
జపాన్ ప్రధాని తకైచి కీలక నిర్ణయం.. కేబినెట్‌లో జీతం కోతలు!
జపాన్ ప్రధాన మంత్రి సనే తకైచి తనకు, తన మంత్రివర్గ సభ్యులకు వేతన కోతలను అమలు చేయడానికి ప్రజా సేవకుల వేతన చట్టంలో సవరణ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుత పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ఈ సవరణను ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయని ది జపాన్ టైమ్స్ నివేదించింది.
ది జపాన్ టైమ్స్ ప్రకారం, ఈ ప్రతిపాదనపై వచ్చే మంగళవారం మంత్రుల సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రధాన మంత్రి, మంత్రులకు పార్లమెంట్ సభ్యుల జీతానికి అదనంగా చెల్లించే ప్రత్యేక భత్యాలను తాత్కాలికంగా నిలిపివేయడం ఈ ప్రతిపాదనలో ఉంది.
మంత్రుల వేతనాలను తగ్గించాలని తకైచి చాలా కాలంగా కోరుతూ వస్తున్నారు. ఆమె అక్టోబరులో జరిగిన తన తొలి మీడియా సమావేశంలో “మంత్రులు పార్లమెంట్ సభ్యుల వేతనాన్ని మించకుండా ఉండేందుకు చట్ట సవరణపై పనిచేస్తాను” అని తెలిపారు.
ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులకు నెలకు 1.294 మిలియన్ జపనీస్ యెన్ల వేతనం చెల్లిస్తున్నారు. అదనంగా ప్రధాన మంత్రి 1.152 మిలియన్ జపనీస్ యెన్లు, మంత్రులు 489,000 జపనీస్ యెన్ల వేతనం పొందుతున్నారు. అయితే ఖర్చు తగ్గింపు చర్యలలో భాగంగా ప్రస్తుతం ప్రధాన మంత్రి తన అదనపు వేతనంలో 30 శాతం, మంత్రులు 20 శాతం తిరిగి చెల్లిస్తున్నారు. దాంతో ప్రధాన మంత్రి, మంత్రుల వేతనాలు వరుసగా సుమారు 390,000 జపనీస్ యెన్లు, 110,000 జపనీస్ యెన్లకు తగ్గుతున్నాయని జపాన్ ముఖ్య క్యాబినెట్ కార్యదర్శి మినోరు కిహారా తెలిపారు.
ఈ జీతాల కోత ప్రణాళికకు సంకీర్ణ భాగస్వామి అయిన లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన జపాన్ ఇన్నోవేషన్ పార్టీ (జేఐపీ) మద్దతు తెలిపింది. జేఐపీ నాయకుడు ఫుమితాకే ఫుజిటా దీనిని అద్భుతమైన చొరవగా అభివర్ణించారు. అయితే ఈ ప్రతిపాదనపై ప్రతిపక్షం నుంచి విమర్శలు గుప్పించింది. డెమోక్రాటిక్ పార్టీ ఫర్ ది పీపుల్ నాయకుడు యుచిరో తమాకి దీన్ని “ద్రవ్యపు క్షీణత దృక్పథానికి ప్రతీక”గా అభివర్ణించారు. ప్రభుత్వం గృహ ఆదాయాలను పెంచే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ నిర్ణయం సరైనదా అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు ఈ ప్రతిపాదనపై “నాకు మిశ్రమ భావనలు ఉన్నాయి” అని ఒక ప్రస్తుత కేబినెట్ మంత్రి పేర్కొనగా, ఈ నిర్ణయంపై ప్రభుత్వం లోపల రాజకీయ, ఆర్థిక ప్రభావాలపై విభేదాలు స్పష్టమయ్యాయని ది జపాన్ టైమ్స్ నివేదించింది.
జపాన్ ప్రధాని సనే తకైచి జీతాల కోత విధించడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ప్రభుత్వ ఖర్చు తగ్గించి, ప్రజలకు ఆదర్శంగా నిలవడం. ఈ చర్య వల్ల ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. ప్రభుత్వం సంస్కరణల దిశగా కదులుతోందని భావన వస్తుంది. అయితే ఈ చర్య వల్ల ఆర్థికంగా పెద్ద ప్రభావం ఉండదు. ఇది ప్రధానంగా ప్రతీకాత్మక చర్య మాత్రమే. మొత్తం మీద రాజకీయంగా ఇది మంచి నిర్ణయమే కానీ ఆర్థికంగా ప్రభావం పరిమితమే.
