మస్ గెమ్కే చేతిలో పరాజయం పాలయ్యాడు. ప్రణయ్ 18-21, 15-21 తేడాతో వరుస గేముల్లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. దీంతో ఈ టోర్నమెంట్‌లో భారత్ ఆశలన్నీ ఇప్పుడు యువ షట్లర్ లక్ష్యసేన్‌పైనే ఉన్నాయి.

జపాన్ మాస్టర్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు లక్ష్యసేన్ - Tholi Paluku