
‘జన నాయగన్’ నుండి ‘దళపతి కచేరీ’ విడుదల..
తమిళ సూపర్‌స్టార్ దళపతి విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు తన చివరి చిత్రంగా ప్రకటించిన ‘జన నాయగన్’ మొదటి పాట ‘దళపతి కచేరీ’ శనివారం సాయంత్రం 6:03 గంటలకు అధికారికంగా విడుదలైంది. ఈ మాస్ బీట్ సాంగ్‌తో అభిమానుల్లో మంచి వైబ్ తీసుకొచ్చింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 9, 2026న థియేటర్లలోకి రానున్న ఈ చిత్ర ప్రమోషన్స్‌కు ఈ పాట మరింత ఊపునిచ్చింది.
హెచ్. వినోత్ దర్శకత్వంలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మించిన ఈ సినిమా, తెలుగులో విజయ్ ‘భగవంత్ కేసరి’ హిట్ రీమేక్‌గా తెరకెక్కుతోంది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా, మమితా బైజు కీలక పాత్రలో కనిపిస్తుంది. బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరేన్, జగదీష్ పలనిసామి, లోహిత్ ఎన్‌కేలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇటీవల విడుదలైన ‘దళపతి కచేరీ’ పాట లో అనిరుధ్, విజయ్, ఆరివు గానం చేసిన మాస్ ట్రాక్. ఆరివు లిరిక్స్ పాట కు ప్రత్యేకత చేకూర్చాయి. 3 నిమిషాల 21 సెకన్ల లిరికల్ వీడియో, అనిరుధ్ స్టేజీపై గిటార్ వాయించి పాడుతూ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నలుపు జుట్టుతో విజయ్ పెద్ద గ్రూప్‌తో ఎనర్జిటిక్‌గా డాన్స్ చేస్తూ కనిపిస్తాడు. పూజా హెగ్డే, మమితా బైజు కూడా వేడుకలో చేరి, సింపుల్ స్టెప్స్‌తో అలరిస్తారు.
‘గిల్లీ’, ‘తుపాకీ’, ‘మెర్సల్’, ‘మాస్టర్’ వంటి హిట్ చిత్రాల్లోని ఐకానిక్ డాన్స్ స్టెప్స్‌ను రీక్రియేట్ చేసి, అభిమానుల్ని భావోద్వేగానికి లోనయ్యేలా చేసింది. శేఖర్ కొండా కొరియోగ్రఫీలో ఈ సాంగ్ మొత్తం కచేరీ వాతావరణాన్ని సృష్టించింది. వీడియో చివర్లో అనిరుధ్ “వన్ లాస్ట్ డాన్స్” చేయమని విజయ్‌ను అడిగి, ఆయన సంతోషంగా అంగీకరించడం హైలైట్. ఈ భావోద్వేగ టచ్‌తో ఫ్యాన్స్ లో మరింత హుశారు కలిగించింది.
విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పాటపై అభిమానులు చేసిన కామెంట్స్ భావోద్వేగాలతో నిండాయి. “వన్ లాస్ట్ టైమ్ దళపతి” అంటూ కన్నీళ్లు, మంట ఎమోజీలతో పోస్ట్ చేస్తూ, లవ్ యూ” అని ప్రశంసలు కురిపించారు. మరొకరు “దళపతి వన్ లాస్ట్ టైమ్ మిస్ వెరీ మచ్” అని రాశారు. అనిరుధ్ విజయ్ కాంబినేషన్ మరో హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
