
జపాన్‌లో బద్దలైన సకురాజిమా అగ్నిపర్వతం
నైరుతి జపాన్‌లోని కగోషిమా ప్రిఫెక్చర్‌లోని సకురాజిమా అగ్నిపర్వతం ఆదివారం తెల్లవారుజామున బద్దలైంది. ఈ విస్ఫోటనం కారణంగా 4,400 మీటర్ల ఎత్తుకు బూడిద, పొగ ఆకాశంలోకి ఎగిసిపడిందని వాతావరణ సంస్థను ఉటంకిస్తూ క్యోడో న్యూస్ నివేదించింది.
స్థానిక కాలమానం ప్రకారం, ఆదివారం తెల్లవారుజామున 12:57 గంటలకు మినమిడాకే క్రేటర్ వద్ద జరిగిన పేలుడు విస్ఫోటనం నుండి ఈ పొగ మేఘం వెలువడింది. గత ఏడాది అక్టోబరు 18 తర్వాత 4,000 మీటర్ల ఎత్తుకు పొగ రావడం ఇది మొదటిసారి అని స్థానిక వాతావరణ అబ్జర్వేటరీ తెలిపింది. ఈ విస్ఫోటనం తర్వాత కూడా అగ్నిపర్వతం చురుకుగా ఉంది. దీంతో కగోషిమా, కుమమోటో, మియాజాకి ప్రిఫెక్చర్లలోని కొన్ని ప్రాంతాలకు బూడిద పడే హెచ్చరికను వాతావరణ సంస్థ జారీ చేసింది. అయితే ఇప్పటివరకు ఎటువంటి గాయాలు, భవనాలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదు.
ఈ విస్ఫోటనాల శ్రేణిలో కొన్ని పెద్ద అగ్నిపర్వత శిలలు కొండపై దూరంగా ఉన్న ఐదవ స్టేషన్ వరకు ఎగిరి పడ్డాయి. ప్రస్తుతం అగ్నిపర్వతం వద్ద అప్రమత్తత స్థాయి (Alert Level) ఐదు పాయింట్ల స్కేల్‌లో మూడు వద్ద కొనసాగుతోంది. ఈ స్థాయి అగ్నిపర్వత ప్రాంతంలోకి ఎవరూ ప్రవేశించకుండా, పర్వతాన్ని సమీపించకుండా నియంత్రిస్తుంది.
సకురాజిమా చరిత్ర
సకురాజిమా అనేది జపాన్‌లో అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటి. ఇది క్యూషూ ద్వీపంలో ఒసుమి ద్వీపకల్పానికి అనుసంధానించబడి ఉంది. ఆసక్తికరంగా, ఈ పర్వతం ఒకప్పుడు సముద్రంలో ఒక ద్వీపంగా ఉండేది. కానీ 1914లో జరిగిన లావా ప్రవాహం కారణంగా అది ద్వీపకల్పంతో కలుపుతూ ఒక భూ వంతెనను సృష్టించింది. ఈ అగ్నిపర్వత విస్ఫోటనం అక్కడి ప్రజలకు కొత్త విషయం కాదు, అయినప్పటికీ దీనిని ఎప్పుడూ అత్యంత అప్రమత్తతతో పర్యవేక్షిస్తుంటారు.
ఇదిలా ఉండగా జపాన్ ప్రభుత్వం గతంలో ఆగస్టు 30న భారీ మౌంట్ ఫుజి అగ్నిపర్వతం విస్ఫోటనం సంభవిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేస్తూ, నమూనా వీడియో ఫుటేజీని విడుదల చేసింది. ఇలాంటి విపత్తు పరిస్థితికి ప్రజలను మెరుగ్గా సిద్ధం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ వీడియోను విడుదల చేశారు.
ఈ 10 నిమిషాల వీడియోలో 1707లో సంభవించిన చివరి విస్ఫోటనం స్థాయికి సమానమైన పేలుడు తర్వాత దృశ్యాలను చూపించడానికి కంప్యూటర్ గ్రాఫిక్స్‌ను ఉపయోగించారు. విస్ఫోటనం సంభవిస్తే, విద్యుత్ సరఫరా, మురుగునీటి వ్యవస్థలు, రోడ్లు, రైల్వేలతో సహా మౌలిక సదుపాయాలు ప్రభావితమవుతాయని ఈ వీడియో హెచ్చరించింది.
జపాన్‌లోనే అత్యంత ఎత్తైనదైన (3,776 మీటర్లు) ఈ శిఖరం వద్ద సంభవించే విపత్తుకు సంబంధించిన వీడియోను కేబినెట్ కార్యాలయం వెబ్‌సైట్‌లో చూడవచ్చు. జపాన్ ఆగస్టు 26న "అగ్నిపర్వత విపత్తు సన్నద్ధత అవగాహన దినోత్సవం" పాటిస్తున్న సందర్భంగా ఈ వీడియో విడుదలైంది.
"మౌంట్ ఫుజి 300 సంవత్సరాలకు పైగా విస్ఫోటనం చెందకపోవడం కొంత అసాధారణం" అని యూనివర్శిటీ ఆఫ్ టోక్యోకు చెందిన ఎమెరిటస్ ప్రొఫెసర్ తోషిత్సుగు ఫుజి ఈ ఫుటేజీలో పేర్కొన్నారు. సగటున మౌంట్ ఫుజి ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి విస్ఫోటనం చెందుతుందని ఆయన తెలిపారు.
