
జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి
జపాన్ రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయం మొదలైంది. దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ నేత సనే తకైచి (64) ఎన్నికై చరిత్ర సృష్టించారు. అక్టోబర్ 21, మంగళవారం జపాన్ పార్లమెంట్ (డైట్) దిగువ సభలో జరిగిన ఓటింగ్‌లో ఆమె ఘన విజయం సాధించారు. ప్రస్తుత రాజకీయ అనిశ్చితి మధ్య జపాన్‌కు ఐదేళ్లలో ఐదో ప్రధానిగా ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఎలా ఎన్నికయ్యారు?
ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్ డీ పీ) పార్లమెంట్ ఉభయ సభల్లో మెజారిటీని కోల్పోయింది. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనైన అప్పటి ప్రధాని షిగెరు ఇషిబా రాజీనామా చేయడంతో ప్రధాని పదవి ఖాళీ అయింది. ఈ క్రమంలో, అక్టోబర్ 4న జరిగిన ఎల్ డీ పీ అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రధాని కుమారుడు షింజిరో కోయిజుమితో సహా మరో ముగ్గురు అభ్యర్థులను ఓడించి సనే తకైచి పార్టీ పగ్గాలు చేపట్టారు.
మంగళవారం పార్లమెంటులోని 465 స్థానాలున్న దిగువ సభలో జరిగిన ఓటింగ్‌లో తకాయిచికి 237 ఓట్లు లభించాయి, దీంతో ఆమె సునాయాసంగా మెజారిటీ మార్కును దాటారు. మొదట్లో ఎల్ డీ పీ మిత్రపక్షమైన కొమెయిటో పార్టీ సంకీర్ణం నుంచి వైదొలగింది. దీంతో తకాయిచి నాయకత్వంలోని ఎల్ డీ పీ.. జపాన్ ఇన్నోవేషన్ పార్టీ (జేఐపీ)తో సోమవారం సాయంత్రం కొత్త పొత్తు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కూటమి మద్దతుతోనే తకాయిచి ప్రధాని పీఠాన్ని దక్కించుకున్నారు.
సనే తకైచి ఎవరు?
సనే తకైచి జపాన్‌లో అత్యంత కీలకమైన, అతివాద రాజకీయ నాయకురాలు. 64 ఏళ్ల తకాయిచి 1961లో నారాలో జన్మించారు. 1993లో నారా నుంచి తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీలో ఆమె ఆర్థిక భద్రత, అంతర్గత వ్యవహారాలు, లింగ సమానత్వ మంత్రిత్వ పదవితో సహా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆమెను బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ అభిమానిగా చూస్తారు. అందుకే ఆమెను 'ఐరన్ లేడీ' అని పిలుస్తారు. చైనా విధానాలపై ఆమె తీవ్ర విమర్శలు చేస్తారు. ఆ దేశం పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తారు. వ్యక్తిగత జీవితంలో హెవీ మెటల్ డ్రమ్మర్‌గా కూడా పనిచేశారు. ఆమె కన్జర్వేటివ్ భావాలు కారణంగా, స్వలింగ వివాహాలకు వ్యతిరేకంగా ఉంటారు.
తకైచి ముందున్న సవాళ్లు ఏవి?
నూతన ప్రధాని సనే తకైచి ముందు అనేక క్లిష్టమైన సమస్యలు, అంతర్జాతీయ సవాళ్లు ఉన్నాయి. అవేంటంటే.. మైనారిటీ ప్రభుత్వం: కొత్త సంకీర్ణంతో కూడా పార్లమెంట్‌లో ఆమెకు పూర్తి మెజారిటీ లేదు. దీనివల్ల ఏ చట్టాన్ని ఆమోదించాలన్నా ఇతర ప్రతిపక్ష పార్టీల మద్దతుపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇది ఆమె ప్రభుత్వాన్ని అస్థిరంగా మార్చే ప్రమాదం ఉంది. పార్టీ ఏకీకరణ: కుంభకోణాలు, అంతర్గత విభేదాలతో దెబ్బతిన్న పాలక పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడం. ఆర్థిక సవాళ్లు: దేశంలో పెరుగుతున్న ధరలు, ఆర్థిక వృద్ధి మందగమనం, అవినీతి కుంభకోణాలు వంటి క్లిష్టమైన దేశీయ ఆర్థిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. అంతర్జాతీయ దౌత్యం: చైనా పట్ల ఆమె దూకుడు వైఖరి కారణంగా చైనా, దక్షిణ కొరియాలతో దౌత్య సంబంధాలు మరింత క్లిష్టతరం కావచ్చు. తొలి అంతర్జాతీయ బాధ్యతలు: త్వరలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం, ఆసియా ప్రాంతీయ సదస్సులలో పాల్గొనడం ఆమెకు తొలి అంతర్జాతీయ బాధ్యతల్లో ఉన్నాయి.
అందరం కష్టపడి పని చేయాలి: తకైచి
జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికైన వెంటనే, సనే తకైచి దేశ పునర్నిర్మాణం పట్ల తన నిబద్ధతను గట్టిగా వ్యక్తం చేశారు. లిబరల్ డెమొక్రటిక్ పార్టీ సభ్యులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. "నేను ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటాను. ప్రతి తరాన్ని, ప్రతి వ్యక్తిని ఏకం చేస్తేనే మనం తిరిగి నిర్మించగలం," అని ఆమె అన్నారు. ప్రస్తుత సవాళ్ల దృష్ట్యా కష్టపడి పనిచేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతూ, తన సహచరులకు ఒక బలమైన పిలుపునిచ్చారు. "మనం కొద్దిమందమే ఉన్నాం. అందుకే గుర్రం లాగా అందరూ కష్టపడి పని చేయాలని నేను అడుగుతున్నాను," అని తకాయిచి పేర్కొన్నారు. అంతేకాకుండా, తన వ్యక్తిగత వైఖరిని స్పష్టం చేస్తూ, "వర్క్-లైఫ్ బాలెన్స్ అనే ఆలోచనను పక్కన పెట్టి నేను పనిచేస్తా. పనిని మాత్రమే చేస్తా" అని ఆమె ప్రకటించారు.
ప్రధాని మోడీ శుభాకాంక్షలు
జపాన్ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన సానే తకైచికి పలువురు ప్రపంచ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. భారత్-జపాన్‌ల ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి తకాయిచితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుల విషయంలో ఇరుదేశాల బంధాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. జపాన్ అభివృద్ధి దిశగా సనై తకాయిచి విజయవంతమైన నాయకత్వం వహించాలని యూఏఈ అధ్యక్షుడు మొహ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్ ఆకాంక్షించారు.యూఏఈ-జపాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి పునాది వేస్తూ, రెండు దేశాల ప్రజలకు అభివృద్ధి, శ్రేయస్సు కలిగేలా కలిసి పనిచేయాలని ఆశిస్తున్నానని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అమెరికా సహా ఇతర ఆసియా దేశాల ప్రముఖులు కూడా ఆమెకు అభినందనలు తెలిపారు.
