
జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనాయి టకాయిచి
జపాన్ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. దేశంలోని పాలక కన్జర్వేటివ్ పార్టీయైన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) తమ కొత్త నాయకురాలిగా 64 ఏళ్ల సనాయి టకాయిచిని ఎన్నుకుంది. దీంతో టకాయిచి త్వరలో జపాన్ దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు మార్గం సుగమమైంది.
అయితే ఆమె నియామకం ఒక సాధారణ పరిణామం కాదు. గత కొంతకాలంగా కుంభకోణాలు, అంతర్గత విబేధాలతో అల్లాడుతున్న ఎల్‌డీపీ పార్టీ ఉభయ సభల్లోనూ తమ మెజారిటీని కోల్పోయింది. ఈ సంక్షోభ సమయంలో టకాయిచి నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. షిగేరు ఇషిబా రాజీనామా అనంతరం నాయకత్వ రేసులో నిలిచిన టకాయిచి, తన సంప్రదాయవాద వైఖరితో పార్టీ సభ్యుల మద్దతును కూడగట్టారు. రన్-ఆఫ్ ఓటింగ్‌లో ఆమె శింజిరో కొయుజ్‌మిపై విజయం సాధించి పార్టీ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు.
మార్గరెట్ థాచర్ స్ఫూర్తితో..
టకాయిచికి బ్రిటన్ తొలి మహిళా ప్రధాని మార్గరెట్ థాచర్ అంటే ఎంతో అభిమానం. "ఐరన్ లేడీ"గా గుర్తింపు పొందిన థాచర్ స్ఫూర్తితో టకాయిచి కూడా తన లక్ష్యాన్ని చేరుకున్నారు. కానీ ఆమె ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. దేశంలో వేతనాలు స్తంభించడం, ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ మందగమన ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాల్సిన బాధ్యత టకాయిచిపై ఉంది. అంతర్గత కలహాలతో దెబ్బతిన్న ఎల్‌డీపీ పార్టీని ఏకం చేసి, ప్రజల విశ్వాసాన్ని తిరిగి సంపాదించడం ఆమె తక్షణ కర్తవ్యం. అంతేకాక ఆమె గత ప్రభుత్వం ట్రంప్ పరిపాలనతో అంగీకరించిన సుంకాల ఒప్పందాన్ని కూడా అమలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా చైనా, దక్షిణ కొరియాలతో సంబంధాల విషయంలో ఆమె తీసుకునే జాతీయవాద వైఖరి పొరుగు దేశాలకు చికాకు కలిగించే అవకాశం ఉంది.
టకాయిచి దివంగత మాజీ ప్రధాని షింజో అబే సన్నిహిత శిష్యురాలు. ఆమె అబే చేపట్టిన 'ఆర్థిక విజన్'ను తిరిగి తీసుకువస్తానని అనేక సందర్భాల్లో చెప్పారు. ఆమె వైఖరి కఠినమైన సంప్రదాయవాదంతో కూడుకుని ఉంటుంది. వివాహం తర్వాత మహిళలు తమ కన్యత్వ పేరును కొనసాగించడానికి అనుమతించే చట్టాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఆమె స్వలింగ వివాహాలకు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. భద్రత విషయంలో దూకుడుగా ఉండే టకాయిచి, జపాన్ రాజ్యాంగాన్ని సవరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆమె జపాన్ యుద్ధ వీరులు, యుద్ధ నేరస్థులను స్మరించుకునే వివాదాస్పదమైన యసుకుని మందిరాన్ని తరచుగా సందర్శించడం, ఆమె జాతీయవాద వైఖరికి నిదర్శనం.
ప్రస్తుతం పాలక కూటమి మెజారిటీ కోల్పోయినప్పటికీ, టకాయిచిని ప్రధానిగా పార్లమెంట్ ధృవీకరించే అవకాశమే ఎక్కువగా ఉంది. తన కష్టపడే తత్వం, పట్టుదలతో 'ఐరన్ లేడీ'లా పనిచేస్తానని ఆమె ప్రతిజ్ఞ చేశారు. జపాన్ ఎదుర్కొంటున్న ఆర్థిక, రాజకీయ సవాళ్లను సనాయి టకాయిచి ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
