
జన్ సురాజ్కు బీహార్ లో ఆదరణ దక్కేనా?
రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా ఉన్నాయి. ఎన్డీయే కూటమి ఇప్పటికే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. సీట్ల పంపకాలపై చర్చలు కీలక దశలో ఉన్నాయి. మహాఘట్బంధన్ లో సీట్ల సర్దుబాటు గురించి ఇటీవల సాధారణ చర్చలు జరిగాయి. సీట్ల సర్దుబాటు విషయంలోత్యాగాలు చేయాల్సి ఉంటుందన్న తేజస్వీ యాదవ్ మరుసటి రోజే యూటర్న్ తీసుకుని మొత్తం స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఇది ఎంతవరకు వెలుతుందో చూడాల్సిందే. అయితే ఈ సంకీర్ణ కూటములకు పోటీగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) ప్రారంభించిన జన్ సురాజ్ ఎవరితోనూ, ఏ కూటమిలోనూ చేరకుండా ఒంటరిగా 243 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది.
దీంతో రాష్ట్రంలో ముక్కోణపు పోటీ తప్పేలా లేదు. కులాల బలాలు, బలమైన నాయకులు, ఎత్తులకు పై ఎత్తులు వేసే పార్టీలు ఉన్న బీహార్ లో పీకే స్థాపించిన పార్టీ రానున్న ఎన్నికల్లో రాణిస్తుందా? మూడో పార్టీలానే మూడో స్థానంలో నిలుస్తుందా అన్నది వేచి చూడాల్సిందే. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి పార్టీ రచిస్తున్న వ్యూహాలు ఏమిటి? అభ్యర్థులు ఎవరూ? ఎన్నికల మేనిఫెస్టో ఎలా ఉంటుందన్న విషయాలు బీహార్ ప్రజల్లోనూ, దేశ పౌరుల్లోనూ ఆసక్తి ని కలిగిస్తోంది. ఏపీ,బెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఆయా పార్టీలకు అద్భుతమైన మెనిఫెస్టోలను రచించి విజయాల్లో పీకే కీలక పాత్ర పోషించారు . ఇప్పుడు ఎన్నికల స్ట్రాటజీకి విరామమిచ్చి సొంత రాష్ట్రంలో తన భవిష్యత్ ను పరీక్షించుకుబోతున్నారు. దీంతో సహజంగానే ఇతర పార్టీలకు కూడా ఆసక్తి ఉంటుంది.
జన్ సురాజ్ అభియాన్ నుంచి పార్టీ ప్రకటన వరకు
ప్రజలకు సుపారిపాలన అందించాలనే ఆశయంతో బీహార్లో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. అందుకునుగుణంగా గాంధీజీ ఉప్పు సత్యగ్రహం ప్రారంభించిన చంపారన్ నుంచి 2022 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా జన్ సురాజ్ అభియాన్ పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా దాదాపు ఐదు వేల గ్రామాలలో 3500 కిలో మీటర్లు నడిచారు. ఈ యాత్రలో ప్రజల నుంచి అనేక వినతులు, సూచనలు, సలహలు తీసుకున్నారు.
అలాగే బీహార్ లోని విభిన్న వర్గాల స్థితిగతులను అవగతం చేసుకున్నారు. పాదయాత్ర చేసి విరమిస్తే అభివృద్ధి జరగదని దీర్ఘకాలిక పాలన వ్యూహన్ని రచించారు. పార్టీ ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో 2024 గాంధీ జయంతి రోజునే జన్ సురాజ్ పార్టీని ప్రకటించారు. ప్రజలకు సుపారి పాలనే అందించడమే లక్ష్యంగా ముందుకు వెలుతుందని ప్రకటించారు. రాష్ట్రంలో విద్యా, ఉపాధి, వైద్య రంగాలను బలోపేతం చేస్తామని, యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని,పాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తామని, కుల, మత రాజకీయాలకు దూరంగా ఉంటామని, పాలనలో పారదర్శకతనే ప్రధాన సిద్ధాంతాలుగా పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించారు. అందుకనుగుణంగా పార్టీ మొదటి అధ్యక్షుడిగా అట్టడుగు వర్గానికి చెందిన రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన మనోజ్ భారతిని నియమించారు.
90 శాతం కొత్తవారికి సీట్లిస్తాం
రానున్న ఎన్నికల్లో 90 శాతం కొత్తవారికి అవకాశమిస్తాం. అందులో మహిళలకు, యువతకు, వెనుబడిన వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తామని పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ ప్రకటించారు. దీంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చలు మొదలయ్యాయి. తాము ఎక్కడ ఎన్నికల రేసులో వెనుకబడిపోతామోననే ఉద్దేశ్యంతో రెండు కూటములు అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా సీట్ల కేటాయింపు ఉంటుందని ఇప్పటికే ప్రకటించాయి.
ఉప ఎన్నికల్లో.. మూడో స్థానంలో
పార్టీ ఎర్పడిన నెలలోపే బీహార్లో నాలుగు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ’బ్యాగ్‘ గుర్తుపై పోటీ చేసింది. ఇమామ్గంజ్ (SC), బెలాగంజ్, రామ్గఢ్, తరారి అనే నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేసింది. రాంగఢ్ మినహా మిగతా మూడు స్థానాల్లో మూడో స్థానంలో నిలిచింది. అయితే ఇవి పార్టీకి రిహర్సల్స్ మాదిరి ఉపయోగపడ్డాయని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు.
ఈ ఎన్నికల్లో రాణిస్తుందా?
అయితే పార్టీ వచ్చి ఎన్నికల నాటికి సంవత్సరం పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ సంస్థగతంగా బలంగా నిర్మాణం కాలేదు. గ్రామాల్లో, పట్టణాల్లో ఇంకా పార్టీకి సంబంధించిన కమిటీలు ఏర్పాటు చేయలేదు. సంస్థాగతంగా ఇంకా పూర్తి రూపం సంతరించుకోలేదు. బూత్ స్థాయిలో కూడా ఎజెంట్లను నిలబెట్టే పరిస్థితి లేదు. ఈ క్రమంలో 243 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్పి సంచలనం రేపింది. అలాగే బీహార్ రాజకీయాల్లో కులాలు, మతాల ప్రాధాన్యం ఆధారంగా రాజకీయాలు జరుగుతాయి. ఎన్నికల్లో కూడా ఈ అంశాలు ప్రభావం చూపుతాయి. ఎన్నికలు ఏవైనా ప్రధానంగా ఉండాల్సింది డబ్బే. రాత్రికి రాత్రే ఫలితాలను మార్చే శక్తి దీనికే ఉంది. కానీ పార్టీకి ఇంకా పెద్ద మొత్తంలో విరాళాలు రావడం లేదు. ఇతర పార్టీలతో పోలిస్తే ఆర్థికంగా జన్ సురాజ్ వెనకబడే ఉంది. పెద్ద ఎత్తున జరిగే ఎన్నికల ప్రచారానికి ఆర్థికంగా పరిపుష్టిగా ఉండడం అత్యంత అవసరం. అయితే ఇన్ని బలహీనతలు ఉన్నప్పటికీ బీహార్ప్రజలు ఆదరిస్తారనే నమ్మకంతో ఎన్నికల గోదాలోకి జన్ సురాజ్ దిగుతోంది. అయితే రాష్ర్టంలో జరిగే ఎన్నికల్లో దాదాపు 15 నుంచి 20 సీట్లు గెలిచే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి.
