Let's talk: editor@tmv.in
జపాన్ తీరంలో భారీ భూకంపం.. సునామీ వార్నింగ్ వెన‌క్కి

జపాన్ తీరంలో భారీ భూకంపం.. సునామీ వార్నింగ్ వెన‌క్కి

Shaik Mohammad Shaffee
10 నవంబర్, 2025

జపాన్‌ ఉత్తర తీర ప్రాంతంలో ఆదివారం శక్తిమంతమైన భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా జపాన్ వాతావరణ సంస్థ తక్షణమే తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికను జారీ చేసి ఆ తర్వాత వెనక్కి తీసుకుంది. ఈ భూకంపం జపాన్ స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 5 గంటలకు సంభవించింది.

జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో ఇవాటే ప్రిఫెక్చర్ తీరానికి సమీపంగా సముద్ర మట్టం నుండి సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. ఇవాటే ప్రిఫెక్చర్‌లోని యమడా నగరానికి తూర్పున 126 కిలోమీటర్ల దూరంలో ఇది సంభవించింది. మొరియోకా నగరం, యహబా పట్టణంలో ఈ ప్రకంపనల తీవ్రత జపాన్ భూకంప తీవ్రత మాపకం ప్రకారం షిండో 4కు సమానం.

భూకంపం సంభవించిన వెంటనే, ఇవాటే ప్రిఫెక్చర్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరిక జారీ చేశారు. మియాకో, యమడా వంటి తీర ప్రాంతాలలో గరిష్టంగా ఒక మీటరు ఎత్తు వరకు సునామీ అలలు ఎగిసిపడే అవకాశం ఉందని వాతావరణ సంస్థ అంచనా వేసింది. భూకంపం వచ్చిన కొద్దిసేపటికే సాయంత్రం 5:12 గంటలకు ఇవాటే ప్రిఫెక్చర్ తీరం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఒక సునామీ తరంగం గమనించారు.

జపాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ఎన్‌హెచ్‌కె, సునామీ ప్రమాదం ఇంకా కొనసాగుతున్నందున ప్రజలను వెంటనే తీర ప్రాంతాలకు పూర్తిగా దూరంగా, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరింది. ఎన్‌హెచ్‌కె ఇచ్చిన సమాచారం ప్రకారం, ఇవాటే ప్రిఫెక్చర్‌లోని ఓఫునాటో నగరంలో, ఓమినాటో పోర్ట్‌ వద్ద సుమారు 10 సెంటీమీటర్ల ఎత్తులో సునామీ అలలు నమోదయ్యాయి.

అదృష్టవశాత్తూ, ఈ శక్తివంతమైన భూకంపం వల్ల పెద్దగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ప్రాథమిక నివేదిక తెలిపింది. అయితే భూకంపం కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని క్యోడో న్యూస్ తెలిపింది. అలాగే, ఆ ప్రాంతంలో బుల్లెట్‌ రైళ్లు ఆలస్యంగా నడిచినట్లు జేఆర్ ఈస్ట్ రైల్వే ఆపరేటర్ పేర్కొంది. ఆ ప్రాంతంలోని రెండు అణు విద్యుత్ కేంద్రాలలో ఎలాంటి అసాధారణ పరిస్థితులు గమనించలేదని అధికారులు తెలిపారు.

అయితే ఆదివారం ఉదయం అదే ప్రాంతంలో 4.8 నుండి 5.8 తీవ్రత మధ్య ఉన్న ఆరు భూకంపాలు సంభవించాయి. అయితే తీరంలో వాటి ప్రభావం అంతగా కనిపించలేదు, సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయలేదు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

జపాన్ పసిఫిక్ మహాసముద్రంలోని "రింగ్ ఆఫ్ ఫైర్" ప్రాంతంలో ఉంది. ఇది ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే ప్రాంతాలలో ఒకటి. ఇదే ప్రాంతంలో 2011 మార్చిలో సంభవించిన శక్తివంతమైన భూకంపం, సునామీ వల్ల ఘోర ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగింది.