Let's talk: editor@tmv.in
జపాన్‌ పార్లమెంటరీ ఎన్నికల్లో తకైచీ కూటమి ఘన విజయం

జపాన్‌ పార్లమెంటరీ ఎన్నికల్లో తకైచీ కూటమి ఘన విజయం

Shaik Mohammad Shaffee
10 ఫిబ్రవరి, 2026

జపాన్ రాజకీయాల్లో సనే తకైచి నూతన శకాన్ని ఆవిష్కరించారు. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ స్ఫూర్తితో తనను తాను 'ఐరన్ లేడీ'గా అభివర్ణించుకునే తకైచి, ఆదివారం జరిగిన పార్లమెంటు దిగువ సభ ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని అందుకున్నారు. ఆమె నేతృత్వంలోని లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) 465 స్థానాలకు గాను ఏకంగా 316 సీట్లను గెలుచుకుని, 1955లో పార్టీ ఆవిర్భావం తర్వాత అత్యుత్తమ ఫలితాన్ని నమోదు చేసింది. మిత్రపక్షమైన 'జపాన్ ఇన్నోవేషన్ పార్టీ' గెలిచిన 36 స్థానాలతో కలిపి అధికార కూటమి బలం 352కి చేరింది. దీనివల్ల ఎగువ సభలో మెజారిటీ లేకపోయినా, కీలక బిల్లులను నెగ్గించుకునేందుకు అవసరమైన 'సూపర్ మెజారిటీ' ఇప్పుడు ఆమె వశమైంది.

జపాన్‌లో 'సనే-మేనియా'

గత అక్టోబర్‌లో ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తకైచి, కేవలం మూడు నెలలకే ముందస్తు ఎన్నికలకు వెళ్లి భారీ విజయాన్ని అందుకున్నారు. ఎల్‌డీపీపై ఉన్న పాత అవినీతి ఆరోపణలను తుడిచిపెట్టేలా ఆమె తన వ్యక్తిగత చరిష్మాపై నమ్మకంతో ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. చురుకైన, కఠినమైన, అదే సమయంలో సరదాగా ఉండే ఆమె నాయకత్వ శైలి యువతను విపరీతంగా ఆకట్టుకుంది. యువతలో ఆమెకున్న క్రేజ్ 'సనాకట్సు' (సనే-మేనియా)గా మారింది. ఆమె వాడే వస్తువులకు మార్కెట్‌లో విపరీతమైన గిరాకీ ఏర్పడటమే దీనికి నిదర్శనం.

మంచు తుపానును లెక్కచేయని ఓటర్లు

తీవ్రమైన చలి, రికార్డు స్థాయి మంచు కురుస్తున్నప్పటికీ జపాన్ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి తకైచికి జై కొట్టారు. ఫిబ్రవరి మాసంలో ఎన్నికలు నిర్వహించడం అరుదైనప్పటికీ, ప్రజలు ఆమె మార్పు కోరుకుంటున్నారని ఈ ఫలితాలు నిరూపించాయి. ఈ భారీ మెజారిటీతో ఆమె రక్షణ, ఆర్థిక, వలస విధానాల్లో సమూల మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. వచ్చే వారం ఆమె అధికారికంగా మళ్లీ ప్రధానిగా ఎన్నిక కానున్నారు.

ఆర్థిక సంస్కరణలు.. పన్ను కోతల హామీ

ప్రజలకు ఊరటనిచ్చేలా ఆహార పదార్థాలపై ఉన్న 8 శాతం విక్రయ పన్నును రద్దు చేస్తామని తకైచి ఇచ్చిన హామీ ఓటర్లను ఆకర్షించింది. అయితే, అప్పుల భారంతో ఉన్న జపాన్ ఆర్థిక వ్యవస్థపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఆర్థిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'సనేనామిక్స్' పేరుతో ఆమె ప్రవేశపెట్టనున్న నూతన ఆర్థిక విధానాలు దేశాన్ని తిరిగి అభివృద్ధి పథంలోకి తెస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

చైనాకు గట్టి సవాల్.. రక్షణ రంగం బలోపేతం

చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, జపాన్ రక్షణ బడ్జెట్‌ను జీడీపీలో 2 శాతానికి పెంచాలని తకైచి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయుధ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత, రాజ్యాంగ సవరణ ద్వారా సైనిక శక్తిని పెంపొందించడం ఆమె ప్రధాన అజెండా. తైవాన్ విషయంలో ఆమె అనుసరిస్తున్న కఠిన వైఖరి ఇప్పటికే డ్రాగన్‌కు కలవరాన్ని కలిగిస్తోంది. చైనా బెదిరింపులను లెక్కచేయకుండా ఆమె ముందుకు సాగడం ప్రజల్లో ఆమెపై ఉన్న గౌరవాన్ని పెంచింది.

విదేశీయుల పట్ల కఠిన నిబంధనలు

వలసలపై నియంత్రణ, విదేశీయుల ఆస్తి కొనుగోళ్లకు కఠిన షరతులు, గూఢచర్య నిరోధక చట్టాలు వంటి నిర్ణయాల ద్వారా జపాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడతానని తకైచి స్పష్టం చేశారు. ఈ నిర్ణయాలు పౌర హక్కులకు ముప్పు అని కొందరు హెచ్చరిస్తున్నా, జాతీయవాద ధోరణి ఉన్న ఓటర్లు మాత్రం ఆమెకు బ్రహ్మరథం పట్టారు. దీనివల్ల 2028 వరకు మళ్లీ ఎన్నికల భయం లేకుండా ఆమె తన విధానాలను అమలు చేయవచ్చు.

అమెరికా మద్దతు.. ట్రంప్ ప్రశంసలు

తకైచి విజయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. "ఇది ఒక చారిత్రక విజయం. తకైచి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకురాలు" అని ఆయన కొనియాడారు. వచ్చే నెలలో ఆమె అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని తగ్గించేందుకు అమెరికా-జపాన్ మైత్రి మరింత బలపడనుందని ఈ ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి.

ప్రధాని మోదీ హృదయపూర్వక అభినందనలు

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్‌ వేదికగా తకైచికి అభినందనలు తెలిపారు. "జపాన్ దిగువ సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సనే తకైచికి అభినందనలు. భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రపంచ శాంతికి, స్థిరత్వానికి ఎంతో కీలకం. మీ సమర్థ నాయకత్వంలో ఇరు దేశాల స్నేహం మరిన్ని శిఖరాలను అధిరోహిస్తుందని నాకు నమ్మకం ఉంది" అని మోడీ పేర్కొన్నారు.

విపక్షాల ఘోర పరాజయం

ప్రతిపక్ష కూటమి అయిన 'సెంట్రిస్ట్ రిఫార్మ్ అలయన్స్' ఈ ఎన్నికల్లో కుప్పకూలింది. ఎన్నికల ముందున్న వారి స్థానాలు సగానికి పడిపోయాయి. విపక్షాలు చీలిపోవడం, తకైచికి ఉన్న వ్యక్తిగత ఆదరణ ముందు వారు నిలవలేకపోయారు. గత ప్రధాని షిగెరు ఇషిబా హయాంలో దెబ్బతిన్న పార్టీ ప్రతిష్టను తకైచి తన శక్తివంతమైన నాయకత్వంతో తిరిగి నిలబెట్టారు.

జపాన్ రాజకీయాల్లో నూతన శకం

ప్రస్తుతం జపాన్ రాజకీయాలు పూర్తిగా కుడిపక్షం వైపు మొగ్గు చూపాయి. ప్రొఫెసర్ మసాటో కామికుబో వంటి నిపుణులు దీనిని రాజకీయ మనుగడ కోసం తీసుకున్న నిర్ణయంగా అభివర్ణించినప్పటికీ, జపాన్ ప్రజలు మాత్రం స్పష్టమైన మార్పును కోరుకుంటున్నారని ఈ తీర్పు రుజువు చేసింది. శాంతివాద సూత్రాల నుంచి ఆత్మరక్షణ, సైనిక బలం దిశగా జపాన్ అడుగులు వేయబోతోంది.