
జపాన్ ప్రధానిగా మళ్లీ ‘సనే తకైచి’ ఎన్నిక
జపాన్ రాజకీయాల్లో సనే తకైచి ద్వితీయ ప్రస్థానం అధికారికంగా ప్రారంభమైంది. బుధవారం జపాన్ పార్లమెంట్ ఆమెను రెండోసారి దేశ ప్రధానమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. గత వారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డిపి) చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేయడంతో, ఆమె నేతృత్వంలోని కొత్త కేబినెట్ కొలువుదీరింది. దిగువ సభలో లభించిన మూడింట రెండొంతుల ‘సూపర్ మెజారిటీ’ని ఆసరాగా చేసుకుని, దేశ విధానాలను మితవాద దిశగా మళ్లించేందుకు తకైచి సిద్ధమయ్యారు.
తిరుగులేని ఆధిక్యం.. పాత కేబినెట్‌కే పట్టం
దిగువ సభలోని 465 స్థానాల్లో ఎల్‌డిపి నేతృత్వంలోని కూటమి అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడంతో తకైచి బలం రెట్టింపైంది. ఈ విజయం తర్వాత జరిగిన నామమాత్రపు లాంఛనాల్లో ఆమెను ప్రధానిగా పార్లమెంట్ ధ్రువీకరించింది. పాలనలో కొనసాగింపు కోసం తన పాత మంత్రివర్గాన్నే ఆమె యథాతథంగా కొనసాగిస్తారని సమాచారం. ఈ సూపర్ మెజారిటీతో ఎగువ సభలో ప్రతిపక్షాలు అడ్డుకున్న బిల్లులను సైతం వీటో చేసే అధికారం ఆమెకు లభించింది.
ధరల నియంత్రణే మొదటి లక్ష్యం
ప్రధానిగా తకైచి ముందున్న ప్రధాన సవాల్.. ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలను తగ్గించడం. ఎన్నికల కారణంగా ఆలస్యమైన 2026 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ఆమోదించడంపై ఆమె దృష్టి సారించారు. ముఖ్యంగా సామాన్యుల ఖర్చులు తగ్గించేందుకు రెండేళ్ల పాటు ఆహార ఉత్పత్తులపై అమ్మకపు పన్నును రద్దు చేయాలని ఆమె ప్రతిపాదించారు. అంతేకాదు దాదాపు 122.3 ట్రిలియన్ యెన్ల (భారత కరెన్సీలో రూ.70 లక్షల కోట్ల పైమాటే) రికార్డు బడ్జెట్‌ను మార్చి నెలాఖరులోగా ఆమోదించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ స్థాయి ఖర్చుల వల్ల జపాన్ అప్పుల భారం పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చైనాతో కయ్యం.. తైవాన్ విషయంలో స్పష్టత
తకైచి రాకతో చైనాతో జపాన్ సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తైవాన్‌పై చైనా దాడులు చేస్తే జపాన్ చూస్తూ ఊరుకోదని ఆమె ఇప్పటికే హెచ్చరించారు. దీంతో బీజింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జపాన్‌పై ఆర్థిక ఆంక్షలు విధించింది. ఎన్నికల్లో గెలిచిన వెంటనే, వివాదాస్పద ‘యాసుకుని ఆలయం’ సందర్శన కోసం మద్దతు కూడగడతానని ఆమె ప్రకటించడం పొరుగు దేశాలకు రుచించడం లేదు.
అమెరికాతో దోస్తీ
వచ్చే నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరగనున్న శిఖరాగ్ర భేటీకి తకైచి వ్యూహాత్మకంగా సన్నద్ధమవుతున్నారు. అమెరికాలో 550 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని జపాన్ గతంలో ఇచ్చిన హామీలో భాగంగా.. మొదటి విడతగా 36 బిలియన్ డాలర్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో ఒహియోలో సహజ వాయువు ప్లాంట్, గల్ఫ్ కోస్ట్‌లో ముడి చమురు ఎగుమతి కేంద్రం వంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. అమెరికా రక్షణ అవసరాల కోసం జపాన్ మరింత ఎక్కువగా ఖర్చు చేయాలని ట్రంప్ ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఈ పెట్టుబడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
సంప్రదాయ విలువలకే పెద్దపీట
పాలనలోనూ ఆమె సంప్రదాయవాదానికే మొగ్గు చూపుతున్నారు. రాజ కుటుంబంలో పురుషులు మాత్రమే వారసులుగా ఉండాలనే నిబంధనకు ఆమె మద్దతు ఇస్తున్నారు. పెళ్లయిన తర్వాత మహిళలు తమ ఇంటిపేరును మార్చుకోవాలనే వివాదాస్పద పద్ధతిని కొనసాగించాలని ఆమె భావిస్తున్నారు. జపాన్ రక్షణ బడ్జెట్‌ను పెంచడం, మారణాయుధాల ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం , అణుశక్తితో నడిచే జలాంతర్గాముల తయారీ వంటి ప్రతిష్టాత్మక లక్ష్యాలతో ఆమె శాంతియుత రాజ్యాంగానికి సవరణలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. మొత్తానికి రికార్డు మెజారిటీతో బాధ్యతలు చేపట్టిన తకైచి.. అటు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే, ఇటు అంతర్జాతీయ స్థాయిలో జపాన్ సైనిక ఆధిపత్యాన్ని చాటాలని చూస్తున్నారు.
