Let's talk: editor@tmv.in
జపాన్‌లో ముందస్తు పోరు? దిగువ సభ రద్దుకు తకైచి నిర్ణయం!

జపాన్‌లో ముందస్తు పోరు? దిగువ సభ రద్దుకు తకైచి నిర్ణయం!

Shaik Mohammad Shaffee
15 జనవరి, 2026

జపాన్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. గతేడాది అక్టోబర్‌లో జపాన్ తొలి మహిళా ప్రధానిగా పగ్గాలు చేపట్టిన సనే తకైచి.. సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. తన విధానాలకు ప్రజా మద్దతును కూడగట్టేందుకు దిగువ సభను రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నట్లు అధికార పార్టీ అగ్రనేత ఒకరు బుధవారం వెల్లడించారు.

ముందస్తు వ్యూహం వెనుక..

ప్రస్తుతం తకైచి పట్ల ప్రజల్లో 70 శాతం ఆమోదం ఉండటమే ఈ ముందస్తు నిర్ణయానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. తనపై ఉన్న ప్రజాదరణను ఓట్లుగా మలుచుకోవడం ద్వారా, దిగువ సభలో ప్రస్తుతం ఉన్న స్వల్ప మెజారిటీని భారీ మెజారిటీగా మార్చుకోవాలని ఆమె భావిస్తున్నారు. ఈ నెల 23న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగానే సభను రద్దు చేసే అవకాశం ఉన్నట్లు అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) సెక్రటరీ జనరల్ షునిచి సుజుకి తెలిపారు.

ప్రధాన అజెండా: బడ్జెట్, బలమైన కూటమి

జపాన్ ప్రధాని సనే తకైచి వ్యూహంలో బడ్జెట్ ఆమోదం, కూటమిని పటిష్ఠం చేసుకోవడం ప్రధాన అజెండాగా కనిపిస్తున్నాయి. డిసెంబర్ చివరలో ఆమె కేబినెట్ 122.3 ట్రిలియన్ యెన్ల (సుమారు 770 బిలియన్ డాలర్లు) రికార్డు స్థాయి బడ్జెట్‌ను ఆమోదించింది. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంతో పాటు, తక్కువ ఆదాయ వర్గాలకు మద్దతు ఇచ్చే కీలక పథకాల అమలుకు ఈ భారీ నిధులు అత్యవసరం.

అదేవిధంగా జపాన్ ఇన్నోవేషన్ పార్టీతో జతకట్టి ఎన్నికల బరిలోకి దిగడం ద్వారా తన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) బలాన్ని మరింత పెంచుకోవాలని తకైచి యోచిస్తున్నారు. అతివాద, జాతీయవాద భావజాలం కలిగిన ఆమె, గత ఎన్నికల్లో ఇతర పార్టీల వైపు మొగ్గు చూపిన సంప్రదాయ ఓటర్లను మళ్లీ ఆకట్టుకుని పార్టీకి పాత వైభవాన్ని తీసుకురావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ముందస్తు ఎన్నికల ద్వారా ఈ లక్ష్యాలన్నింటినీ సాకారం చేసుకోవాలని ఆమె భావిస్తున్నారు.

ఫిబ్రవరి 8న పోలింగ్?

వచ్చే సోమవారం ప్రధాని తకైచి నిర్వహించబోయే విలేకరుల సమావేశంలో దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మీడియా కథనాల ప్రకారం.. జనవరి 23న సభ రద్దయితే, ఫిబ్రవరి 8వ తేదీన దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రతిపక్షాల ఆగ్రహం

ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. బడ్జెట్‌పై చర్చించాల్సిన సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం స్వార్థపూరిత చర్యని మండిపడుతున్నాయి. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, కేవలం అధికారం కోసమే ప్రధాని ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం ఎగువ సభలో మైనారిటీలో ఉన్న అధికార కూటమి, దిగువ సభలోనైనా తిరుగులేని ఆధిక్యం సాధించాలని పట్టుదలతో ఉంది.