Let's talk: editor@tmv.in
జపాన్ గ్రాండ్ ప్రి విజేత కిమీ ఆంటోనెల్లి
జపాన్ గ్రాండ్ ప్రి విజేత కిమీ ఆంటోనెల్లి

జపాన్ గ్రాండ్ ప్రి విజేత కిమీ ఆంటోనెల్లి

Shaik Mohammad Shaffee
30 మార్చి, 2026

ఫార్ములా వన్ (ఎఫ్1) ప్రపంచంలో సరికొత్త చరిత్ర మొదలైంది. మెర్సిడెస్ యువ సంచలనం, 19 ఏళ్ల కిమీ ఆంటోనెల్లి తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ ఆదివారం జరిగిన జపనీస్ గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచాడు. రెండు వారాల క్రితం చైనాలో తన తొలి విజయాన్ని అందుకున్న ఈ ఇటలీ కుర్రాడు, ఇప్పుడు సుజుకా ట్రాక్‌పై కూడా జెండా పాతాడు. ఈ విజయంతో కేవలం మూడు రేసుల్లోనే 72 పాయింట్లు సాధించి, వరల్డ్ ఛాంపియన్‌షిప్ పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా ఆంటోనెల్లి రికార్డు సృష్టించాడు.

రేసును మలుపు తిప్పిన 'సేఫ్టీ కార్'

ఆదివారం ప్రశాంతమైన వాతావరణంలో జరిగిన ఈ రేసులో ఆంటోనెల్లి పోల్ పొజిషన్ నుంచి ప్రారంభించినప్పటికీ, ఆరంభంలో తడబడటంతో ఆరో స్థానానికి పడిపోయాడు. మెక్లారెన్ డ్రైవర్ ఆస్కార్ పియాస్త్రీ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అయితే 22వ ల్యాప్ వద్ద హాస్ డ్రైవర్ ఆలివర్ బేర్‌మన్ కంట్రోల్ తప్పి టైర్ బారియర్‌ను ఢీకొట్టడంతో రేసులోకి 'సేఫ్టీ కార్' వచ్చింది. ఈ సమయంలో ఆంటోనెల్లి చాకచక్యంగా వ్యవహరించి ముందంజ వేశాడు. "సేఫ్టీ కార్ రావడం నా అదృష్టం, అది నా పనిని సులభం చేసింది" అని విజయం అనంతరం ఆంటోనెల్లి వ్యాఖ్యానించాడు. చివరికి పియాస్త్రీ కంటే 13.7 సెకన్ల ముందుగా రేసును ముగించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

మెర్సిడెస్ ఆధిపత్యం.. ఫెరారీ పోరాటం

2026 కొత్త నిబంధనల ప్రకారం రూపొందించిన కార్లను (50 శాతం ఎలక్ట్రికల్ పవర్) అర్థం చేసుకోవడంలో మెర్సిడెస్ జట్టు అందరికంటే ముందుంది. ఈ సీజన్లో జరిగిన మొదటి మూడు రేసులను మెర్సిడెస్ గెలవగా, అందులో రెండింటిని ఆంటోనెల్లి గెలుచుకోవడం విశేషం. ఈ రేసులో ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ మూడో స్థానంలో నిలవగా, ఆంటోనెల్లి టీమ్ మేట్ జార్జ్ రస్సెల్ నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు. వెటరన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ (ఫెరారీ) ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తన కారు పోటీనిచ్చే స్థితిలోనే ఉందని, తాను ఇంకా ఫామ్ కోల్పోలేదని హామిల్టన్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశాడు.

రేసులకు సుదీర్ఘ విరామం

మరోవైపు పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ఫార్ములా వన్ క్యాలెండర్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్‌లో బహ్రెయిన్, సౌదీ అరేబియాలో జరగాల్సిన రేసులను రద్దు చేశారు. దీంతో ఐదు వారాల సుదీర్ఘ విరామం తర్వాత, తదుపరి రేసు మే 3న అమెరికాలోని మయామిలో జరగనుంది. అప్పటి వరకు కిమీ ఆంటోనెల్లి ఛాంపియన్‌షిప్ పట్టికలో నంబర్ వన్ స్థానంలో కొనసాగనున్నాడు.